Articles - Shift Duty




Name: Admin

Published Date: 05-04-2016


షిఫ్ట్ డ్యూటీ

               (vamsy vamsymohan) యిరవై మూడో శతాబ్దపు కథ! భావితరాల్లో వచ్చే కథలు ఇలాగే వుండచ్చు. ఇరవై-ఇరవై ఒకటీ శతాబ్దాల్లో మా తాతలు చేసిన తప్పులకిప్పుడు మేము ఈ ఇరవై మూడో శతాబ్దంలో శిక్షలని అనుభవిస్తున్నాం. ఆ కాలంలో గర్భస్థ శిశువు అమ్మాయి అని స్కానింగ్ లో తెలియగానే అబార్షన్స్ చేయించే వార్ట! అందువల్ల స్త్రీ - పురుష సమతుల్యత దెబ్బతింది. ఇప్పుడో అమ్మాయికి నలుగురబ్బాయిల రేషియో వుంది. ఎవరింట్లో నైనా అమ్మాయి పుట్టిందనగానే అడ్వాన్స్ లిచ్చేసి అయిదేళ్ల లోపు తమ కొడుకులకి భార్యల్ని బుక్ చేసుకుంటున్నారు కోటీశ్వరులు. మళ్లీ కన్యా శుల్కం రోజులు ముంచు కొచ్చాయి. దళారీ వ్యాపారం బాగుంది. పర పురుషుల కంట పడకుండా భర్తలు తమ భార్యలను పరదాల వెనక్కు నెట్టేసి జాగ్రత్త పడుతున్నారు. అవడానికి మేము మా తాతలకన్నా ఎక్కువ జీతమే తెచ్చుకుంటున్నాం. కానీ ఏం లాభం? మేము తెచ్చుకునేది మా కడుపులకే సరి పోదు. అవును మరి. మా తాతల నాడు పావలా వుండే అగ్గిపెట్టె ధర ఇప్పుడు యాభై రూపాయలైంది. అదే రేషియోలో అన్ని ధరలూ మండి పోతున్నాయి. మేము ఇద్దరం కలిసి ఒక రూము అద్దెకి తీసుకున్నాము. ఫరవా లేదు. ఆ చిన్న రూము మాకు సరిపోతుంది. మేమిద్దరం ఒకే కర్మాగారంలో షిఫ్ట్ డ్యూటీ పై క్యాజువల్ లేబరుగా పని చేస్తున్నాము. ఇద్దరం బ్రహ్మ చారులమే! బ్రహ్మ చారులుగా ఉండక ఛస్తామా? పిల్ల కావాలని అడిగితే- 'ఏం పెట్టి పోషిస్తావయ్యా? నీ సంపాదన నా పిల్ల కాస్మాటిక్స్ కే సరిపోదు. పైగా మీరిద్దరూ ఒకే రూములో అఘోరిస్తున్నారు 'అనేవారు. దాంతో పిల్ల కావాలని ఎవరినీ అడగ లేక పోయాము. సినీ హీరోయిన్లున్న వాల్ పోస్టర్లూ-హోర్డింగులూ చూసీ,అదృష్టం బావుంటే ఏ అమ్మాయైనా రోడ్డున పోతుంటే చూసీ, కొట్లముందు తిను బందాడారాలని చూసి చొంగలు కార్చుకునే కుక్కల్లా చొంగలు కార్చే వాళ్లం. మా యిద్దర్లో ఎవరికీ తల్లి-దండ్రుల్ని పోషించే బాధ్యత లేదు. వాళ్లు ఓల్డేజ్ రెస్క్యూ హోంలో చేరి వాళ్ల పాట్లేవో వాళ్లు పడుతున్నారు. చక్కగా మా తాతలు -'ఒక భార్య - ఒక భర్త', అనుకుంటూ చెట్టాపట్టా లేసుకుని చూరు కిందుండి, పిల్లల్ని కని, ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే వార్ట! వారికి ముందు తరాల తాతలైతే... ఒక్కరే ఇద్దరు ముగ్గుర్ని పెళ్లాడేసి రసికాగ్రేసర చక్రవర్తుల్లా వెలిగి పోయే వార్ట! ప్చ్! మాకా యోగం లేదు. కనీసం ఒక భార్యకి కూడా మేం నోచుకో లేదు. సృష్టిలోని సహజ సిద్ధమైన ఆ శృంగారపుటవసరాన్ని మేం తీర్చుకోలేం. ఇప్పుడే ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే, ఆజన్మ బ్రహ్మ చారులుగా మిగిలి పోతాము. చివరికి నేనే తెగించి నా రూమ్మేట్ తో అన్నా-'ఒరే! లాభం లేదురా! మనిద్దరం కల్సి 'ఒకమ్మాయి'నే తెచ్చుకుని పెళ్లాడాల్సిందే',నని. ఛీ!