Articles - Thalavampulu




Name: Admin

Published Date: 05-04-2016


తలవంపులు

ఆ అమ్మాయీ.. ఆ అమ్మాయి తల్లిదండ్రులూ... వాళ్ల పేర్లేవీ తెలుసుకోవలసిన అవసరం లేదు. భారతదేశంలో ఎక్కడ చూసినా వాళ్లు కనిపిస్తారు. ఆ అమ్మాయికి యుక్త వయస్సొచ్చిందని వేరే చెప్పక్కర్లేదు. వయస్సుతో పాటు ఆడపిల్లల్లో వచ్చే మార్పులు ఆ అమ్మాయిలోనూ కనిపిస్తున్నాయి. కన్నుల్లో కొత్త కాంతులు.. మేనివంపుల్లో సొంపులు... నడకలో నాట్యమయూరాల హొయళ్లు... ఆ అమ్మాయిని చూస్తున్న కుర్రకారు కళ్లల్లో వింత మెరుపులు... ఇవన్నీ...; ఆ అమ్మాయికి యుక్త వయస్సొచ్చిందని చెబుతాయి! ఇక .., ఆ అమ్మాయి ఆశలూ ..కోరికలూ..., పరువంతో పాటే రెక్కలు విచ్చుకున్న హంసలయ్యాయి! 'ఒక పెద్ద ఉద్యోగి తనకు భర్తగా దొరుకుతాడనీ, తనను అతను ఎంతో అపురూపంగా చూసుకుంటాడనీ, సినీ స్టంట్ హీరోలా ఉండి, వేలాది మందిని వేళ్లతో మట్టి కరిపిస్తాడనీ, ఆపై.. తనను అతని బాహుబంధాలో ఇరికించుకుంటాడనీ...' ఆలోచించుకుంటోందా అమ్మాయి. ఆమెదో అరుదైన రాజ్యం.. అందులో ఆమె రాణీ... ఆమెకు కాబోయే భర్త ఒక రాజా! కాబోయే భర్తా.. రాబోయే చిన్న సంసారం... ఆమె ఊహలనించి తప్పించుకోలేకపోతున్నాయి! *********** ఆ అమ్మాయి తల్లి... ఆ అమ్మాయిని చూసి మురిసిపోవటల్లేదు.. ఆవిడ గుండెలు గుబగుబలాడి లబలబమంటున్నాయి... గుండెలపై కుంపటినెలా వదలించుకోవాలా అని చూస్తున్నాయి! ఆ అమ్మాయినొదిలించుకుంటే... మరో.. అమ్మాయి... ఆపైన, మరో.. అమ్మాయి... మొత్తం.. ముగ్గురమ్మాయిలు! మగపిల్లాడిని కనాలని కలలు కన్నది! కలలు కల్లలయ్యాయి! ముగ్గురు అమ్మాయిలను కనేసింది! ఇక లాభం లేదనుకుంది! ఆపరేషన్ చేయించేసుకుని పిల్లల్ని కనే పద్ధతికి మంగళం పాడింది! ఆవిడ... తన కూతురైన ఆ అమ్మాయి గూర్చీనుకుంటోంది... 'లాభంలేదు. అమ్మాయి పెళ్లి చెయ్యాలి. ఏ ఈడులో ముచ్చట ఆ ఈడులో జరగాలి. తనకైతే ఈ ఈడుకే ఇద్దరు పిల్లలు! ఏం దేశమో?! ఏంపాడో?! మన దేశపు కట్టుబాట్లే మన మెడకు ఉచ్చులయ్యాయి. పిల్లల వివాహం పెద్దలు నిర్ణయించే సమాజం మధ్య బ్రతుకుతున్నాం! డేటింగ్ సిస్టమ్ లేదు. జంట జంటలుగా డాన్సులు చేసి, ప్రేమించి, పెళ్లాడే పద్ధతుల్లేవు. ఉన్నాయి... బీద ముండా వాళ్లని అప్పుల ఊబిలో ముంచేసే కట్నాలు..! కుల - మతాల అడ్డుగోడలు! ఏ కులంలోని వాళ్లు ఆ కులంలోని వాళ్లనే పెళ్లాడే పద్ధతులు.. అందులో కూడా శాఖోపశాఖలు.. ఆ శాఖల మధ్యే వివాహాలు...! 