Articles - Sagarayaanam




Name: Admin

Published Date: 06-04-2016


సాగరయానం

అమెరికా నుంచి కెనడాకి షిప్పులో వెళ్ళాలని చేసిన ప్రయత్నం... గురువారం ఉదయం పది గంటలకి న్యూజెర్సీ నుంచి అందరం బయలు దేరి ఆగుతూ ఆగుతూ, తింటూ తాగుతూ, న్యూయార్క్ షిప్ యార్డ్ జేరే సరికి పన్నెండు దాటింది. కారు పార్కింగు చేసి సామాను అప్పజెప్పే చోట వారికి అప్పజెప్పి, చెకింగులు అన్నీ దాటుకుని, ఎయిరో బ్రిడ్జి లాగే ఉన్న షిప్పో బ్రిడ్జి (అదే పీర్) అంతా నడిచి షిప్పు లోకి అడుగిడ గానే 'ఇదేదో ఇంద్ర భవనమా? పుష్పక విమానమా?' అన్న భ్రాంతి కలిగింది. 'నిజానికి ఇంద్ర భవనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పుష్పక విమానం గురించి పురాణాల్లో చదవటమే తప్ప చూసిందెవరని? ఐనా చదివిందానికీ సినిమాల్లో చూసిం దానికీ తేడా ఎంతో తెలియదు గానీ ఇది మాత్రం భూతల స్వర్గమే' అన్న భ్రాంతి కలిగింది. అడుగడుక్కి, మెట్టు మెట్టూకీ రైలింగుకీ దీపాల తోరణాలు. పైన సీలింగుకి అజంతా చిత్రాలను మించిన అందమైన డిజైన్ లతో, దీప కాంతులతో కన్నుల విందుగా ఉంది. ఒక వైపు రంగు రంగుల అద్దాల్తో మిరు మిట్లు గొలుపుతూ పైకీ క్రిందకీ తిరుగుతున్న ఎలివేటర్ల సోయగాలు. ఇంకొక వైపు వీనుల విందుగా వాద్య సంగీతాలు.అందుకు లయ బద్ధంగా ఆడుతూ పాడుతూ ఎవరి ధోరణి లో వారు కదలి పోతున్నారు. తెలుపూ, నలుపూ, పొట్టీ, పొడుగూ లావూ సన్నం ఇలా. సరే అన్నీ చూసుకుంటూ రెండవ అంతస్తులో రూముకు వెళ్ళే సరికి మాకంటె ముందుగానే మా సూట్కేసులు గుమ్మంలో ఎదురు చూస్తున్నాయి. తాళం తీసి లోపలికి వెడితే ఏముంది? స్టార్ హోటల్ని మించి రాజ భోగాలతో స్వాగతం పలికింది. ఒక వైపు గోడకి అందమైన పెయింటింగులు, మరొక వైపు గోడంతా అద్దానికి క్రిందగా అమర్చిన టేబుల్ దానిమీద ఒక ట్రేలో రక రకాల పానీయాలు, మరొక వైపు ట్రేలో సువాసనల పెర్ఫ్యూములు. ఇంకొక వైపు కర్టెన్ తొలగిస్తే విండో గుండా బయటి ప్రకృతి అందాలు, తెల్లని దుప్పట్ల తో నీటుగా ఉన్న బెడ్లు, టి.