Articles - Telugu Pera
Name: Admin

Published Date: 05-04-2016


తెలుగు పెర

(వెలుగు వెంకట సుబ్బారావు) రైలుదిగి గుడివాడ స్టేషను బైటకి వచ్చిన సతీష్ చుట్టూ ఆటోలూ, రిక్షావాలాలు మూగారు. వారందరినీ వద్దని నడవడం ప్రారంభించాడు. ఊరేం మారలేదు. అక్కడక్కడా వడ్డీ వ్యాపారం బదులు ఫైనాస్స్ కంపెనీలూ, పందులూ కన్పించాయి. నెహ్రూ చౌక్ నుంచి నడుచుకుంటూ పామూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి, రావాల్సినచోటుకు వచ్చానా, లేదా అనుకొని పడమటేపుకి తిరిగాడు. అంతక్రితం ఉన్న సాదాసీదా ఇంగ్లీషు మీడియం స్కూలు లేదు. దానిస్థానే ఆస్కార్ ఇంగ్లీషు మీడియమనే పెద్ద ఇంగ్లీషు బోర్డు వెలిగిపోతోంది. ఎదురుగా పెద్ద చెట్టు, చెట్టుమీద వాటెడంత తేనెతుట్టె కన్పించలేదు. చిన్నప్పుడు చీరాల్నుంచి గుడివాడొచ్చినప్పుడల్లా ఆ చెట్టుకిందే మిత్రులతో ఆడుకునేవాడు. తేనెటీగలు పిల్లల్నేం చేసేవికావు. రిక్షా తొక్కుకుని బతికే సూరయ్యతాత, ఒంటినిండా కంబళి కప్పుకొని, తుట్టేం దెబ్బతినకుండా ఎంత చాకచక్యంగా తేనెని దుత్తలోకి వొంచుకొని, ఆ పేటలో వాళ్లందరికీ 'అమృతం, అమృతం' అని ఒక్క పైసా తీసుకోకుండా పంచేవాడు. అది తాగితే రోగాలన్నీ ఇట్టే పోతాయని ప్రజలు అనుకునేవారు. ఎంతెంత దూరతీరాల్నుంచో తేనెను పోగుజేసుకొచ్చి, నివాసమేర్పరచుకున్న ఆ తేనెటీగ లేమయినాయో, తేనెతుట్టె ఏమయిందో? బడిలోకి అడుగులేస్తుండగానే రెండు ఆటోల్లోంచి పిల్లలు కిచకిచమని దిగారు. వాచీలో టైం చూశాడు. తొమ్మిదిన్నర. అంటే స్కూలిప్పుడే ప్రారంభమైందన్నమాట. గేటు దాటాడో లేదో నోటికి తాళం వేసినట్టు నడుస్తున్న విగ్రహాల్లా, నిశ్శబ్దంగా నాముందునుండే నడిచిపోతున్నారు. మెడచుట్టూ వీపుమీద వేలాడుతూ పెద్ద సంచి, చేతుల్లో బరువైన ప్లాస్టిక్ బ్యాగ్. 'హల్లో!' చెయ్యి ఊపాడు సతీష్. వచ్చీరానీ నవ్వుతో అతన్ని దాటిపోతూ 'గుడ్ మార్నింగ్ సార్!' అంటూ పిల్లలు స్కూల్లోకి ప్రవేశించారు. పరాకుగా నడుస్తున్న సతీష్ ని 'సార్! ఎవరుకావాలి' అని యూనిఫాంలో ఉన్న వాచ్ మన్ నిలేశాడు. ఏం చెప్పాలో తోచక 'మేడంగారు' అన్నాడు.'