Articles - Vidhvamsam




Name: Admin

Published Date: 05-04-2016


విధ్వంసం

                 సాయంత్రం అయిదు గంటలౌతోంది. కొడుకును స్కూలు నుండి మోటార్ బైక్ పై ఇంటికి తీసుకువెళ్లుతున్నాడు ఖలీద్. ఆ సమయం లో హైదరాబాద్ నగరం రోడ్లన్నీ ఎంతో బిజీగా వుంటాయి. స్కూల్స్ నుండి ఇంటికి వెళ్ళే విద్యార్ధులతో, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులతో పీక్ ట్రాఫిక్ వుండే సమయం అది. ఎంతో ట్రాఫిక్ వున్నప్పటికీ తమ మోటార్ బైక్ ను ఎంతో చాకచక్యంగా నడుపుతున్నాడు ఖలీద్. అతను వుండేది అమీర్ పేట్ ప్రాంతంలో. కొడుకు చదువుతున్న స్కూలు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర వుంది.ఇంతలో జేబులో వున్న సెల్ ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో మ్రోగింది. అతి లాఘవంగా ఒక చేత్తో బైక్ ను బేలన్స్ చేస్తూ రెండో చేత్తో సెల్ ఫోన్ అందుకున్నాడు. అందులోని నెంబరు చూసి అతని కళ్ళు ఆనందంతో విప్పారాయి. దుబాయ్ నెంబరు అది. దుబాయ్ లో వున్న తన బాస్ సుమారుగా రెండు నెలల తర్వాత ఫోన్ చెసాడంటే అది పెద్ద పనే అయ్యుంటుంది. సెల్ కట్ చేసి రెట్టించిన ఉత్సాహంతో బైక్ ను మరింత వేగంగా నడిపి పది నిమిషాలలో ఇల్లు చేరుకున్నాడు. భార్య అమీనా చిరునవ్వుతో ఎదురు వచ్చి టీ కప్పు అందించింది. కప్పు నందుకొని ఒక్క గుటకలో టీ అంతటినీ తాగేసి తన లివింగ్ రూములోనికి వెళ్ళి తలుపేసుకొని సెల్ ఫోన్ లోని సిం కార్డును మార్చేసి ఇందాకటి నెంబరు చక చక డయల్ చేసాడు. 'హల్లో! ఖలీద్ ఎలా వున్నావు? అట్నుంచి ఆప్యాయంగా పలకరించాడు అమీనుల్లా. 'మీ దయ వలన బాగానే వున్నాను సార్. క్రిందటిసారి కాంట్రాక్ట్ వలన బాగానే మిగిలింది సాహెబ్' అతి వినయంగా జవాబిచ్చాడు ఖలీద్. 'ఈసారి అంత కంటే మంచి కాంట్రాక్ట్ మా హెడ్ ఆఫీసు నుండి వచ్చింది. హైదరాబాద్ లో నాలుగు ప్రదేశాలలో బాంబ్ బ్లాస్టింగ్ చెయ్యాలి. ప్రాణ నష్టం కనీసం రెండు వందలు వుండాలి. ఎలా ప్లాన్ చేస్తావో నీ ఇష్టం. కాంట్రాక్ట్ మొత్తం యాభై లక్షలు. అడ్వాన్స్ కింద ఇరవై లక్షలు నాలుగు రోజులలో నీకు అందే ఏర్పాటు చేస్తాను. ఒకే ?' అతి క్లుప్తం గా చెప్పాడు అమీనుల్లా. 'ఒకే సార్. థాంక్యూ వెరీ మచ్. ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నాది. డిటేయిల్స్ మొత్తం వర్కవుట్ చేసి మీకు ఫోన్ చెస్తాను' చెప్పాడు ఖలీద్.'చివరగా ఒక్క విషయం గుర్తుంచుకో. ప్రభుత్వం మనవాళ్ళ కోసం డేగ కళ్ళతో ఎదురు చూస్తోంది. ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ మొత్తం దేశమంతటా మన కోసం గాలిస్తున్నాయి. ఈ పరిస్థితులలో హాండిల్ చెయ్యడం చాలా కష్టం. ఆసలు ఖాజా గ్రూపుకు ఈ ప్రొజెక్ట్ ఇవ్వాలనుకున్నాం కాని నీ ట్రాక్ రికార్డ్ చూసి నీకు ఈ ప్రాజెక్ట్ అప్పజెపుతున్నాను. ఈ ప్రోజెక్ట్ పట్ల మన సెంట్రల్ కమిటీ చాలా ఆసక్తిగా చూస్తోంది. ఫెయిల్ అయిందో నువ్వు నీ కుటుంబం మొత్తం మటాష్ అయిపోగలరు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. సో బీ కేర్ఫుల్' కాస్త తీవ్రం గా చెప్పాడు అమీనుల్లా. 