Articles - Thodu Needa
Name: Admin

Published Date: 05-04-2016


తోడు...నీడ

Miss rajeswari rajeswarinedunuri అది ఒక పెద్ద దివాణం. వందేళ్ళ క్రిందట కట్టిన మండువా లోగిలి. తాతల నాటి నుంచి తర తరాలుగా వస్తున్న వంశ పారం పర్యపు జమీందారీ ఇల్లు. పాత బడి రాలిపోయిన పెంకులు. అక్కడక్కడ ఇటుకలూడి పోయి, సున్నం రాలిపోయి పెచ్చులు పెచ్చులుగా మిగిలిన గోడలు ఎండకెండి వానకి తడిసి పాకుడు గట్టిన పిట్ట గోడలు, ఒక నాటి వైభవానికి చిహ్నంగా నాకాదరణ లేకపోయినా మాటలు వస్తే మీకు బోలెడు కధలు చెప్పగలను అన్నట్టు గా వృద్ధాప్యంలో ఉంది ఆ ఇల్లు. వీధి వైపు ఎత్తైన అరుగులు అటు ఇటు అరుగుల మధ్య క్రిందికి దిగేందుకు కొద్ది కొద్దిగా విరిగిన మెట్లు. ఆ మెట్ల నుంచి అర కిలోమీటరు దూరం గేటువరకు ఎడా పెడా కొబ్బరి అరటి లాంటి చెట్ల తో బాటు రకరకాల పూల మొక్కలు. గేట్లో అడుగిడగానే దివాణంలో కొచ్చేవరకు దారిపొడవునా కన్నుల కింపుగా మనసుకి హాయిగా చల్లని పిల్ల గాలులతో తలలూపుతూ సువాసనలతో స్వాగతం పలుకుతుంటాయి. నలుగురు పాలేళ్ళు ఆడా మగా కలిసి మరో ఇద్దరు పని వాళ్ళు ఆ ఇంటి యజమానితో బాటు ఆ మొక్కల ఆలనా పాలనా చూస్తూ ఉంటారు. ఆ ఇంటి యజమాని రామారావు తాత తండ్రులను తల్చుకుంటూ ఆ ఇంట వెలిగిన సిరి సంపదలను, భోగ భాగ్యాలను గుర్తు చేసుకుంటూ అంతిమ దశలో అక్కడే గడపాలన్న కోరికతో పని వాళ్ళను ఆసరాగా చేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు. ఏడు పదులు దాటినా యవ్వనపు సౌందర్యాలు తొంగి చూస్తూ ఇప్పటికీ అందంగా ఆకర్షణీయంగా చలాకీగా హుషారు గా ఉంటాడు రామారావ్. సాయం సంధ్య అంత వరకు నిప్పులు గక్కిన సూర్యుడు చల్లారిన కోపాగ్నితో పడమటి కొండల్లోకి జారు కుంటున్నాడు. తన అస్తమయానికీ కులుకుతూ రాబోతున్న చంద్రునికీ మధ్య ఎవరికీ చెందని సంధ్య ని చూస్తూ బాధ గా వెళ్ళ లేక వెళ్ళ లేక వెడుతున్నట్టు. నీకెందుకు బాధ నా చల్లని కిరణాలతో నిన్నలరించనా అనుకున్న చంద్రుడు ఆకాశపు వెలుగులో వెల వెలబోతు పరుగులు పెడుతున్నాడు. పిచ్చి మొహాలు. ఒకరి నిష్క్రమణం మరొకరి ఆగమనం ఎందుకొచ్చిన ప్రయాస? నేనెవరికీ చెందని ఏకాకిని. నాకు తోడు నీడలూ, బంధాను బంధాలు ఏమీ లేని ఒంటరిని అన్నట్టు పేలవంగా నవ్వుతూ తన నీలి నీలి సంధ్య కాంతులను విరజిమ్ముతున్న ఆ సంధ్యా సమయంలో ఆ చెట్ల మధ్య రాకింగు చైర్లో ముందుకీ వెనక్కీ ఊగుతూ మేను వాల్చి ప్రకృతిని తిలకిస్తున్నాడు... అదే మన రామారావ్. సరిగ్గా నేను నీ లాగే సంధ్యా సమయంలో ఉన్నాను. అటు కన్న వాళ్ళకీ, ఇటు కట్టుకున్న వాళ్ళకీ, ప్రేమించిన వాళ్ళాకీ, ఐన వాళ్ళకీ అందరికీ అతీతంగా, దూరంగా ఇలా నాకు నువ్వు నీకు నేను తోడుగా ప్చ్ తన ఆలోచనకి సన్నని నవ్వు పెదవుల మీద విరక్తి గా కదిలింది. నీతో నాకు పోలికేమిటి? నువ్వు ప్రకృతి సిద్ధ మైన సంధ్యవి జగతి ఉన్నంత వరకు చిరంజీవివి. మరి నేను? నీకు నేను తోడేమిటి ? నువ్వే అందరికి తోడు. అసలు నిజానికీ లోకంలో ఎవరికెవరు తోడు కాదు.