ఐతే ఇటు!' అని వాచ్ మన్ దారి చూపించాడు. రెండు,మూడంతస్తుల మేడ. మేడకింద పూరికప్పుల గదులు. ఒక గదిలో వెదురుతో ఆధునికంగా, కళాత్మకంగా ఉన్న 'ప్రిన్సిపాల్' అనే గది హుందాగా ఉంది. ఎంతటివాడ్నైనా పడగొట్టేంత డైనమిక్ గా, దర్పంగా ఉంది. ముందుగది వెయిటింగ్ హాల్ లో 10, 12 మంది కూర్చోనున్నారు. వాచ్ మన్ తో 'ఎంతసేపు పడ్తుంద'న్నారొకరు. 'ఇప్పుడేగా మీరు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. వరుసవారీ పిలుస్తారు. ఉండండి' అంటూ సతీష్ చేతిలో కూడా ఓ కాగితం పెట్టాడు. దాన్లో పేరు, ఊరు, వచ్చిన పని వివరం అన్నీ ఇంగ్లీషులో రాసుంది జవాబులు రాయటానికి. పూరికప్పుని గూడా చుట్టుకొని కిందికి జారుతున్న 'మనీప్లాంట్' తీగెల్ని చూస్తున్న సతీష్ కు ఒక బొంగురు గొంతు, రెండు మూడు ధ్వనులతో విన్పించింది. పూర్తిగా ఆడాకాదూ, మగాకాదు. రెండూ కల్సిన ఒక గోండ్రు కప్ప స్వరం లాంటి గొంతు విన్పించినట్లనించి నవ్వుకున్నాడు. 'ఐదింటికి కచ్చితంగా' పేరెంట్స్ మీటింగ్ ప్రారంభమవుతుంది. ఇంకా రిహార్సల్స్ అంటే ఎట్టా? కానీండి. డోంట్ వేస్ట్ టైం. గెటవుట్ అనే పదమే వాడలేదుగాని అన్నట్టే అన్పించింది. వెంటనే అరవై యేళ్ళ భారీ శరీరం బైటపడింది. పంచెకట్టు, నిలువు బొట్టు, మెళ్ళో రుద్రాక్షలు. దగ్గరగా తేరిపార చూచి నువ్వు చెప్పొద్దు. ఆగాగు. ఆఁఆఁ, సతీషేనా? యామైకరెక్ట్? నేను వాయునందన శాస్త్రి. నా బొంద... గుర్తు లేకపోతే నమస్కారమెందుకు చేస్తావులే వెంట రమ్మని పిలిచాడు.ఎప్పుడొచ్చావ్? అమెరికాలోనేగా ఉండటం? సూదివేస్తే విన్పించేంత నిశ్శబ్దంగా ఉంది కదూ? ఇదొక కార్పొరేట్ కాసారం. దీన్లో రెండు, మూడు పెద్ద తిమింగలాలు విరామం లేకుండా తిరుగుతుంటై. లోపల చదువుకుంటున్న పిల్లల బుర్రల్ని శబ్దం విన్పించకుండా 'ఫట్ ఫట్'మని తినేస్తాయి. నెత్తురుగా, గాయాలుగా కన్పించవు. కాని విరిగిన ప్రతి అవయవం దేశీయంగా ఉండలేదు, బతకలేదు. ఈ తెలుగు పంతులేందా ఇంగ్లీషు సొంగకారుస్తున్నాడనుకుంటున్నావ్ కదూ? వెరీ సింపుల్. ఇక్కడ అప్పుడప్పుడు జారిపడే ఎంగిలి మింగి ఇట్టా ఐపోయాను. యామై కరెకట్? అని పకపకనవ్వుతూ, దూరంగా వస్తున్న వాడ్ని చూచి - ఏవో ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. చూచే ఏ దృశ్యాన్నయినా దుష్టాకారం చేసి, మేడంగారికి వర్ణించి చెప్తాడు. వస్తా! అని పక్క గదిలోకి జారుకున్నాడు. పాపం జాలేసింది. తెలుగు పండితునిగా రిటైరై కూడా, ఇంకా మిగిలిన ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం అవస్థ పడ్తున్నట్లుంది. ఎదురు పడిన ఏవో 'మైనేం ఈజ్ ఎవిరావ్. ఏవో ఆప్ దిస్ ఇన్ స్టిట్యూషన్, మే, ఐనో యువర్ గుడ్ నేం?' అన్నాడు. అంత పొగుడూ కాదు, అంత పొట్టీ కాదు. యాభై ఏళ్ళు. మధ్యస్తంగా ఉన్నాడు. ఇన్ షర్ట్, ఖరీదైన షూస్, స్పెట్స్, చేతిలో చిన్నకర్ర. అచ్చం దొంగకోళ్ళు పట్టేవాడులా కన్పించాడు. 'ఐ యాం సతీష్, ఆటోమొబైల్ ఇంజనీర్. కమింగ్ ఫ్రం డెట్రాయిట్!' అన్నాడు. 'ఓ గ్రాండ్ సన్ ఆఫ్ రామసుబ్బయ్య?' మీరు విజిటర్స రూమ్ లోనే ఉంటే బాగుండేదేమో! 'మీలాంటి పెద్దలెవరూ కన్పించలేదు. ఇప్పుడైనా, విత్ యువర్ కైండ్ పర్మిషన్...?' 'వెళ్ళండి. అమెరికాలాగ మేం కూడా ఎవ్వెరి సెకండ్ వేస్ట్ చెయ్యం? వై షుడ్ వుయ్ డిస్టర్బ్ ది పీపుల్? ఏమంటారు? అమెరికాలో ఉంటున్నమీకు ఇదంతా చెప్పాలా? త్వరగా రండి. ట్రైటు అండర్ స్టాండ్ మీ సర్!' 'థ్యాంక్యూ సర్! మీ వేల్యుబుల్ డాలర్స్ టైం వేస్ట్ చేయను. జస్ట్ వనార్ టూ మినిట్స్'. అని తలొంచి విష్ చేసి పై మెట్లవైపు సాగాడు.నక్కి నక్కి మాట్లాడేవాడి జిత్తుల పద్ధతి చూస్తే వాడు పూర్వజన్మలో తప్పక నక్కై ఉంటాడన్పించి -మళ్ళీ ఇదొక ట్రాషా అనుకొని నవ్వుకుంటూ పై అంతస్తుకి చేరి రామసుబ్బయ్య గొంతు విన్పించి వాకిలి దగ్గరే ఆగి, తలెత్తి చూచాడు. 'టెన్త్ క్లాస్!' 'మనది అజంత భాష, అంటే అచ్చుల చివరి పలికే భాష. అచ్చులకు ప్రాణములూ, స్వరములని పేర్లు. ప్రాణములకంటే ఒకరికొకరు దగ్గరై, ఒకర్తో ఒకరు అనుసంధానం కావటానికి తోడ్పడేవి. స్వరమంటే ధ్వని, కంఠస్వరం, లయాన్వితమైన శబ్దం. హల్లులంటే 'క నుండి హ' వరకు ఉండే అక్షరాలు. ఇవి అచ్చులతో కూడి సరైన అర్థాలకి ఊపిరిపోస్తాయి. కనుక ప్రాణులూ, వ్యంజనములంటారు. ఏది పడితే అది తినే మనిషి ఎదిగీ ఎదగని మొక్కలా గిడసబారినట్లుంటే, సహజమైన ప్రకృతి ఆహారం తీసుకునే మనిషి నవనవలాడుతూ ఆరోగ్యంగా ఉంటాడు'. చేనుకు రసాయనాలు వాడితే, తాత్కాలికంగా పంట పెరగొచ్చు. కానీ క్రమంగా నేల గుల్లబారి, సారం తగ్గుతుంది. మనసైనా అంతే. తల్లి భాషలో చెప్పే చదువు పుష్టికరమైన ఆలోచనలిస్తుంది. అందుకే తెలుగును ప్రేమించు, తెలుగులో జీవించు అంటాను నేను. బతకటం అంటే కాలాన్ని గతకటం, జీవించడమంటే అనుక్షణం ఒక జీవిగా జీవకళ పంచుతూ, జీవంతో ఉండటం. అది