థూ!యాక్కిరి!!' అన్నాడు నా రూమ్మేటు శివుడు. 'సరే ఆలోచించుకో!మనకింత కన్నా గత్యంతరం లేదు,'అని చెప్పి నేను డ్యూటీ కెళ్లి పోయాను.వాడు బాగా ఆలోచించుకునుంటాడు. రెండ్రోజులు పోయాక నా రూట్ లోకొచ్చాడు. రాక ఛస్తాడా?! కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దేశం కన్నాఎక్కువగా వున్నకొన్ని దేశాల్లోనైతే ఆడ వాళ్ల పోషణ భారం భరించలేక ఈ పరిస్థితి ఇరవయ్యో శతాబ్దానికి ముందే వుండేదట!? మేమీ నిర్ణయానికి రావటం..అదృష్టం మా తలుపు తట్టడం ఒకేసారి జరిగాయి. నల్ల మందుకలవాటు పడ్డ ఓ ముసిల్ది ముప్ఫై వేలు తీసుకుని ఈడొచ్చిన తన కూతురు అహల్యని మాకిచ్చేసింది. మొదట్లో అహల్య మేమిద్దరం ఆమెకి భర్తలుగా వుంటానికి ఒప్పుకోలేదు. ఎంతో కష్టం మీద ఆమెని ఒప్పించాం. ద్రౌపది కథనీ, అన్న గారి భార్యను తమ్ముళ్లు కూడా భార్యని చేసుకునే ఆచారాలున్న ఆదివాసీ జాతుల కథల్నీ మేము దీనికోసం వాడుకున్నాం. మగాళ్లకు పెళ్లవడమెంత కష్టమో తెలీని పిల్ల కాదహల్య! మా వంటి దరిద్రులు ఇండిపెండెంటుగా ఓ అమ్మాయిని పోషించలేరని గ్రహించింది. అందుకే మా మాటకి తలొంచింది. అప్పట్నించీ ఉద్యోగంలో లాగే అహల్య దగ్గర కూడా మా షిఫ్ట్ డ్యూటీ స్టార్టయ్యింది. 'పగటి భర్తా-రేతిరి మగడూ!!'అనామె మమ్మల్ని ముద్దుగా పిల్చుకునేది. అహల్యది అద్భుతమైన ఫిగర్! ఆమె కామ శాస్త్ర ప్రావీణ్యతకు మేమబ్బుర పడే వాళ్లం. మా కామె స్వర్గలోక సుఖాలని చవి చూపి, మా జీవితాలకో సార్థక్యతను కూర్చింది. ఒకరి శృంగార రాస కేళీ నైపుణ్యాన్ని మరొకరి దగ్గర వెల్లడి చెయ్యకుండా ఎంతో గుట్టుగా మాతో సంసారాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు భర్తలైన మా మధ్య పొరపొచ్చాలు రాకుండేటందుకు అహల్య ఎన్నో నీతులు చెప్పేది.పాండవులు అన్న దమ్ములైన కారణాన సఖ్యంగా వున్నారనీ, అన్న దమ్ములం కాని మాకు సఖ్యతుండటం గొప్పని మమ్మల్ని మెచ్చుకునేది. కళ్లెంలేని కాలం పరుగు లెడుతుంటే, యుగాలే క్షణాలై మా సంసార సాగరంలో ప్రేమగా యింకిపోతున్నాయి. మాకెన్నో అనుభూతుల్ని మిగిల్చి పోతున్నాయి. కాని..,అహల్య మాటాడే మాటల్లో ఏదో మార్పున్నట్లు నా కనిపించసాగింది. ఇలా ఎందుకవుతోందో నా కర్థం కాలేదు. 'ఇదో!ఇప్పుడు నేన్నీదాన్ని. ఈ చాప నీది.