వి, టెలిఫోను. ఇలా దేనికీ లోటు లేనంతగా దీని ముందు ఎంత పెద్ద హోటలైన దిగ దుడుపే అనిపించింది. సరే ఇక అందరం తయారై తొమ్మిదో అంతస్తుకి వెళ్ళాము. అక్కడ లంచ్ అంటే బఫె సిస్టం. రక రకాల ఆహార పదార్ధాలు, పీజాలు, బర్గర్లు, డోనట్లు సలాడ్లు, టీ కాఫీలు, జ్యూసులు పేరు తెలియని ఎన్నో ఎన్నెన్నో. అంతస్తు మొత్తం, తిను బండారాలే. ఎవరికి కావలసినవి వారు తీసుకుని కూర్చుని తినడానికి అనువుగా అక్కడో షిప్పు అంచులకి బయటి వ్యూ కనబడేలా టేబుల్స్ వాటి చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. ప్రతి టేబుల్ కీ మధ్య గా షిప్పు రూఫు వరకు నలు వైపులా కనబడేలా నాలుగు నాగ కన్యల బొమ్మలు లైట్ల కాంతులు విరజిమ్ముతూ అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఏ అంతస్తులో ఎటువైపు చూసినా షిప్పుని ఇంత గొప్పగా ఎలా చేయ గలిగారా? అని విస్తు పోక తప్పదు. కావలసింది తిని తాగి ఫోటోలు తీసుకుంటూ పదవ అంతస్తుకి జేరుకున్నాం. అప్పడికి మూడు గంటలు దాటింది. అక్కడ అంతా స్విమ్మింగు పూల్ అవీ ఉన్నాయి.పదకొండవ అంతస్తుకి వెడితే అక్కడ చిన్న పిల్లల స్విమ్మింగు టెన్నిస్ ఆటలు పక్కన రూములోకి వెడితే స్పా అంతా అందాలకి మెరుగులు. బయట మళ్ళీ గోల్ఫ్ ఆటలు. ఇలా అన్నీ చూసుకుంటూ చివరి గా పన్నెండో అంతస్తు కి వెడితె పొగ గొట్టం తెర చాప డెక్ మొత్తం తిరుగు తుంటే సమయం తెలియలేదు కొద్ది నిముషాల్లో షిప్పు బయలుదేర బోతోందని ఎనౌన్స్ మెంటు. అప్పటికి సంధ్య చీకట్లు అలము కొంటున్నాయి. ఇక నా డ్యూటీ ఐపోయిందన్నట్లు దివాకరుడు తన అలసిన రధాశ్వాలను వెనుకకు మరల్చు తున్నాడు. విరహాన్ని భరించలేని ఆకాశం జేగురు రంగు దాల్చి కోపంగా చూస్తున్నట్టుంది. మరొక వైపు తన చల్లని కిరణాలతో అలరించాలని తాపత్రయ పడుతున్న చంద్రుడు సగం సగం అర్ధ చంద్రాకారంలొ నృత్యం చేస్తున్నాడు. మీ ఇద్దరి ఆగమన నిష్క్రమణాలతో నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా నేనెవరికీ ఏమీ కాని ఎవరికీ చెందని అసుర సంధ్యను నిష్క్రమించక తప్పదు అనుకుని పేలవంగా నవ్వుకున్న సంధ్య నీరసంగా కదలి పోతోంది. షిప్పు నీటిని ముందుకు తోసుకుంటూ దూరంగా వెడుతూ సముద్రంలో కలుస్తుంటే వింత అనుభూతి. నురగలు గక్కుతున్న కెరటాలు ఎడా పెడా కసిగా దారి వదులుతూ తప్పు కుంటున్నాయి. పశ్చిమాన ఇనుడు ఇంకా ఇంకా సగరుని కౌగిట ఒదిగి పోతున్నాడు. ఆ సుందర దృశ్యం చూస్తూ డెక్ మొత్తం తిరిగే సరికి డిన్నరుకి టైమైయింది. ఇక మూడో అంతస్తు లో పారిస్ డైనింగు హాలుకి వచ్చాము. హాలంతా పెద్ద పెద్ద రౌండు టేబుళ్ళతో టేబుల్కి పది కుర్చీలతో అందమైన టేబుల్ క్లాత్లతో చెంచాలు, ఫోర్కులు, ప్లేట్లు అన్నీ సిద్ధం చేసి సర్వర్లు చిరు నవ్వుల పలకరింపులతో స్వాగతం పలికారు. ఇండియన్ ఫుడ్ వెజిటేరియన్ కావాలని అడిగాము. అందుకు ఈ రోజుకు మాత్రం మాదే ఉంటుంది. రేపటి నుంచి మీరడిగింది ఇస్తాము అని చెప్పి మెను ఇచ్చారు. సరే ఇక తప్పేదేముంది? నేనేమీ తినను గనుక కొంచం బ్రెడ్ చెప్పి డిజర్ట్ మాత్రం ప్లైన్ వెన్నిల్లా చెప్పాను. అందుకు మామీ ఉత్త వెన్నిల్లానా? అని నవ్వారు. మా టేబుల్ కి టోనీ, లండన్ అని ఇద్దరు సర్వర్లు నవ్వుతూ, నవ్విస్తూ కొసరి కొసరి వడ్డించారు. ఇంతలో ఎవరిదో బర్త్ డే పార్టీ. కేక్ కటింగు హాపీ బర్త్ డే టూ యూ పాటలూ, చప్పట్లతో అంతా కోలాహలం. డిన్నరు అనంతరం స్టాఫ్ అందరు కలసి అక్కడే ఉన్న టేబుళ్ళ పైన, మిరుమిట్లు గొలిపే లైట్ల క్రింద, వీనుల విందుగా, కన్నుల పండువుగా చక్కని సంగీత నృత్యం.పది పదిహేను నిముషాలు మైమరచి తేరుకుని ఇక ఈ రోజుకి విశ్రాంతి తీసుకుని రేపట్నుంచీ అన్నీ చూద్దాం అనుకుని రూములకు వెళ్ళి పోయాము.మర్నాడు ఉదయం ఐదు గంటలకే లేచి సన్ రైజ్ చూడాలని పన్నెండో అంతస్తు డెక్ మీదకి వచ్చాము. టీ, కాఫీలు రెడీగా ఉండటంతో కాఫీ కప్పులు చేత బట్టుకుని డెక్ అంచుల నిలబడితే ఎంత బాగుందని? కడలి కెరటాలను కసిగా చీల్చుకుంటూ ముందుకు దూసుకు పోతున్న షిప్పుకు సగరుడు తప్పుకుని దారి వదులుతున్నట్టుగా ఉంది. దూరంగా మరికొన్ని షిప్పులు లైట్ల కాంతితో రాబోతున్న ఉదయారుణ కిరణాలతో పోటీ బడలేక వెల వెల బోతున్నాయి. నలు వైపులా నీలి రంగు ఆకాశం సముద్రుని కౌగిలి వీడ లేక పోతోంది. తూరుపు వైపునుంచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్న సూర్యుడు మత్తు మత్తుగా బలవంతాన పై పైకి వస్తూ తన లేలేత ఎరుపు రంగుతో ఉషః కాంతులను విశ్వ మంతటా విరజిమ్ము తున్నాడు. సముద్రుని పై పడిన ఆ కిరణాలు తళుకు లీనుతున్న జలతారు తీగల్లా మెరుస్తున్నాయి. 'ఇలాంటి దృశ్యాన్ని చూసే కాబోలు అలనాటి ప్రభంధ కవులు సూర్యోదయ సూర్యాస్త మయాలను ఎంత బాగా వర్ణించారని? 