తల్లిభాషలోనే సాధ్యమవుతుంది. డెబ్బయి ఏళ్ళు వస్తున్నా భాషాజాతీయతతో, జాత్యభిమానంతో ఖంగుమంటున్న తాతయ్య కంఠస్వరం విని, సంతోషం ఆపుకోలేక చప్పట్లు కొట్టడంతో, పిల్లలు కూడా ఆయాచితంగా చప్పట్లు చరిచారు. ఆ హోరు నిశ్శబ్దాన్ని చీల్చి, రామసుబ్బయ్య చూపుల్ని కిటికీవైపు తిప్పింది. ఒక్క క్షణం పరిశీలించి, చకచక వచ్చి, మనవడ్ని తనివారా కౌగలించుకొని 'ఎన్నేళ్ళయింది నిన్ను చూచి? అమ్మా నాన్నావచ్చారా?' అన్నాడు.లేదు తాతయ్యా! నేనొక్కడ్నే వచ్చాను. ఏపనీ లేకుంటే బుర్ర కూడా తుప్పు పడ్తుంది. అందుకే చేరా. ఎలా ఉన్నాను? 'కొంచెం వంగినట్లున్నా, వంచినవిల్లులా ఉన్నారు'. ఈ స్మశాన నిశ్శబ్దం చూస్తే నీకేమనిపిస్తుంది. శవాలు తిరుగుతున్నట్లు, శవాలు కూర్చొని వింటున్నట్లు, శవాలు బోధిస్తున్నట్లు అన్పించటంలా. అప్పుడప్పుడు నేను ఈ స్మశాన వికృతశాంతిని నేపద్యంతోనో, పాటతోనో 'డిస్టర్బ్' చేస్తుంటాను. ఎంతైనా ఇంగ్లీషు దేశం నుంచి వచ్చినోడివి కదా. గట్టిగా ఆనుతుందని ఒకే ఒక్క ఇంగ్లీషు పదం పుక్కిలించా. గొంగళిలో భోంచేస్తూ, వెంట్రుకలనుకుంటే ఎట్టా? ఈ విద్యావిధానంలోనే ఇదంతా ఉంది. ఇక్కడ ఏ సృజనాత్మకతా రెక్కవిప్పదు. ముక్కలౌతుంది. ఏదైనా ఆలోచించటానికి తీరికెక్కడ? ఒకటే పరుగు, గాను గెద్దు బతుకు. సరే అమ్మమ్మ ఇంటి దగ్గరుంది వెళ్ళు. ఇంకో అరగంటలో నేనూ వస్తా! అత్యుత్సాహంతో, చేతులూపుకుంటూ పిల్లలవేపు అడుగులేస్తున్న రామసుబ్బయ్యను చూస్తూ, 'వస్తా తాతయ్యా' అంటూ స్కూలు కాంపౌండులోకి ప్రవేశించగానే ప్రిన్సిపాల్ మేడం ఎదురైంది. ఆమెకు సతీష్ నమస్కరించాడు. 'సతీషేగా? మీ తాతయ్య ముక్కులోంచి ఊడిపడ్డట్టున్నావ్. విదేశాల్లో నివసిస్తున్నా, నువ్వూ మీ తాతయ్యలా దేశీయంగానే నమస్కారాలు చెప్పి, మనవడివనిపించుకున్నావ్'. సాయంత్రం పేరెంట్స్ మీటింగూ, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నై. నువ్వు పబ్లిక్ ఎడ్రెస్ చేయాలి. చాలా పెద్దపెద్దవాళ్ళు వస్తారు - తెలుగులో కాదు, ఇంగ్లీషులో, తప్పకుండా రావాలి. నువ్వు వస్తున్నావ్, అంతే? అంటూ చెడిపోయిన కారింజన్లా డబడబలాడి, బొడ్లో తాళాలగుత్తి 'టెన్, టెన్' మని ఊగుతుంటే నిశ్శబ్దాన్ని శబ్దం చేస్తూ వెళ్లిపోయింది. గేటు దాటుతుండగానే 'తెలుగు స్పీకింగ్ ఈజ్ స్ట్రిక్ట్ ప్రొహిబిటెడ్ ఇన్ ది క్యాంపస్' అన్న బోర్డు వెనుకనుంచి వెక్కిరించినట్లు కన్పించింది. లోపలి కొచ్చేప్పుడు దీన్ని గమనించనందుకు తనను తాను తిట్టుకుంటూ, కందిరీగల తుట్టెలా ముసురుకుంటున్న ఆలోచనలతో బైటికొచ్చాడు.