'ప్రేమ...?!' అసలీదేశంలో ప్రేమ లేదు. ఈ దేశీయులకి ప్రేమంటే ఏమిటో తెలీదు. ఎంతసేపూ డబ్బుతో ప్రేమను కొలుస్తారు. భార్యని కాదు ప్రేమించేది? భార్య తెచ్చే కట్నాన్ని ప్రేమిస్తారు. అత్త మామల పెట్టుపోతలని ప్రేమిస్తారు. ఏదైనా తేడా వస్తే భార్యని కాటికి పంపడానికైనా సిద్ధపడతారిక్కడి మగవాళ్లు! 'ప్రేమ'.. నటన! అమ్మాయిలతో ఆడుకునే ఆలంబన..! ఆ తరువాత చేతులు దులుపుకొని పారిపోతారు! చిన్నప్పుడు తననీ ఒక మగ భీరుడు ప్రేమించాడు! 'పెళ్లి - అనేసరికి ఆమడ దూరం పారిపోయాడు. తల్లి కొంగుచాటున దాక్కున్నాడు. పరువు మర్యాదల పేరిట భయపడ్డాడు. కట్న కానుకలకెగబడి మరో అమ్మాయి మెళ్లో తాళి కట్టాడు. ప్రేమించే ముందు వెధవకి పరువు మర్యాదల విషయం గానీ, కట్న కానుకల విషయం గానీ గుర్తుకు రాలేదనుకుంటాను. కళ్లకి మైకం కమ్మి కుల - మతాల ప్రసక్తి లేదన్నాడు. తను తెలివైంది కాబట్టి- 'పె..ళ్లి....' అని రొద చేసింది. దాంతో అతను తన పొందు కూడా చవిచూడకుండా పారిపోయాడు. కాని, ఇప్పుడు తన కూతురు ఆ విధంగా తెలివిగా నడుచుకోగలదా?! ఏమో?! భయంగానే ఉంది!' ఆ తల్లి తన మస్తిష్కంలో రేగుతున్న పెను తుఫానుకు తట్టుకోలేకపోయింది. రోజూ భర్తను పోరింది... 'అమ్మాయికి సంబంధాలు చూడమని!?' ***********ఆ అమ్మాయి తండ్రి... అతనో మధ్య తరగతి కుటుంబీకుడు. అతని తల్లిదండ్రులు అతనికి పైచదువులు చెప్పించలేకపోయారు. చదువాపించి చిన్న వయస్సులోనే ఉద్యోగంలో చేర్పించారు. ఇక అతడు ఇంటి బాధ్యతలని తలకెత్తుకున్నాడు. తండ్రికి చేదోడుగా ఉంటూ, తోబుట్టువులను చదివించాడు. పెళ్లిళ్లు చేశాడు. తల్లిదండ్రుల బాధ్యతలూ - ఋణాలూ తీరాయనేసరికి... అతని పిల్లలు పెద్దవాళ్లయ్యారు! అతని జీతం ఇంటి ఖర్చులకి సరిపోదు. ఏదో పిల్లల్ని చదివిస్తున్నాడు. అతనికి తాతల నాటి ఆస్థి కింద,'బి.పీ - సుగర్ 'వ్యాధులొచ్చాయి. అతను కాస్తా గుటుక్కుమంటే... అతని ఇంటి పరిస్థితేమిటనే భయం అతడ్ని పట్టుకుంది. అప్పో సప్పో చేద్దామనుకున్నాడు. పి.ఎఫ్. లోను తీసుకోవాలనుకున్నాడు. చీటీ కట్టి విలువ తక్కువకి పాడాలనుకున్నాడు. ఇన్సూరెన్సు పాలసీ మీద కూడా లోను పొందాలనుకున్నాడు. ఆ అమ్మాయి పెళ్లి ఏడాది తిరక్కుండా చేయాలనుకున్నాడు! ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కాకుండా తిరిగాడు. 'హోరి దేవుడో! ఈ అమ్మాయికి భర్తెక్కడున్నాడో చూపించరా! చూపించు! ' అంటూ ఏడ్చాడు. అతడిని మగపిల్లలని కన్న తండ్రులు 'మీ అమ్మాయికి ఉద్యోగముందా?', 'ఎన్ని డిగ్రీలున్నాయి?', 'ఎంత కట్నం ఇస్తావు?!' అంటూ వేధించారు. ఆడపిల్లని కనడమంత బుద్ధితక్కువ మరోటుండదని అతడు చెంపలు వాయించుకున్నాడు. ********** 'దే-వు(- డు, 'కరుణించాడు... పాతిక వేల కట్నంతో ఆ అమ్మాయిని - అతడు గడప దాటించాడు. పెళ్లికొడుకు పోలియో వాడైనా... ప్రయివేటు కంపెనీలో చిరుద్యోగి! ఊరి వారు 'కాకిముక్కుకు దొండపండు' అంటుంటే... అతడు మాత్రం ఎంతో పొంగిపోయాడు! ఈ పెళ్లైనా కావడం అమ్మాయి అదృష్టమన్నాడు. అమ్మాయి నోరుని మెదపనివ్వలేదు. అమ్మాయికి ఇష్టాయిష్టాలుండకూడదన్నారు. పెద్దలే పిన్నల మంచి చూస్తారన్నారు. కొండ మీది కోతిని అతను కొనిపెట్టలేనని కూతురుకు చెప్పి నోరు మూయించాడు. బీద తండ్రి కడుపున పుట్టినందుకు ఆశలని చంపుకోవాలన్నాడు. 'పెళ్లి = రాజీ! = స్వర్గంలో దేవతల నిర్ణయం!' అని అమ్మాయికి నచ్చ చెప్పారు. ఆ తండ్రికే.. ఆ అమ్మాయి తల్లీ వంత పాడింది! మిగతా చెల్లెళ్ల పెళ్లిళ్ల గురించి నచ్చచెప్పడంతో... ఆ అమ్మాయి తల వంచుకుంది. వంగిన ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్లు బిగిశాయి! *********** ఆ అమ్మాయి.. ఆ తల్లి దండ్రుల కూతురు పెళ్లయ్యాక ఒక గృహిణి! ఇప్పుడా గృహిణి తనకున్న ఆస్థిపాస్థులేమిటో అలోచించుకుంది. బాధ్యతల వలయంలో చిక్కుకున్న ఆమె భర్తే ఆమెకో పెన్నిధి! పెళ్లి కావలసిన ఆడపడుచు.. చదువుకుంటున్న మరిది... వృద్ధాప్యంతో రోగాలతో బాధపడే అత్తమామలు... వీరంతా ఆమె ధనరాసులు! ఆమె చదువుకునే రోజుల్లో... ఆమె అందాన్ని చూసి వెంటపడ్డ ఎందరో కుర్రాళ్లు ఆమె కళ్ల ముందు తచ్చట్లాడారు- 'మోహన్...', 'రాజు..', 'జాన్సన్...'. 'రహీమ్...' ఇలా ఒకరేమిటి? ఎందరో?! బాడీగార్డుల్లా... ఆమెని బడి నించి ఇంటికీ.. ఇంటి నించి బడికీ... దిగబెట్టేవారు! వారిలో ఏ ఒక్కరికీ ఆమెను పెళ్లాడే ధైర్యం మాత్రం లేదు. తండ్రి చాటు బిడ్డలు. నిరుద్యోగ యువకులు. ఆర్థిక స్వాతంత్ర్యం లేని అస్వతంత్రులు. అసమర్థులు! చదువుకునే రోజులు.. ఆమె తన అందానికి తానే మురిసిపోయిన రోజులు... పెళ్లికి ముందు కన్న రంగుల కలలు... అవన్నీ తలచుకుని ఆ గృహిణి నవ్వుకుంది. 