Articles - Sarala
Name: Admin

Published Date: 06-04-2016


సరళ

(ఐత చంద్రయ్య) బొందిలో ప్రాణాలున్నంత వరకు బొందలు తోడుతూ బతికిన బొందయ్యగ్గూడా బొంద కావాలనే నిజం ఆ ఊరి జనాల్లో కలవరం సృష్టించింది. 'మట్టి నుంచి పుట్టిన మనిషి పాడం బోయినంక ఆ కట్టెను మట్టిల వెట్టక నెత్తిలవెట్టుకుంటారా?' అరుగు మీద గోడకొరిగి కూచున్న అరవయ్యేళ్ళ పెద్దమనిషి సవాలు. 'గిదేమన్నా ఎనకటి కాలమా? బొందవెట్టుడెందుకూ? కాష్టం జెయ్యచ్చుగదా!' ఓ యువకుని సలహా. 'అరేయ్ పిల్లగా!' పెద్దమనిషి మీసాల కింద నవ్వులాంటిది మెరిసింది. 'కాష్టం జెయ్యాలంటే చాలా కష్టాలు ఉన్నాయి.' మనిషి పీనుగంటే సామాన్యమా! అన్ని కట్టెలు కొనాలంటే చాలా రూపాయలు కావెలగదరా! చుట్ట అంటించుకుంటూ చురక వేసిండు. కాలు మీద కాలేసుకుని పూర్తిగా ఒరిగి కూర్చున్నాడు. పక్కనే నుంచున్న మల్లమ్మ ముక్కు చీది కొంగుతో తుడుచుకుంటూ మనూర్లో ఎవరు సచ్చినా బొందల వెడ్తుండ్రు గదా. మనూరి ఆచారమే అది. కొత్త షిరస్తా దెచ్చి కొంపముంచుతరా ఏంది? మండిపడుతూ ముక్కు మీద వేలేసుకుంది. 'నీ యవ్వ గీ ఆచారాలే మనకు గ్రహచారాలు.' పెయ్యంతా కారప్పొడి చల్లినట్టయిందా యువకునికి. 'మన చుట్టు పక్క ఊర్లల్ల, పట్నాలల్ల గిట్లనే ఉన్నదా?' నిలదీశాడు. 'లేక పోవచ్చు. మరో వృద్ధునికి రోషం పొడుచుకొచ్చింది. మనూరి షిరాస్తా మనూరిది. పాపం! ఊర్ల ఎవరు సచ్చినా బొందయ్యనే బొంద దోడె. గిప్పుడు బొందయ్యనే సచ్చిపాయె' అరుగు మీద మలుచుకున్న కాళ్లను కిందకు వేళ్ళాడేసిండు. 'బొందయ్య సచ్చిపాయె. ఇంగ బొంద ఎవ్వలు తోడ్తరటా!'మరో యువకుని ప్రశ్నాబాణం. పెద్దమనిషి పక్కన కూచున్న మరో వృద్ధుడు రుమాలు సవరించుకుని ఆరె నీ యవ్వ గీ వైసు పోరలకేమైంది? ఆశ్చర్యం ప్రకటించి బనీను జేబులోంచి చుట్ట, అగ్గిపెట్టే దీసిండు. 'వైసు పోరల సంగతి చెప్తున్నావు గాని ముందు నీ మీసాల సంగతి చూస్కో తాతా! చుట్ట బదులు మీసాలు కాల్చుకుంటవేమో'! మొదటి యువకుని మొహమ్మీద ముసిముసి నవ్వు. జోకు పేలలేదు. మొహం మసిబట్టలాగైపోయింది. రెండో యువకుడు గుర్రుమన్నడు. శవం ముంగిట జోకులేస్తవా! అని నిలదీస్తున్నాయతని చూపులు. 'చూడు బిడ్డా'! పెద్ద మనిషి సర్దుక్కూచున్నడు. కళ్లమీదికొస్తున్న సూర్యకిరణాలను అరచేత్తో అడ్డుకుంటున్నడు. 'మహారాజులు చస్తే గంధంచెక్కలతోని కాష్టం జేస్తరు. మనసోంటోళ్ళ కాష్టాన్ని మామూలు కట్టెల్తోని కాలవెడ్తరు. మామూలు కాష్టాలగ్గూడా వందల రూపాయలు కావాలె.'