ఈ పక్క నీది. మరుక్షణం గొడవ నీ కెందుకు? నువ్వు నా దగ్గరున్నంత సేపూ నేన్నీ దాన్ని. నువ్వు నా వాడివి. అనవసరమైన ఈర్ష్యాసూయలతో విలువైన క్షణాల్ని వృథా చేసుకోకూ,అనడం మొదలెట్టింది. 'ఇప్పుడు నేనేమన్నాననీ?', అని నేను రెట్టిస్తే.. 'నువ్వన్నావని కాదు. నువ్వలా అనకుండా వుండేటందుకే యివన్నీను' అనేది. అప్పుడెప్పుడో ఇరవయ్యో శతాబ్దంలో చలం గారి స్త్రీ పాత్ర ఈ విధమైన వేదాంతం చెప్పిందట! అదే సూత్రాన్ని అహల్య చెప్పి ప్రేమగా తన పెదాలతో నా నోరు మూస్తోంది. ఇదే విధంగా అహల్య శివుడి పెదాలూ మూస్తోందా? ఏమో నాకు తెలీదు. అహల్యలో ఏం శక్తుందో నాకు తెలీదుగానీ, ఆమె ముందు ఠక్కున నా నోరు మూత పడేది. ఆమె పెంపుడు కుక్కనై ఆమె పాదాలని నాకుతూ, ఆమె మీదకు ఎగురుతూ ఆడుకునే వాడిని. శివుడు కూడా ఇంతేనా? నాలో సందేహం!?పురుషుడికి సుఖాన్ని పంచాలన్నా, పురుషుల్ని ఏకత్రాటిపై నడిపించాలన్నా అది ఒక్క స్త్రీకే సాధ్యమనుకున్నా! ఒక రోజున అహల్య దగ్గర నేను నా డ్యూటీలో వుండగా, అహల్య ఆనందాబరపుటంచుల్ని తాకుతూ-'ఓహ్!రాజా!నా రాజా!!'అంది. నేను అనుమానంగా -'ఎవరా రాజ' అని అడిగాను. ఎందుకంటే మా రూమ్ కెదురుగానున్న మేడలో 'రాజు 'అనే బ్రహ్మ చారొకడున్నాడు. వాడు చాలా ధనికుడే. అయినా యోగం బాగుండక బ్రహ్మ చారిగా వుండి పోయాడు. 'ఇద్దర్ని మరిగిన అహల్య మూడో వాడికోసం ఎగబడకుండా వుంటుందా?' అనే ఆలోచన నా మెదడు అట్టడుగు పొరల్లో కదలాడింది. అందుకే అలా అడిగాను. 'హయ్యో రామా!ప్రతిదానికీ అనుమానమేనా?'ఈసడింపుగా అందహల్య. 'ఆ రాముడెవరు మళ్లీ' అని నేను రెట్టించాను. 'దేవుడిని తల్చుకోవడం కూడా తప్పేనా? నా మదన సామ్రాజ్యానికి నువ్వు రాజైనప్పుడు నిన్ను, 'రాజా నా రాజా' అని పిలుచుకోవడం కూడా తప్పేనా? అందహల్య. మరి నేనేం మాట్లాడగలను? మా తాతల కాలంలో 'ఇద్దరు పెళ్లాల ముద్దుల మగడ'నే సామెత వుండేదట. ఇప్పుడహల్యో 'ఇద్దరు భర్తల మురిపాల భార్య-సుద్దులు చెప్పే ముద్దుల ప్రియురాలు!!'అలాగంటూ నేననేక మార్లు అహల్యని ఉడికించే వాడ్ని. అలా నాలుగేళ్లు మేమిద్దరు భర్తలం అహల్య దగ్గర మా షిఫ్టు డ్యూటీని కంటిన్యూ చేశాం. ఒకరోజు నేను ఫాక్టరీ డ్యూటీలో వుండగా శివుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.'