అంతా భ్రమ.ఈ ప్రకౄతి సిద్ధ మైన అంద చందాలే మధ్య లో వచ్చిపోయే మానవ విన్యాసాలకి ప్రతీకలు. రాజులైనా, రారాజులైనా విధి వంచితులే. ఎవరూ మిగలరు.. ఏదీ ఉండదు. అనుకుంటూ తన ఆలోచనలతో పాటు కుర్చీలో ముందుకీ వెనక్కీ ఊగుతూ అనుకుంటున్నాడు. నిన్న పార్వతికి ఏమందని? తనకెంతో ఆశ్చర్యం వేసింది ఆమె అలా అంటుందనుకో లేదు పాతికేళ్ళ పరిచయం పది నిముషాల్లో తేల్చేసింది.

పార్వతీ నాతో వచ్చెయ్య రాదూ ఇద్దరం మన దివాణం లోనే ఉదాం 'అన్నాడు తను' నేనా? రావు గారూ?' ఉలిక్కి పడింది. అక్కడికి అదే మీ ఇంటికి, దివాణానికి నేను...నేనెలా రాగలను? తడ బడుతూ నసిగింది. 'అవును పార్వతీ నిన్నే నిన్నే అడుగుతున్నాను. ఏమిటి అభ్యంతరం? నాతో వచ్చెయి. ఇద్దరం ఈ దివాణం లోనే ఉందాం. రోజూ కోర్టుకి కారులో వెళ్ళి రావచ్చు. ఎలాగూ డ్రైవర్ ఉండనే ఉన్నాడు, అన్నాడు సౌమ్యంగా 'అబ్బే రాక పోకల గురించి కాదు. అసలు నేను మొత్తం ఇల్లు తాళం పెట్టి రావడం ఎలా కుదురు తుందీ అని? ' 'అంటే ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు తాళం పెట్టి వస్తూనే ఉన్నావు గా?' 'అవుననుకోండీ. కానీ ఈ రావడం వే...రు... అంటూ తలదించు కుంది. 'ఏం? ఎందుకు వేరు.? మన పరిచయం పది మందికీ తెలిసిందేగా? పైగా పాత బడి పోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరో ఏదో అనుకుంటా రనుకోవడం అవివేకం. చదువు కున్న దాని,వీ నీకు నేను చెప్పేందు కేముంది? ఇన్నాళ్ళు వృత్తి రీత్యా నాకు చేదోడు వాదోడుగా ఉన్నావు. ఇప్పుడు జీవితంలో భాగం పంచుకోమంటున్నాను... తప్పా?' కొంచం కోపంగా గట్టిగానే అన్నాడు. 'భాగం పంచుకునేంత గొప్ప తనం నాకు లేదు కానీ' అర్ధోక్తిగా ఆపేసి అతని ముఖంలోకి చూసింది. 'ఊ....ఆపేశావేం?' కోపంగా రెట్టిం చాడు. 'ఏం లేదు. ఇప్పటికే మీ భార్య కి తీరని ద్రోహం చేసాను.ఇంకా... ఇంకా 'ద్రోహం చెయ్యను అంటావ్? విరగ బడి నవ్వాడు. ఎంత ఆదర్శం? బ్రతి కుండగా చేసిన ద్రోహం ఆవిడ చచ్చిపోయాక గుర్తొచ్చిందా? నిజం చెప్పాలంటే నీ పరిచయం మూలంగానే ఆవిడ కృంగి కృసించి, ఏడ్చి ఏడ్చి, మనో వ్యాధి తో చచ్చి పోయింది. ఆమె ఎంత ఏడ్చి మొత్తుకున్నా నేను మాత్రం నిన్ను వదులుకో లేక పోయాను. చివరికి విసిగి వేసారి మనల్ని స్వేచ్చ గా వదలి తాను వెళ్ళి పోయింది. ఇక నువ్విప్పుడు ఆమెకి కొత్తగా చేయ బోయే న్యాయం ఏముంది?' అన్నాడు వ్యంగ్యంగా.