'దే-వు-డు'... తనకి విధించిన శిక్షకి ఆమె పడీ-పడీ నవ్వింది! కలలకీ నిజానికీ తేడా ఆమెకి తెలిసింది. జీవితం సినిమా కాదనుకుంది. ఒక నిండు గృహిణిగా.. గృహ కృత్యాల్లో జొరబడింది. **********చిన్నప్పుడు.. ఆ అమ్మాయి ఒకసారి తల్లితో సముద్ర స్నానానికి వెళ్లింది. సముద్ర ఘోషా... ఎగిసిపడే సముద్ర కెరటాలూ ఆమెను భయపెట్టాయి. అమ్మ చెయ్యి పట్టుకుని విడువలేదు. తల్లి ధైర్యం చెప్పింది. కెరటానికి తలొంచమంది! కెరటం వచ్చినట్టే వచ్చి తల మీంచి చల్లగా జారుకుంటుందని చెప్పింది. కెరటం వెనక్కి వెళ్లాక ధైర్యంగా తలెత్తమంది!? ఆ అమ్మాయి తండ్రి చెప్పేవాడు... 'ప్రపంచంలో గడ్డిమొక్కలం మనం. పెనుతుఫాన్లు కూడా మనల్నేం చెయ్యలేవు. మనం తలొంచుకు బతుకుతాం. మన తలల మీంచి గాలులు వీచుకుంటూ పోతాయి. గాలి తగ్గగానే మనం తలలెత్తుతాం సగర్వంగా!? మనమే ఈ సమాజ కట్టుబాట్లనీ, ఆచార వ్యవహారాలనీ శాసిస్తాం. మన వల్లే ఇంకా ఈ సమాజం ఇంత బాగా మనగలుగుతోంది. జీవితంలోని ఆటుపోట్లని భరించి, రేయింబవళ్లూ జీవితాన్ని గడిపేస్తూ నడిచేస్తాం. అదే ఏ మహావృక్షమైనా అయితే... పెనుగాలులకు కూకటివేళ్లతో పెకలించుకుపోయి కూలిపోతుంది. న్యాయాన్యాయ విచక్షణా, ధర్మాధర్మ వివేచనా కలిగి మసలుకునే మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం నిజంగా మనకొక వరం! దేవుడెప్పుడూ మన పక్షమే!? ఎందుకంటే.. మనం ప్రతి బాధలోనూ అతడ్ని కొలుస్తాం. తీర్చుకోలేని కోర్కెలని తీర్చమని కోరుకుంటాం. భవిష్యత్తుపై ఏదో ఆశతో బతుకుతాం! పరువు మర్యాదల కోసం ఎంతటి త్యాగాన్నైనా చేస్తాం. మధ్యతరగతి వ్యవస్థను సజీవంగా ఉంచుతాం! మన వ్యవస్థకు మరణం లేదు. మనం చిరంజీవులం!' ఆ అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ.. ఆమె తల్లి ఆమెకి ఎన్నో నీతులు బోధించింది. ఆడపిల్లలకీ మగపిల్లలకీ తేడా ఉందంది. ఆడపిల్ల నలుగురిలో నవ్వరాదంది. ఆడపిల్ల తలొంచుకు బతకడం నేర్చుకోవాలంది. ఇంటి వద్ద వంచిన తల బడి దగ్గర ఎత్తాలంది. బడి దగ్గర వంచిన తల ఇంటి గుమ్మం దగ్గరే ఎత్తాలంది. చెల్లెళ్ల భవిష్యత్తును తలుచుకుంటూ మసలమంది. నలుగురిలో తలవంపులు తేవద్దంది. పదుగురిలో సిగ్గుపడేలా చెయ్యొద్దంది. ************ అసలా అమ్మాయి... ఎప్పుడు తలెత్తింది కనక?! పెళ్లికి ముందూ తలొంచుకుంది. పెళ్లిలోనూ తలొంచుకుంది. పెళ్లయ్యాకా తలొంచుకు బతుకుతోంది! 