లోకల్ యంఎల్ఏ రావటం ఆలస్యమైనందున మీటింగ్ ఆలస్యమైంది. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడని ఒకటే టెన్షన్. ఏటిండికి వచ్చి, అర్జంట్ ప్రోగ్రాం ఉందంటూ, వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు. చాంతాడు లాంటి ఉపన్యాసకుల లిస్టులో సతీష్ కొదవవాడిగా వేదికెక్కాడు. పంచెకట్టి, కండువా వేసుకుని వచ్చినందుకు ఆశ్చర్యపడినా, ఏం చెపుతాడోనని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూచారు. 'నేను పుట్టుకతో తెలుగువాడిని. తెలుగుతల్లి స్థన్యం తాగి, ఇక్కడే తెలుగుతల్లి గుండెలమీద దోగాడి, ఇరువది రెండు సంవత్సరాలు ఇక్కడి పరిమళాలు పీల్చి, పెరిగిన వాడిని. గుడివాడలో ఉన్న నా తల్లి తండ్రి రామసుబ్బయ్య నా అడగడుగు సరిదిద్దితే - చదివిన చదువుకి సరైన ఉద్యోగం దొరక్క అమెరికా ఎగిరిపోయాను. అక్కడ ఉంటున్నాను గనుక ఇంగ్లీషు బాగానే మాట్లాడగలను. కానీ తెలుగే నా తల్లిభాష. దాన్లో మాట్లాడి నా తల్లి రుణం కొంత తీర్చుకుంటుంటున్నాను. నేడు తెలుగుదేశం పాఠశాల నిండా మాతృభాషకై కత్తిగట్టినట్లు తెలుగు సబ్జక్టు లేకుండా కళ్ళు మూసుకుని నడుస్తుంటే మేడంగారు ఒకటో తరగతి నుండి పదో తరగతి దాకా తెలుగును ఉంచినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమెరికా సిటిజన్స్ ఏ చిన్న పని చేయటానికైనా సిగ్గుపడరు. ఇక్కడ్నుంచి అక్కడ చదువుకోవటానికి వచ్చే విద్యార్థులు కూడా విరామ సమయాల్లో హోటళ్ళలో సర్వర్లుగా, పెట్రోల్ బంక్ లో సేల్స్ మన్లుగా పనిచేస్తారు. తమ తమ సామాన్లు తామే మోసుకుంటారు. ఎవడూ నామోషిగా భావింపడు. మరి ఇక్కడ? 4, 5 తరగతుల నుండే విద్యరానివాడు వింత పశువైతే వచ్చినవాడు ఏ పశువు? సంత పశువా? కట్నాల వేలం పాటలో బరితెగించి నిలబడే పశువా? ఒక్క విన్నపం - పొలాల్లో, కార్ఖానాల్లో ఎక్కడబడితే అక్కడ ఎండకు ఎండిపోతూ, వానకు తడ్సిపోతూ సర్వసంపదలు సృటించి పెంచే శ్రమజీవులా పశువులు? వాళ్ళని పశువుల్లా మార్చిందెవరు? మనం కదూ?