నిజమే తన భర్త తనకి దూరమై పోతున్నాడన్న బెంగతోనే ఆమె మంచం పట్టింది. ఆ పాపం తనదే. ఇక ఇప్పుడు కొత్తగా చేకూర్చే న్యాయం ఏముందని' పార్వతి తన పొరబాటుకి మానసికంగా ఇప్పు డిప్పుడే ఆమె మరణానంతరం గ్రహించి బాధ పడుతోంది. కానీ జరిగి పోయిందానికి ఎవరు మాత్రం ఏం చేయగలం? లోలోన మదన పడుతూనే ఉంది. 'అవన్నీ కారణాలు కావు గానీ నాకు పిల్లలున్నారు కదా? వాళ్ళెప్పు డైనా వస్తె నేనుండాలి... అందుకనే రావు గారూ నా తపన' తప్పు చేసిన దానిలా తల దించు కుంది. 'శెభాష్ చక్కగా చెప్పావ్.. నీ ఇల్లు, నీ పిల్లలు, నీ సంసారం నీవన్నీ నీకు ఎప్పటిలానే ఉండాలి. నానుంచి లభించే వన్నీ మార్పు లేకుండా నీకు లభిం చాలి. నేను మాత్రం ఏ కాకిలా ఎక్కడ పడున్నా ఫర్వాలేదు...బాగుంది. చాలా బాగుంది. ఎంతైనా ఆడదానివేగా నీ అనుబంధాలు నీ కట్టు బాట్లు నీ కుండాలి. నేను మాత్రం నా ఇల్లు, పిల్లలు అనుబంధాలు ప్రేమాను రాగాలు తెంపేసు కోవాలి. పోన్లే ఇప్పటి కైనా నా కళ్ళు తెరిపించావ్. నాకు మాత్రం పిల్లలు లేరూ? వాళ్ళకి నేను మాత్రం అవుసరం కాదా? మంచి బుద్ధి చెప్పావ్... థాంక్స్ నా ఇంటికి నేను వెడుతున్నాను. గుడ్ బై' అంటూ విస్సురుగా, ఆవేశంగా వచ్చేసాడు. నిజమే అసలిప్పటికే ఈమె పరిచయంతో తను ఐన వాళ్ళందరికీ దూరమయ్యాడు. భార్య లలిత సరేసరి... ఆ బెంగ తోనే మంచం పట్టి మరణించింది. ఇక కూతురూ, కొడుకూ ముఖం మీద అనక పోయినా చాటుగ తన మీద పగే. అందుకే చదువులు, పెళ్ళిళ్ళు అయ్యాక అవకాశం వచ్చింది కదా అని అమెరికాలకి ఎగిరి పోయారు. పైగా మీకు మాతో అవుసరం ఏముంది? మీకు మీ పార్వతి ఉంది కదా ఐనా ఇక మా అమ్మే లేక పోయాక మీతో మాకేం పని? ఇక ఆస్తి మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేసుకోండి అని దెప్పి పొడిచారు. 'నిజమే నాకు పార్వతి ఉందిగా... మీ అవకాశాలు మీరు వదులు కోకండి, సలక్షణం గా వెళ్ళండి... అదీ నాకు దూరంగా' అని మరింత మొండిగా, బింకంగా అన్నాడు. అప్పుడు...'