పచ్చని చెట్టును నరుకుడు పాపమంటరు గూడా. కాని బొందలు దోడి, మోటలకు దండెడతాళ్ళు అల్లి బతికినోని పీనుగును కాష్టం జెయ్యాలంటే...ప్చ్... దమ్ము దీసిండు. అర నిమిషమాగి 'అయినా ఇప్పుడు మోటలు లేవు, మొద్దులు లేవు. వాటికి దందెళ్ళు లేవు. వాడేమన్నా పైసలు కూడవెట్టి ఎక్కడనన్నా దాచిపెట్టిండా?' మందలించిండు. ఆ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నిజమే... అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. మనోవ్యాధికి మందు లేదు. ఎదిగిన కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకున్న బొందయ్యను విధి వెక్కిరించింది. రోజురోజుకు బక్కజిక్కి, తిండి సరిగా లేక ఎముకలగూడై పోయిండు. నిన్న మధ్యాహ్నం ప్రాణాలెగిరిపోయినై. కులస్తులంతా ఇంటికొచ్చిండ్రు. ఓ రాత్రి భయంకరంగా గడిచింది. తెల్లవారింతర్వాత శివరామకృష్ణ సేవాసమితి వాళ్లొచ్చి ఓ గంటసేపు భజనచేసి పోయిండ్రు. అప్పటికే కరకర పొద్దు పొడిచి మూరెడెక్కింది. ఆడవాళ్లు శవం చుట్టూ కూచున్నరు. మొగవాళ్ళు బయట అరుగుల మీద, వాకిట్ల గుంపులు గుంపులుగా జేరి మాట్లాడుకుంటున్నరు. కొందరు ఇంటికెళ్ళి, మరి కొందరు గుడిశె హోటళ్ళకెళ్లి చాయ తాగి వస్తున్నారు. సూర్యుడు నడినెత్తి మీదికొచ్చిండు. అయినా కొందరు శవం లేచేదాకా పచ్చి మంచినీళ్లు గూడా ముట్టమని భీష్మించుక్కూచున్నారు... ... ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గురు వద్దు... సూత్రాన్ని పాటించిన ధార్మికుడు బొందయ్య. కొడుక్కు పట్నం హాస్టల్ ఆశ్రయమిచ్చింది. ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాసవగానే అదృష్టం ఇంజనీరింగ్ చదివించి, అట్నుంచి అటే అమెరికా పంపించింది. పాలబుగ్గల పసితనంలో పారాడిన తల్లి ఒడిగాని, పల్లెగుడి గాని స్మృతిపథంలో నిలువలేదు. మురికివాడలో అల్లాడిపోతున్న తల్లితండ్రుల్ని చూస్తే ఆ కొడుక్కెంతో అసహ్యం. అందుకే అమెరికా అమ్మాయినే పెళ్ళాడి, అక్కడనే స్థిరపడి పోయిండు. తోడబుట్టిన చెల్లి గురించి పట్టించుకున్నదీ లేదు, పెళ్ళీడుకొచ్చిన చెల్లికో ఉత్తరం రాయాలన్న ఆలోచన గూడా రాలేదు. 'అదంతా నాల్గు చేతులు సంపాదిస్తున్న డాలర్ల మహిమ' అని బొందయ్య సరిపెట్టుకున్నడు. భార్య సావిత్రి... గుండె లొల్లిని భరించలేకపోయింది. పేగుబంధం పలవరించింది. 'వాణ్ణి మనమేమన్నా గంజి వొయ్యిమన్నమా! తోడబుట్టి కూడ పెరిగిన చెల్లె పెండ్లి జెయ్యమన్నమా! కోడల్నోసారి చూపించమన్నాం... గంతే కదా' అంటూ కంటతడి పెట్టింది. 'పిచ్చిదానా'! బొందయ్యకు పాపమన్పించింది. మనం వాణ్ణి కని ఐదేండ్లు పెంచి హాస్టల్ కప్పజెప్పినం. అప్పట్నుంచి వాడెప్పుడన్నా మనింటికి సరిగా వచ్చిండా? పండుగ పబ్బాలకు గిట్లొచ్చి గట్లపోయె. బొందలు తోడుతుంటే మట్టిల రాలిపడ్డ నా చెమటచుక్కల్ని చూసిండా? దందెడ పేనుతుంటే పొక్కులెక్కిన నా చేతుల్ని చూసిండా? ఏదన్నా సాయం పట్టిండా! మనూరికొస్తే చదువు ఖరాబైతదని మనం అనుకుంటిమి. ఏమైతే ఏందిలే, వాడక్కడ సుఖంగ ఉన్నడు. సల్లగ బతకనీ...' అని ఊరడించి గుండెమంటల్ని చల్లబరిచిండు.కూతురు గురించి.. 'మరి గీ సరళ పోరి గూడా మన కడుపుల పుట్టిందే గదా! ఏడో తరగతిలుండగనే పెద్దమనిషాయె. సదువాగిపాయె. ఇంకా రెండు మూడేండ్లన్నా సదివించకపోతిమి. ఆడపోరిని ఇంకో ఊర్లె సదివించాలంటే మనసొప్పకపాయె. ఇప్పుడు దానికి పద్దెనిమిదేండ్లు దాటిపాయె. దాని పెండ్లి ఎట్లా జేస్తవ్?' భార్య బాధ్యత గుర్తు చేసింది. సన్యాసి లెక్క నవ్వి 'అంతా ఆ పరమాత్ముని దయ' అని చేతులెత్తి దండం బెట్టిండు. అంతా విన్న సరళ 'ఇది వెనుకటి జమానా కాదు. నా పెండ్లి గురించి తొందర లేదు. మీరు ఫికర్ చెయ్యొద్దు' సముదాయించింది. లోపలి నుండి సరళ, సావిత్రిల ఏడుపు వినబడుతోంది. అరుగు మీది పెద్దమనిషి చుట్టపొగ పీలుస్తున్నడు. 'మరి.. బొందయ్యకు బొంద ఎవలో ఒకలు తోడాలె గదా!' విసుక్కుంటూ గుర్తు చేసిండు. మొగవాళ్ళు మొహాలు చూసుకుంటున్నరు. ఏదో కొత్త సంగతి విన్నట్టు కొందరు ఆశ్చర్యపోతున్నారు. 'మనూర్లె బొందయ్య తప్ప ఇంకా ఎవలన్నా బొంద దోడిండ్రా?' రుమాలు దులుపుకుని భుజమ్మీదేసుకుంటూ అడిగిండో నడివయసాయన. 'నిజమే కాని వాడు సచ్చిపాయె. ఇప్పుడు ఎవలన్నా తోడక తప్పదు గదా!' నువ్వంటే నువ్వనుకుంటున్నారు. కీచులాడుకుంటున్నారు. గీ పని నాకు రాదు. అందరి నోట అదేమాట. 'ఓర్నియవ్వ గిదేందిరో!?' అంతా గమనిస్తున్న ఓ ముసలమ్మ ఝాడింపుకు దిగింది. ఏదన్నా నౌకరి ఉన్నదంటే పాంటు, బుస్కోటేసుకుని పదుల మంది వైసుపోరలు ఉరికొస్తరు. తాత ముత్తాతలు చేసిన బ్యాగరి పని చెయ్యమంటే ఛస్తరు. ధూ.. నీయమ్మ... దునియా అంత గిట్లనే ఉన్నదా?' యువ కిశోరాలకు నవ్వొచ్చింది గానీ, పౌరుషం రాలేదు. నాలుగైదు నిమిషాలు మొఖాలు చూసుకున్నారు. మరిప్పుడెట్లా? పెద్దమనిషి పరేశానైపోతున్నడు. 