ఒరే కేశవా! కొంప మునిగిందిరా! మన పెళ్లాం రాజు గాడితో లేచి పోయిందిరా!' అన్నాడు భోరుమంటూ. నా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. శివుడ్ని తీసుకుని ఆదరా బాదరాగా రాజుగాడింటికి పరిగెత్తాను- 'ఇదేమైనా న్యాయమా?' అనడగాలని. అహల్యని మేమెంతో ప్రేమగా చూసుకున్నాం. ఒక్కరమే అయితే అమెను పోషించ లేక పోవచ్చు గానీ, మేమిద్దరు మగాళ్లం! ఆమె కేం కావాలనా కాదనకుండా సమకూర్చగల సమర్థులం. అయితే..., మమ్మల్ని కాదని అహల్య రాజుతో ఎందుకు లేచి పోయిందో నా కర్థం కాలేదు. మేము రాజింటికి వెళ్లే సరికి మా కోసమే ఎదురు చూస్తున్నట్టు అహల్య కుర్చీలో కూర్చునుంది. ఆ పక్కనే మరో కుర్చీలో రాజు కూర్చునున్నాడు. అక్కడ అహల్య చెప్పిన మాటలకి మేమిద్దరం స్థాణువుల మైనాము. 'నేను మీ ఇద్దరి పైనా జాలి పడిన మాట వాస్తవం. మా అమ్మకి మీరు కట్న మిచ్చుకున్నారని నేను మీ దగ్గరకి రాలేదు. ఏదో మీ బ్రహ్మ చర్యాన్ని వదిలించాలనుకున్నాను. అంతే! మరు జన్ముంటుందో లేదో తెలీదు. ఈ జన్మలో మీకు దాంపత్య సుఖాన్ని చవి చూపాలను కున్నాను. చూపించాను'. కన్నె చెఱ విడిపించానని గొప్పలు చెప్పుకునే మగాళ్లుండే వారట పూర్వం. ఇప్పుడు అహల్య మా బ్రహ్మ చర్యాన్ని వదిలించానని గర్వ పోతోంది. మేమవాక్కై ఆమె మాటల్నే వింటున్నాం.'మొదట్లో మీరు నాతో బాగానే వుండే వారు. కాని, రాను రాను మీ మనస్సుల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయనే విషయాన్ని నేను గ్రహించాను. మీ ఆర్థిక స్థితి బాగోక గానీ, లేకుంటే మీలో ఎవరికి వారే నన్ను స్వంతం చేసుకోవాలని ఆరాట పడుతున్నారు. ఒక ఒఱలో రెండు కత్తులిమడవనే విషయం నిజమైనా; మీరిద్దరూ నా వల్ల కాట్లాడు కోకుండా వుంటున్నారు...' యింకా అహల్య ఏదో చెప్ప బోతుండగా నేనడ్డు తగిలాను. 'అబద్ధం అహల్యా! ఇప్పుడు నువ్విలా మాట్లాడ్డం తగదు. మా శివ కేశవులమిద్దరం ఒకటే! మేము నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాం', అన్నాన్నేను. నా మాటలకు అహల్య తన కొత్త ప్రియుడు రాజుకు కంప్లైంట్ చేస్తూ మాకు సమాధాన మిచ్చింది. 'విను రాజూ! నేనబద్ధ మాడుతున్నాంట! శివుడికి తెలీకుండా కేశవుడూ, కేశవుడికి తెలీకుండా శివుడూ ఈ మధ్యన గదిలో రహస్యంగా వీడియో కెమేరాలు అరేంజ్ చేసుకుంటున్నారు. పోనీ అది అబద్ధమేమో కనుక్కో! ఫేక్టరీ నించి ముందొచ్చిన వాళ్లు తలుపుకు చెవులు తాటించి గదిలోని మాటల్ని వినాలనే ప్రయత్నం చేస్తున్న్నారు. ఇంకా, వెంటిలేటర్లోంచి కళ్లెట్టుకుని గదిలో ఏం జరుగుతోందో చూడాలనే ప్రయత్నంలో పడుతున్నారు. ఇది కూడా అబద్ధమేమో కనుక్కో! అయినా, వీటి వేటి గురించీ నేను పట్టించుకో లేదు. ఇదంతా మనిషిలో వుండే సహజ కుతూహలంగా భావించాను. ఆ తరవాత వాళ్లు నా మీద అనుమానం పడ్డం మొదలెట్టారు. పర పురుషుల్తో నాకు లేని సంబంధాన్ని నాకంట గట్టారు. అప్పుడూ నేను నోరు మూసుకున్నాను. లోకంలోని మగాళ్లందరిదీ ఒకే తరహా ప్రవర్తనని నాకు తెలుసు. అందుకే నాకు వాళ్ల మీద కోపం కలక్క పోగా జాలి కలిగింది. 