అవును మా అమ్మే లేనప్పుడు మాకింకెవరున్నారు? అని బాధ పడుతూ మనవల్ని తీసుకుని వెళ్ళి పోతుంటే గుండెల్ని పిండే బాధని అనుభవిస్తూ అలా శిలలా బిగుసుకు పోయాడే తప్ప ఆ రక్త బంధాన్ని ఆదరించి ఆపు జేసుకో లేక పోయాడు. ఈ కసాయి దాని ప్రేమ కోసం తీరా అది కళ్ళు తెరిపించాక ఏముంది? శూన్యం? అప్పట్లో అనుకున్నాడు. తను వాళ్ళతో వెళ్ళి వాళ్ళ పంచన పడి ఉండటం కంటే ఇక్కడ పార్వతితో స్వేచ్చ గా ఉండచ్చని. అందుకే ఉన్న ఆస్తులు పొలాలు తోటలు అమ్మి సొమ్ము చేసి మనవల పేర్న బ్యాంక్ లో వేసి ఉంచాడు. కానీ పార్వతి ఇలా ఎదురు తిరుగుతుందనుకో లేదు. ఎంతైనా మగవాళ్ళు తెంచుకున్నంత తొందరగా ఆడవాళ్ళు అనుబంధాలను తెంచుకోరు. ఇదంతా తన తెలివి తక్కువ. ఎంత తెలివి, ఎన్ని డిగ్రీలు ఉంటేనేం జీవితానికి పనికి రానప్పుడు దండగే. అసలీమెతో పరిచయమే పెద్ద పొరబాటు.

నిజానికి తన సహోద్యోగి మాత్రమె.అంతగా పరిచయం లేదు. హఠాత్తుగా భర్త పోవడంతో ఇద్దరు పసి పిల్లల్ని తీసుకుని తనని ఆశ్రయించింది. సాటి వ్యక్తి గా తోచిన సాయం చేసాడు. ఆమె కుడా లా చదవడంతో పనిలో సాయపడేది. రాను రాను స్నేహం పెరిగి పెరిగి విడరాని బంధమైంది. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. దివాణం నిండా జనం. అమ్మా, నాన్న, తాతగారు, నాన్నమ్మా, పిన్నీ, బాబాయి, తమ్ముడూ, మరదలు, పిల్లా పెద్దా పాపల్తో కలకల లాడుతూ ఇల్లంతా సందడి గా ఉండేది. ఇక్కడ్నుంచి దగ్గర లోనే ఉన్న పొరుగూరికి పిల్లలు స్కూళ్ళకీ పెద్దలు ఉద్యో గాలకి వెళ్ళడం పరిపాటి. ఇక పాలేళ్ళు, పని వాళ్ళ మధ్య కోడళ్ళు కుడా ఇంటి పనికే అంకితం. పాడీ, పంటా, వంటా వార్పు, అత్తా, మామా వచ్చే పోయే జనం అందర్ని అన్నీ సమర్ధించుకుని భార్య అనే వ్యక్తి ఏ రాత్రి పదింటికో వెండి మరచెంబుతో నీళ్ళు తీసుకుని గదిలో అడుగు పెట్టేది. సరిగ్గా ఆ రోజుల్లోనే పార్వతి పరిచయం తనకి పన్నీటి జల్లులా తోచింది. అది అలా అలా పెరిగి పెరిగి చివరికి తన డబ్బుతోటి పార్వతి ప్రాణాలు తీసింది. ఈలోగా పెద్ద లందరు ఒక్కొక్కరే నిష్క్ర మించటం... పిల్లలందరు పెళ్ళిళ్ళు, ఉద్యోగాల నెపంతో దూరాభారాలకు తరలిపోయారు. ఆమె పిల్లల బాధ్యతలు కుడా తీరి పోవడం యాంత్రికంగా కాలంతో పాటు కదలి పోయాయి. ఏదో ఒక ఆకారంగా ఉందనుకున్న భార్య తన వల్ల విసిగి అలసి పోయి నా ఖర్మానికి నన్ను ఒంటరి గాణ్ణి చేసి తన దారిన తాను వెళ్ళి పోయింది. ఇప్పుడు తను ఏకాకీ వాలని ఏకాకిగా మిగిలి పోయాడు. అగ్ని సాక్షి గా తన దనుకున్న భార్య