'మన కులపోల్లంతా బొందలు తోడాలె. ఎవ్వలూ తోడకపోయిరి. ఒక్క బొందయ్య తోడె. వాని కొడుకేమో కొండంత చదువు జదివి రెక్కలొచ్చి ఎగిరిపాయె. మన కులాచారం కుక్కల పాలాయె' గుండెల మీద గుండుసూదులు గుచ్చుకున్నట్టుంది. 'అరేయ్! గీ వైసు పిల్లగాండ్లెవలన్నా తోడుండ్రిరా. నా వయసోల్ల నడుములు కూలవడిపాయె. రెక్కలు మూలకుపడె. కిరికిరి ఎందుకురా జెల్ది వొయ్యి తోడుండ్రి బిడ్డా' బతిమాలిండు. అయోమయంగా ముఖాలు చూసుకున్నరు యువకులు. కళ్ళతో సైగలు జేసుకున్నారు. 'గా పని మాకు రాదని ముందే చెప్పినంగదనే పెద్దమనిషీ! మల్లా మా తెరువొస్తే మర్యాదగుండది' అందరి తరఫున ఒక్కరి వార్నింగ్. పెద్దమనిషిలో ఆశ చావలేదు. అతని చూపు ప్రౌఢులను తడుముతున్నై. బేజారైంది ప్రౌఢులకు. 'నువ్వు గట్ల జూస్తే మాకు భయమైతదే పెద్దమనిషీ' ఓ ప్రౌఢ శిఖామణి పౌరుషం. నీ బుద్ధి బొందలవడంగా బొంద దోడుడు మాతో నైతదా? కానే కాదు' తెగేసి చెప్పి కాండ్రించి ఉమ్మేసిండు. ఆడవాళ్లు గొల్లుమన్నరు. శవాన్ని జాలిగా చూస్తున్నరు. 'ఎందరికో బొందలు తోడితివయ్యా. నీకు బొందలు ఎవలు తోడుతరయ్యా..' సావిత్రి పొత్తికడుపులో సప్త సముద్రాలు పొంగుతున్నై, భర్త శవమ్మీద వాలి శోకాలు దీసింది. 'పీనుగు వాసన వడ్తుంది. జెల్ది కానియ్యిండ్రి' ఓ ముసలమ్మ ముక్కు మూసుకుంది. అంతవరకూ సరళ పక్కనే ఉన్న యువతి బయటికొస్తూ... 'గీ మొగోల్లు, మొనగాల్లంతా ఏంజేస్తున్నరు? బొంద దోడుడు అదేమన్నా బ్రమ్మవిద్యనా?' కవ్వింపుగా చూసింది. 'గడ్డపార, పార, తట్ట వట్టుకుని బొందలగడ్డకు వోతే అక్కడనే తెలుస్తదంత' వయసు పొంగుల మీది కొంగును సవిరించుకుంది. 'గట్లనంగనే గిట్ల పనైతదా?' మరో యువకునికి రోషం ఇంజెక్షనిచ్చినట్టయింది.' డిగ్రీలు చదువుకున్న మేము బొందలు తోడెటందుకే పనికొస్తమా? సవాలు విసిరిండు.'కాదు' అదే యువతి మూతి మూడు వంకర్లు తిరిగింది. 'పూటకు తల్లెడు దిని ఊరు మీద బలాదూర్ తిరిగేటందుకే పనికొస్తరు' చేతులు తిప్పేసింది. 'మరైతే పీనుగు ఇంట్లనే ఉంటుందా?' సూటిగా అడిగింది. కొంగు నడుముకు బిగించుకుంటూ 'మీకు చాతగాకపోతే చెప్పుండ్రి' ఛాలెంజి విసిరింది. తర్జన భర్జనలు తారాస్థాయికి చేరుకున్నై. సరళ గుండె తడి ఆరలేదు. పరిపరి విధాల పరితపిస్తుంది... మా నాయన మంచోడే గదా. ఎవ్వరికేమీ నష్టం చెయ్యలేదుగదా. చాతనైన సాయం జేసిండు... బొంద ఎవ్వలూ తేడమంటే ఎట్లా... ఆలోచన ధైర్యంగా రూపుదిద్దుకుంటోంది. 