జర్మనీ, జపాన్, నూజిలాండ్ వంటి దేశాల్లో ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా తప్ప, అన్ని పాఠ్యాంశాలూ వాళ్ల, వాళ్ళ తల్లిభాషలోనే బోధిస్తారు. తెలుగువారై పుట్టిన మేడంగారు తెలుగు బోధించే సమయాల్లో తప్ప, తల్లి పలుకు పలక గూడదనటం ఎంతవరకు సబబు? ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను. అమెరికన్లు భారతీయ సంస్కృతిని చాలా గౌరవిస్తారు. మన కట్టూ, బొట్టూ ఆచారవ్యవహారాలు చాలా ఇష్టపడ్తారు. వాళ్ళు మన వైపు చూస్తుంటే, మనం వాళ్ళవైపు చూస్తున్నాం. వాళ్ళలా ఉండాలని ఉబలాటపడుతున్నాం. ఎగిరెగిరి గంతులేస్తున్నాం. ఎదిగెదిగి బోర్లపడ్తున్నాం. ఒంటి నిండా బట్ట కడ్తున్నామా? తెలుగుతిండి తింటున్నామా? తెలుగు పానియాలు వాడుతున్నామా? ఆలోచించండి. తెలుగు బిడ్డలమై, జన్మనిచ్చిన తల్లినే గుంటబెట్టి, గంట వాయించడం న్యాయమా చెప్పండి? అయితే నేను ఇంగ్లీషును వద్దనటం లేదు. ఎంత ఎత్తుకు ఎగరాలో అంత ఎత్తుకు శక్తికొద్దీ ఎదగమనీ - ప్రపంచ కీర్తి శిఖరమ్మీద అన్ని అవకాశాలూ ఈ పాఠశాల విద్యార్థులు అందుకోగలరని ఆశిస్తూ, ఈ మేడంగారికే గాక, ఇక్కడకు వచ్చిన గుడివాడ వాస్తవ్యులందరికీ వందల వందనాలు చెప్తూ సెలవు తీసుకున్నాడు సతీష్. సతీష్ ఉపన్యాసంతో కల్సి కృష్ణాతరంగం వెల్లువెత్తినట్లు శ్రోతల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అంతేగాక, తర్వాత మాట్లాడిన వారంతా పాఠశాల నిర్వహణ సామర్థ్యాన్ని పొగిడితే చివర్లో మాట్లాడిన రామసుబ్బయ్య ఏ భాషలో లేని అష్టావధాన ప్రక్రియనీ, వేమన, పోతులూరి వీరబ్రహ్మం గారి వంటి కవులలోని లోకనీతిని, సామాజిక సంస్కరణరీతుల్ని విశ్లేషించారు. పిల్లలు సాంస్కృతిక రూపాల్లో భాగంగా దగ్గుబాటి రామానాయుడి గారి 'నీకు నేను - నాకు నీవు' సినిమాలో చంద్రబోస్ రచించిన నృత్యరూపకం 'తెలుగుజాతి గొప్పతనం తెలుగుభాష తీయదనం' రెండు చేతులూ లేని తెలుగమ్మాయి కాళ్ళతో 'ఆ, ఆ'లు రాయించటం తెలుగుభాష పునరుజ్జీవనానికి ప్రతిన చేస్తున్నట్లనిపించింది. షడ్రసోపేతమైన భోజనాలయ్యేదాకా, ఆ స్కూలు ఆవరణంతా తెలుగు పెర (తేనెతుట్టె) పగిలి తేనెజల్లు కురిసినట్లయింది. తెల్లారిన తర్వాత పాఠశాలలో తెలుగు మాట్లాడరాదన్న ఇంగ్లీషు బోర్డు లేదు. ఎవరైనా లాగేశారో, మేడంగారే తీసేశారో!Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.