'అయ్యో!పాపమ 'ని వాళ్ల నెంతో ప్రేమగా చూసుకున్నాను, కాని...నాకు ఒకరోజున నిజం తెలిసిపోయింది!!?' 'ఏమిటా నిజం?',అడిగాడు శివుడు. 'కుటుంబం వృద్ధి చెందితే..పిల్లా పాపల్ని పోషించ లేమనే భయంతో మీరిద్దరూ వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకుని నన్ను పెళ్లాడారు. అవునా? కాదా!?'సూటిగా ప్రశ్నించింది అహల్య. మేము దీనికి ఏం సమాధానం చెప్ప గలం? ఆమె చెప్పింది నిజమే! 'స్త్రీ జన్మకి మాతృత్వాన్ని మించిందిలేదు. ఏ స్త్రీ అయినా మాతృత్వాన్ని పొందాలని కోరుకుంటుంది. తల్లిని కావాలనే నా కోరికను కాల రసే హక్కును మీ కెవరిచ్చారు? కష్టమో నష్టమో? కని పెంచే తల్లికి బిడ్డ భారం కాదు. అలాగే మన తల్లులనుకుంటే, మనమీ భూమ్మీదకు వచ్చే వాళ్లమే కాదు. కనీసం..ఒక్క నలుసంటే...ఒక్క నలుసు నా కడుపున పుడితే చూచుకోవాలను కున్నాను. ఆ యోగ్యతని ప్రసాదించలేని మీ దగ్గర ఉండటం అవివేకం. అందుకే నేను మిమ్మల్నొదిలేశాను. ఇన్నాళ్లూ నేను మీకు చేసిన సేవలకీ, ఇచ్చిన సుఖాలకీ న్యాయంగా ఎవరూ వెల కట్ట లేరు. అలాగని నేనిచ్చిన సుఖాలకి వెల కట్టించుకుని ఇప్పుడు వెలయాల్ని కాదల్చుకోలేదు. అయినా, మీరు మా అమ్మ కిచ్చిన ముఫ్ఫై వేలూ మీకిచ్చేస్తాను. తీసుకోండి', అంది అహల్య. గాబరాగా- 'ఒద్దు! ఒద్దు!!'అన్నాన్నేను. ఆ ముఫ్ఫైవేలే కాదు. మరో ముఫ్ఫై వేలైనా ఇప్పుడు అహల్య మాకివ్వగలదు. ఆమె పక్కనున్న రాజు కోట్లకధిపతి మరి! కాని..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఎంత డబ్బున్నా పెళ్లాం దొరకడం కల్ల! ఒక వేళ దొరికినా ఉయ్యాల్లోని పాపాయిల్ని మేమేం చేసుకుంటాం? అసలిప్పటి చట్టం అహల్యని మా పెళ్లాంగా అంగీకరించదు. 'ఒక భార్యా-ఒక భర్తా' అనేదుందిగానీ ఎక్కడా ఒక భార్యా... ఇద్దరు భర్తలనేది లేదు. అందుకోసం మేము కోర్టు కెళ్లి న్యాయం కోరలేము. బలవంతుడూ, ధనికుడూ అయిన రాజుతో బాహా బాహీ తలపడ్డం మా వంటి బీద వాళ్లకి కాని పని. మా తాతలు చేసిన తాప్పులకు ఇప్పుడు మమ్మల్ని మేమేమనుకుని ఏం లాభం? 'స్త్రీ' మాతృత్వాన్ని కోరుకుంటుందని గ్రహించ లేని మా అవివేకానికి మేము సిగ్గు పడ్డం తప్పించి ఏం చెయ్య గలం?! వెర్రి ముఖాల్తో అహల్య ఇవ్వబోయిన నోట్ల నందుకోకుండానే బైటి కొచ్చాం! దానిక్కారణం... ఎప్పటికైనా అహల్య మళ్లీ మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకున్నాం! జాలి గుండె కల అహల్య కరుణిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి!!



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.