'నీ బొంద! బొంద దోడుడంటే మాటలా, మజాకా!' మరో యువకుడి మాట. 'కాదు. చేతులు, మాటలు కోటలు దుంకుతై కానీ కాళ్ళు తంగెళ్ళు దాటయి' యువతి వెక్కిరింపు. 'మరి గీ లొల్లి ఎందుకు? చేతులల్ల చూపించు చాతనైతే' యువకుడు నవ్వబోయి, సరళ మొహంలో మార్పులు చూసి మానుకున్నడు. సరళ గుండె గుండ్రాయిలా తయారైంది. ... అమ్మ మంగళసూత్రాలు నాయిన మందులకే అమ్మితిమి. అమ్మ మెడలున్నది పసుపుకొమ్మేనాయె. ఇప్పుడు చేతిల ఒక్క రూపాయి గూడా లేదు. నాయినకు తలకొరివి పెట్టాల్సిన అన్నయ్య అమెరికాలనే ఉండె. కని, పెంచిన తల్లితండ్రులు వాడికి బరువైపోయిరి... సరళ కంటి ధారలు కపోలాలను తడిపేస్తున్నాయి. కాని... మొండి ధైర్యంతో ముందుకు కదిలింది. ఇప్పుడేం జెయ్యాలె? నా సంగతేంది? పెండ్లి కావల్సిన బిడ్డ సరళ సంగతేంది?... సావిత్రి గుండె చెరువైపోతుంది. శవం పక్కన గోడకొరిగి మోకాళ్ల మధ్య గదవ ఆనించి కూచుంది. బయట బొంద తోడుడు గురించి చర్చలింకా ఓ కొలిక్కి రాలేదు. ఎలాగైనా సరే యువకుల చేత బొంద తోడించాలని ప్రౌఢుల పట్టుదల. శవానికి దహన సంస్కారం చేయించాలనే యువకుల ఆరాటానికి ఆవేశం జోడై ఆలోచనకు తావియ్యడంలేదు. శవం దుర్గంధం ఇల్లంతా వ్యాపించింది. దగ్గరున్నవారి ముక్కుపుటాలనదరగొడుతుంది. 'బొంద దోడుడు మాతోని కానే కాదు. ఏంజేసుకుంటరో చేసుకోండ్రి.' యువనాయకుడు తేల్చిపారేసిండు. 'మేమెప్పుడూ బొంద తోడలేదు. ఇప్పుడు తోడం' ప్రౌఢనాయకుని తెగింపు. 'అయితే గడ్డపార, పార, తట్ట వట్టుకుని నా ఎంబడి రాండ్రి. ఎట్ల తోడాలనో నేను చూపిస్త' పెద్దమనిషి తల బాదుకున్నడు. 'మేమెందుకు? బొందల గడ్డకు వొయ్యి నువ్వే తోడు తాతా!' యువకుని నిరసన. 'నాకు శక్తి లేదు. వైసుడిగిపోయిందిరా!' అందరిలోనూ అసహనం అంగలేస్తుంది. ఆకలి కేకలు అల్లరి పెడుతున్నై. అరుగుల మీంచి లేచి కొందరు వెళ్లిపోవాలనుకుంటున్నరు. సరళ కృతనిశ్చయంతో బయటికొస్తోంది. మొహం గంభీరంగా ఉంది. ఎర్రని ఒంటిరాయి ముక్కుపుడక కొత్త వెలుగులు విరజిమ్ముతూంది. కొంగు నడుముకు బిగించి ఉంది. నుదుటి మీద ముంగురులు గాలితో ఆడుకుంటున్నై. నల్లని కనుబొమల మధ్య ఎర్రని బొట్టు ఉదయ సూర్యునిలా కనబడుతూంది. ఎడమ భుజమ్మీద పార, గడ్డపార... కుడి చేతిలో తట్ట... నిర్భయంగా బయటకొచ్చింది. నేరుగా బొందలగడ్డ వైపు నడుస్తూంది. పెద్దమనిషి లేచి ఆమెననుసరించాడు.Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.