తనని విడిచి వెళ్ళి పోయాక ఎవరి భార్యో తనతో ఎందుకుంటుంది? తనెంత పిచ్చివాడు? ఒంటరి తనమే, కాదు వృధాప్యం కుడా ఎంత భయం కరమో ఇప్పుడర్ధ మైంది. ముఖ్యంగా భార్యా భర్త లిద్దరిలో ఏ ఒక్కరు మిగిలినా జీవితం దుర్భరమే. ఒకరి కొకరు తోడు నీడగా, మంచి స్నేహితుల్లా కోరికల కతీతంగా ఒకరి కోసం మరొకరు నిర్మల మైన ప్రేమతో సాగించే జీవనయానం ఎంత మధుర మైనది? బరువు బాధ్యతలు, కలిమి లేములు, ఒడి దుడుకులూ అన్నిటినీ దాటి హాయిగా శేష జీవితాన్ని గడిపే దంపతులు ఎంత దృష్టవంతులు? తన ఈ ఒంటరి పయనం ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో? ఎవరున్నా లేక పోయినా అన్ని విధాలా అండగా ఉంటుందనుకున్న పార్వతి తన ఆశని వమ్ము చేసింది. ఆమెని నమ్ము కోవడం తనదే తప్పు. కేవలం తన అవుసరాలకి ఒక పావులా వాడుకుంది. తన అనుబంధాలేవీ వదులు కోలేదు. నేనే ఆమె వ్యామోహంలో పడి సర్వం మర్చి పోయాను. అదొక మైకం... పిచ్చి... ఆ మైకం లో భార్యని ఎంత బాధించానో తలుచు కుంటే బాధగా ఉంది కానీ ఆమె ఎంత నిక్కచ్చిగా చెప్పిందని? అదే తేడా అందుకే స్త్రీ లాలిత్యంలో మగవాడు ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. అలా రాజులూ రారాజులూ మన వేమనా, భర్తృహరి లా ఎందరో మరెందరో. ఆ వయసు దోషమే అంత. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది ? ఆనాడు సర్వం తన కోసమే ప్రాకులాడిన భార్య లలితని కాదని, ఆమెను బాధించి తిరిగాడు. నేడు తనదనుకున్న పార్వతి దులపరించుకుని ఏమీ కానట్టు వెళ్ళి పోయింది. చివరికి తను అందరికీ దూరమైన విగత జీవిగా మిగిలిపోయాడు. నన్ను క్షమించు లలితా భర్తగా నీకు న్యాయం చేయలేక పోతున్నానన్న బాధ, నీకు దూర మై పోతున్నాననే వేదనా... నన్ను వెన్నాడుతున్నా అది మర్చి పోవడానికే బలహీన పడి ఆమెకి దగ్గరయ్యాను. ఇప్పుడు నన్ను విడిచి స్వేచగా నువ్వు దూరతీరాలకు వెళ్ళిపోయావ్. ఎవరో కవి అన్నట్టు నీ నుండి దూరమౌతా నన్న వేదన నా హృదయాన్ని కాల్చేది అప్పుడు కౄర విధి మనల్ని వేరుచేసి నీవు లేకుండా బతక మన్నది ఇప్పుడు. అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు రామారావ్ ఒం...టరి...గా...Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.