'మీరేం ఫికరు కాకండి సార్. నేనే మొత్తం..' ఖలీద్ ఇంకా ఏదో చెప్పబోయెంతలో ఫోన్ కట్ అయ్యింది. ఆనందంతో ఎగిరి గంతేసాడు ఖలీద్. యాభై లక్షల కాంట్రాక్ట్. ఆమునిషన్, తన వారికి మరియు ఇతర ఫార్మాలిటీస్ కు ఒక పదిహేను ,ఇరైవై దాకా ఖర్చయినా సులువుగా ముప్పైకి పైగా మిగుల్తాయి. ఒక సంవత్సరం పాటు హాయిగా దుబాయ్ వెళ్ళి తన దోస్త్ లందరినీ చూసి రావచ్చు. వెంటనే ఫ్రిజ్ నుండి విస్కీ బాటిల్ వోపెన్ చేసి ఒక లార్జి పెగ్గు కలుపుకొని త్రాగనారం భించాడు. దాంతో పాటే ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ చెయ్యాలా అన్న ఆలోచన కూడా ప్రారంభించాడు. ఖలీద్ చాలా తెలివైన వాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోగా మేనమామ ఇంట్లో పెరిగాడు. తన స్వంత వారి నుండే కాక ఇతరుల నుండి కూడా నిరాదరణ, ప్రేమ రాహిత్యం లభించడంతో ఖలీద్ మనస్తత్వం రెబిలియన్ గా మారిపోయింది. దొంగతనాలు నేర్పుగా చెయ్యడం, అమ్మాయిలను రేప్ చెయ్యడం వంటివి చేయడం ప్రారంభించాడు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో హైదరాబాద్ లో ఒక రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించాడు. రాజకీయ ప్రయోజనల రీత్యా హత్యలు, కిడ్నాపింగులు, మత ఘర్షణలు రేపడం వంటివాటిలో ఆ నాయకుడి నీడలో వుండి తర్ఫీదు పొందాడు. ఆ తర్వాత ఒక విదేశీ గూఢచారి సంస్థ ఏజెంట్ తో పరిచయం ఏర్పడింది. ముడి పదార్ధాలతో బాంబులను చెయ్యడం, అతి లాఘవం గా వాటిని రిమోట్ కంట్రోల్ తో పేల్చడం వంటి విధ్వంసకర కార్యక్రమాలలో కూడా ఖలీద్ ట్రైనింగ్ పొందాడు. ప్రస్తుతం దేశంలో ఆరు ప్రధాన పట్టణాలలో ఆ విదేశీ గూఢచారి సంస్థ తరుఫున కార్యకలాపాలను సాగిస్తున్నాడు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో బాంబ్ బ్లాస్టింగ్ చెయ్యడం ఒక వంతయితే ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా చట్టానికి దొరకకుండా తన విధులను నిర్వర్తించడం మరొక ప్రత్యేకత. ఒకటి రెండు సంధర్భాలలో ఖలీద్ కార్యకలాపాల పట్ల ఒక పోలీస్ అధికారికి అనుమానం కలగడం వలన ఆ విదేశీ సంస్థ ప్రమేయంతో ఆ పోలీస్ అధికారిని గుట్టు చప్పుడు కాకుండా యాక్సిడెంట్ చేయించేసాడు. ఈ వ్యవస్థకే ఒక చీడ పురుగు లాంటి వాడు ఖలీద్.అనుకున్న విధంగా రాత్రి, పగలు కష్ట పడి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాడు ఖలీద్. తనకు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన కరీం భాయి కు ఆ ప్లన్ కాపీని అందజేసాడు. ఇరవై నాలుగు గంటల్లో అమీనుల్లా నుండి అప్రూవల్ లభించింది. రెట్టించిన ఉత్సహంతో ఒక విదేశీ ఏజెంట్ ద్వారా ఎక్స్ ప్లోసివ్స్ ను సంపాదించి , భాగ్యనగరం శివార్లలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వున్న కరీం భాయి ఇంట్లో మూడు రోజులు అత్యంత శ్రద్ధతో పనిచేసి బాంబులను అసెంబుల్ చేసాడు ఖలీద్. ఆకర్షణీయంగా, టెడీ బేర్ లాంటి బొమ్మలతో, టిఫిన్ కారియర్, రేడియో, వి సిడి ప్లేయర్, మొబైల్ ఫోన్ లలో అతి నైపుణ్యం గా అమర్చాడు. వాటిని రెండు వందల మీటర్ల దూరం నుండి సెల్ ఫొన్ లా వుండే రీమొట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చెయ్యవచ్చు. తను ప్లాన్ చేసిన ఆ విధ్వంసకర రోజు రానే వచ్చింది. ఆ రోజు సోమవారం. శెలవు తర్వాత స్కూలు, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధులతోనూ, ఉద్యోగాలకు వెళ్ళే వారితోనూ, వ్యాపారస్థులతోనూ అతి సందడిగా వుండే నగరపు నాలుగు ప్రాంతాలలో వాటిని అమర్చాడు ఖలీద్. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రెండు కిలోమీటర్లు వుండేలా ప్లాన్ చేసుకున్నాడు. పది గంటల సమయం నుండి తన ఆపరేషన్ ప్రారంభించాడు. అరగంట వ్యవధిలో నగరంలో నాలుగు ప్రదేశాలలో బాంబులను పేల్చాడు. బాంబులు చాలా శక్తివంతమైనవి కావడాన్న విధ్వంసం బాగా జరిగింది. మరణించిన వారితో, తీవ్రంగా గాయాలైన వారితో ఆ ప్రదేసాలు రక్త సికమై పోయాయి. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ వంటి భాగ్యనగరం క్షత్రగాత్రుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి రంగంలోకి దిగింది. తన పనిని సురక్షితం గా ఎవరి కంటా పడకుండా పూర్తి చేసిన ఖలీద్ వెంటనే కరీం భాయితో కలిసి ఆ మధ్యాహ్నం విమానం లోనే బొంబాయి వెళ్ళిపోయాడు. విమానం లో కూర్చున్న తర్వాత భార్యకు ఫోన్ చేద్దామని ఎంతగానో ప్రయత్నించడు కాని భార్య సెల్ రింగ్ అవుతొంది కాని ఎత్తడం లేదు. బాబును స్కూలులో దీంచి వచ్చే టైము కాబట్టి బహుశా తొందరలో ఇంట్లో సెల్ మరిచిపోయి వెళ్ళి వుంటుందనుకొని, బొంబాయి చేరాక ఫోన్ చెయ్యవచ్చని సెల్ ఆఫ్ చేసేసాడు. బొంబాయిలో కార్ ఘర్ లో తన స్నేహితుడి ఇంట్లో కరీంతో సహా దిగడు. అక్కడే టి వి లో హైదరాబాద్ లో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పడ్తున్న హడావిడి, జరిగిన విధ్వంసకాడ గురించి మీడియాలో వస్తున్న వార్తలను ట్రాక్ చేస్తునే వున్నాడు. భార్యను కాంటాక్ట్ చేద్దామనుకున్నాడు గాని పొరపాటున హైదెరాబాద్ కు వెళ్ళే కాల్స్ ను టాప్ చేసే ప్రమాదం వుంది కనుక ఆ ప్రయత్నం చేయవద్దని కరీం గట్టిగా హెచ్చరించినందున విరమించుకున్నాడు ఖలీద్.జరిగిన విధ్వంసానికి మేమే కారకులమని ఒక ఊరూ, పేరూ లేని సంస్థ విదేశాల నుండి ప్రకటన విడుదల చేయగా దోషులను పట్టుకొని తీవ్రంగా శిక్షిస్తామని ప్రభుత్వ గట్టిగా శపధం చేసింది. మానవ హక్కులు మరియు ఇతర సంఘాలు సామాన్యుల పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి. విపక్షాలు, ప్రభుత్వం పరస్పర ఆరోపణలతో మాటల యుద్ధం చేసుకున్నాయి. పది రోజులలో అంతా సర్దు ముణిగింది. బాం బు పేళ్ళుళ్ళ పై అదే పనిగా ఊదరగొట్టిన మీడియా నెమ్మదిగా శాంతించి మరొక సెన్సేషన్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తోంది. తిరిగి హైదెరాబాద్ వచ్చేసాడు ఖలీద్. ఈ ఆపరేషన్ లో బాగా మిగిలాయి. భార్య కిచ్చిన మట ప్రకారం ఇక ఇటువంటి తీవ్రవాద కార్య కలాపలకు ఫుల్ స్టాప్ పెట్టెయాలని నిర్ణయించుకున్నాడు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే టాక్సీ మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో షాపింగ్ మాల్ లో ఆగి కొడుకుకి, భార్యకీ కావల్సిన వస్తువులను కొన్నాడు. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళి భార్యా బిడ్దలను చూద్దామా అని అతని మనసు ఆతృత పడుతోంది. ఎంతటి క్రూరుడికైనా మనసులో ఏ మూలో ప్రేమ బ్రతికే వుంటుంది. క్రూరత్వపు ఛాయలు తగ్గినప్పుడు ఈ ప్రేమ బయట పడుతూ వుంటుంది. ఖలీద్ కు కూడా అంతే. భార్యా బిడ్డలపై అమితమైన ప్రేమ అతనికి. అపార్ట్ మెంటుకు చేరుకున్నాక చూస్తే తాళం వేసి వుంది. అప్పటికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. ఈ టైములో వీరు ఎక్కడికి వెళ్ళి వుంటారబ్బా అనుకుంటూ పక్క ప్లాట్ బెల్ నొక్కాడు. తలుపు తీసిన సుందర శాస్త్రి గారు ఖలీద్ ను చూడగానే విచారంతో బావురుమన్నారు. కుల, మత భేధాలు లేక కొడుకు కంటే ఎక్కువగా ఖలీద్ ను చూస్తారాయన. అందుక్కారణం సుందర శాస్త్రి గారికి పిల్లలు లేకపోవడమే. వారి కుటుంబానికి తల్లో నాలుకగా మెదిలే వాడు ఖలీద్. తన భార్యను, కొడుకును అమితంగా ఆదరించే కుటుంబం వారిది. 'ఏమయ్యింది అంకుల్?' మనసులో ఏదో అపశృతి దొర్లుతుండగా గాభరాగా అడిగాడు ఖలీద్.'చాలా ఘోరం జరిగిపోయింది నాయనా! గత నాలుగో తారీఖున మన నగరంలో బాంబు పేళ్ళుళ్ళు జరిగాయి కదా! ఆ రోజున కోడలు పిల్ల మనవడిని తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. భగవంతుడు మన పట్ల చాలా నిర్ధయంగా ప్రవర్తించాడు. ఆటో దిగి డాక్టర్ దగ్గరకు వెళ్తుండగా ఆ ప్రక్కనే బాంబు పేలిందిట. కోడలు మనవడు అక్కడికక్కడే …' దుఖంతో సుందర శాస్త్రి గారి గొంతు పూడిపోయింది. ఆ మాటలు వింటూనే ఖలీద్ కాళ్ళ క్రింద భూమి అతి వేగంగా తిరుగుతున్నట్లనిపించింది. మస్తిష్కం లో వేయి బాంబులు పేలినట్లనిపించింది. ఆప్రయత్నంగానే ఆసరా కోసం గుమ్మాన్ని పట్టుకున్నాడు. ఇంతలో సుందర శాస్త్రి గారు లోపలి నుండి వచ్చిన అన్నపూర్ణమ్మ గారి సహాయంతో ఖలీద్ ను తీసుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టారు. ఎంతో ఆప్యాయతతో చల్లని నీరు త్రాగించారు. 'కోడలు పిల్ల పక్కన శిధిలమై వున్న బ్యాగ్ లో అడ్రస్ కాగితం ఆధారంగా పోలీసులు ఈ దుర్వార్తను మనకు అందించారు. అంకులే పోలీస్ స్టేషనుకూ, ఆస్పత్రికీ వెళ్ళి అన్ని పనులను చేసి రెండు శవాలనూ ఇంటికి తెచ్చారు. అంత విధ్వంసంలోనూ బాబు చేతిని కోడలు పిల్ల వదలలేదట. ప్రక్క వీధిలో వున్న ఆ ముస్లిం టైలరు వారి సహాయంతో అంతిమ సంస్కారాలను పూర్తి చేసారు. నువ్వేమో ఏదో వ్యాపారం పని మీద ఊరు వెళ్ళావట. నీ ఫోనుకు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు...' ఏవేవో చెప్పుకు పోతున్నారు అన్నపూర్ణమ్మ గారు. అటుపై ఏమీ వినిపించడం లేదు ఖలీద్ కు. తానింత కాలం చేసిన పాపాలు దావానలంలా తన శరీరాన్ని, మనస్సునూ దహించి వేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు ఖలీద్.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.