'సిగ్గు - సింగారమంటారు' - ఆడదానికి! 'కాని, అమ్మ తనని సిగ్గుపడేలా చేయొద్దందేమిటి?!' 'తలవంచుకోవడానికీ - తలవంపులకీ తేడా ఏమిటి?!' ఆ అమ్మాయి.. ప్రస్తుత గృహిణి... ఎప్పుడూ తల వంచుకునే బ్రతికింది. తలవంపుల మధ్యే బ్రతికింది. భయం.. భయంగా బ్రతికింది. ఎవరేమనుకుంటారోనని భయపడుతూ బ్రతికింది. ఆంక్షల మధ్య బ్రతికింది. కట్టుబాట్ల మధ్య పెరిగింది. తనకంటూ - ఒక ప్రాముఖ్యత లేకుండా.. ఆత్మ లేనట్టు బ్రతికింది. తల్లీ - తండ్రీ చెప్పిన మాట వింది. కుంటివాడ్ని తలవంచుకు పెళ్లాడింది. మనస్సులో ఎందరో అందగాళ్లను ఊహించుకున్నా.. వాళ్లందరినీ గుండె గోడల్లో సమాధి చేసింది. 'కులం- మతం'- అడ్డుగోడల మధ్య మనసు చంపుకుంటూ బ్రతికింది. అప్పుడు.. తల్లిదండ్రుల ఆత్మతృప్తి కోసం తలవంచుకు బతికింది. ఇప్పుడు...భర్త, అత్త మామల ఆత్మ తృప్తి కోసం తలవంచుకు బతుకుతోంది. ************ ఇప్పుడా అమ్మాయి... అదే.. ఆ గృహిణి... నెల తప్పింది!! స్కానింగ్ చేసిన డాక్టరు ఏ కళనున్నాడో రహస్యం దాయకుండా చెప్పేశాడు- 'గర్భంలో ఉన్నది ఆడపిల్లని!' భర్త.. అత్త మామలు... ఆడపడచూ... అందరూ చెప్పారు!... - 'అబార్షన్ చేయించుకో!?' అని. ఇప్పుడామె వాళ్ల మాటకీ బుద్ధిగా తల వంచింది! తలవంచుకు బతికే మరో జీవిని.. ఈ భూమ్మీదకు తెచ్చి... ఆమెనీ బాధపెట్టడం... ఆమె క్షమ గల తల్లి పుడమి వంటి ఆడదే అయినా... మరో ఆడ జీవికి తల్లై ఆమెను దినదిన గండం నూరేళ్లాయుష్షులా నిత్య రోదనల మధ్య ఉంచడం ఇష్టంలేకపోయింది! 'యత్ర నార్యంతు పూజ్యంతే..' 'మాతృదేవో భవ..!' 'స్త్రీ శక్తి స్వరూపిణి...!' మాతృగర్భ కుహరం లోంచి బయటకొచ్చిన సమస్త జీవరాసీ... వేదాలు వల్లించే పవిత్ర దేశం... స్త్రీ స్వరూపిణిగా భావించే పృథ్వి.... తల వంచుకునేలా... సర్వ సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుని భూమిలోకి కృంగిపోయేలా... ఒకే ఒక్క ఆర్తనాదంతో... ఆ గృహిణి గర్భ విచ్ఛిత్తు చేయించుకుంది!



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.