'చకిత తారక లావల బార కాంతి సూత్రమ్ముల యుచ్చు లొడ్డెను సుతారపు తూరుపు వేటగాడు' అన్న ఉమర్ ఖయ్యాం' పద్య పాదం గుర్తు కొచ్చింది. చేతిలో వెచ్చని కాఫీ కప్పు చల్లని ఆహ్లాద కరమైన సాగర సమీరం ఇన్ని అందాలు తిలకించే తీరిక ఇక్కడ గాక మరెక్కడ ఉంటుందని? నిజంగా ఈ ప్రకృతిని తిలకించాలే గానీ వర్ణనా తీతం. ఇక బలవంతాన కదిలి రూముకి వెళ్ళి స్నాన పానాదులు ముగించుకుని ఏముంది షిప్పు లో తిరగటమే పని. రోమియో లౌంజికి వచ్చాము. ఇక్కడ నిన్న రాత్రి డిన్నరు తర్వాత తీసిన ఫోటోలు గేలరీలో పెట్టి ఉంచారు. కావలసిన వారు తమ ఫొటొలను 8, 9 డాలర్లు పెట్టి కొనుక్కోవాలి. పక్కనే షాపింగు చేయాలనుకునే వారు డ్రస్సులు, వాచీలు, నగలు ఇలా కొనుక్కో వచ్చు. మరి కాస్త పక్కకి వెడితె లైబ్రరీ ఉంటుంది. అందులో పుస్తకాలు, పిల్లల ఆటవస్తువులు అన్నీ ఉంటాయి. మరొక వైపు క్లబ్బు, బారు తర్వాత ఆటలు, పాటలు, కాసినో గేములు అంతా గాంబ్లింగ్. మరొక అంతస్తుకి వెడితే స్టేడియమును మించి సీటింగు ఎరేంజి మెంటుతో పెద్ద ధియేటరు ఉంది. అక్కడ సినిమాలు నృత్య గానాలు, జ్యోక్స్, బింగో ఆటలు ఖుషీ ఖుషీగా, మజా మజాగ బోలెడు ఆకర్షణలు. ఇవన్నీ చూసుకుంటూ తిరుగు తుంటే లంచ్ కి టైం అయిందన్న సంగతే మర్చి పోయాము. సరే లండన్ డైనింగు హాలుకి వెళ్ళాము. లంచ్ అంటే ఇండియన్ ఫుడ్ బఫే కాకుండా రాత్రిలాగే అన్నీ కొసరి కొసరి వడ్డించారు. టోనీ, లండన్లు. మళ్ళీ డిజర్ట్ వెన్నిల్లానే చెప్పేసరికి మామీ ఎప్పుడూ వెన్నిలా ఏనా? అని నవ్వారు. సరే ఇక తినడం కాగానే మళ్ళీ తిరగడం అర్ట్ గేలరీ లో అద్భుత మైన వర్ణ చిత్రాలను సందర్శించి అన్ని అంతస్తులు తిరిగి పదవ అంతస్తుకి వచ్చాము. ఇక అంతా స్విమ్మింగు మయం. కొందరు నీటిలొ ఈదుతుంటే మరికొందరు అదే డ్రస్సులో క్రీములు రాసుకుంటూ పూల్ చుట్టూ మంచం లాంటి కుర్చీల పై పడుకుని ఎదురుగా డెక్ కి ఉన్న పెద్ద ధియేటరులోంచి వస్తున్న కార్య క్రమాలను తిలకిస్తూ వినోదంగా ఒళ్ళంతా ఆరబెట్టు కుంటున్నారు. జనాలకి కన్నుల పండువుగా ఉంది. మరొక పక్క టాటూలు వేయించుకునే వారు కొందరు, ఇంకొక వైపు స్పాకి జిమ్ముకి గోల్ఫ్ ఆటలకి స్టీం బాత్లకీ అదే సోనా అందాలకు మెరుగులు దిద్దుకోవాలని ఇలా ఎవరి హడావుడి వారిది.ఇక సాయంత్రం వరకు తిరిగి అంద మైన సూర్యాస్త మయం చూసి డిన్నరుకి వెళ్ళాము. ఈ రోజు అందరూ ఫార్మల్ డ్రస్సులో రావాలనే సరికి హాలంతా సగానికి సగం చీరెలతో నిండిపోయింది. ఈ షిప్పులో ఇంత మంది ఇండియన్స్ ఉన్నారా? అనిపించింది. డిన్నరులో అంతా మన కూరలు అవీ రైస్ తో సహా. టోనీ, లండన్ లు అడిగి అడిగి నవ్వుతూ జ్యోక్స్ చెబుతూ మాజిక్కులు చేస్తూ ముఖ్యంగా పిల్లలని మరింతగా ఆకట్టు కున్నారు. ఇక అలవాటు పడిన టోనీ మామీ ఇద్గో నీ వెన్నిళ్ళా అంటూ చెప్ప కుండానే తెచ్చి ముందుంచాడు. ఎవరివో మళ్ళీ పుట్టిన రోజు, పెళ్ళి రోజు, షష్టి పూర్తి చప్పట్లు పాటలు ఫోటోలు తీయడం హడావుడి. అనంతరం స్టాఫ్ వారి సంగీత నృత్యం, వెలిగి ఆరుతున్న రంగు రంగుల లైట్ల క్రింద వింత వింత ఆనందం. మూడవ రోజు వెదరు బాగుండక పోవడంతో కెనడా వరకు వెళ్ళటల్లేదని వెను దిరిగుతున్నందుకు సారీ అని ఎనౌన్స్ మెంటు రావడంతో కొంత నిరాశ చెందినా ఇంటికి వెళ్ళ కుండా షిప్పులోనె ఉంటాం కదా అని ఆనందించాము. ఎందుకంటే ముఖ్యంగా ఇంటి పనీ ఒంట పనీ తో అలసిపోయిన ఆడవారికి (కొందరు మగ వారికి కుడా) పుట్టింటిని రెట్టించిన సుఖం ఉండటంతో ఎన్ని రోజులైనా హాయిగానే ఉంటుంది మరి. అందుకని ఇక మూడవ, రోజు నాలుగవ రోజు హాయిగా షిప్పు మొత్తం అన్ని అంతస్తులు చూసినవే చూసి, తిరిగినవే తిరిగి, తిన్నవే తిని చుట్టూ మబ్బులు కమ్మిన ఆకాశాన్ని, దూరంగా మసక మసకగా లైట్లతో కనబడే షిప్పులనీ చూస్తూ విశ్రాంతి గా గడిపే సరికి చివరి రోజు ఆదివారం డిన్నరు రానే వచ్చింది. డిన్నరులో మామూలు కంటే ఎక్కువ ఆదరాభి మానాలు చూపించారు టోనీ, లండన్లు. మామీ ఇదిగొ నీ వెన్నిళ్ళా అంటూ మరి కాస్త ఎక్కువ తెచ్చి నొక్కి పలికి టక్కుమని ముందుంచాడు. చివరిగా వీడుకోలు పాటతొ నృత్యం చేశారు. అప్పుడు టోనీని అడిగాము. ఈ కార్నివల్ షిప్పులో ఎంత మంది ఉంటారు? ఏమిటి? అని. 3600 గెస్టులు, 1200 స్టాఫ్, 250 వంట వాళ్ళు ఉంటామని చెప్పాడు. మరి బల్గేరియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి వచ్చామని ఆరు నెల్లకొక సారి వెడతామని, కుటుంబాలు అక్కడే ఉంటాయని తనకిద్దరు పిల్లలని చెప్పాడు. అంతా విన్నాక వీరి జీవితాలు సంద్రానికే అంకితం అనిపించింది. మనిషికి పది డాలర్లకి తక్కువ గాకుండా టిప్పు ఇవ్వాలి. వారి ఆదరాభి మానాలకి ఆనందంతో ఎక్కువే ఇవ్వాలని పించింది. వారి నుంచి వీడ్కోలు తీసుకుని రూములకు వెళ్ళి పోయాము. మర్నాడు సోమ వారం ఉదయం పది గంటలకి న్యూయార్క్ షిప్ప్ యార్డ్ కి చేరుకున్నాము. హడ్సన్ రివర్ నుంచి అట్లాంటిక్ సముద్రంలో తిరిగిన మత్తు వదిలి పోయింది. భూతల స్వర్గం నుంచి ఇలాతల నరకం లోకొచ్చి పడినట్లైంది. మన ఇల్లు, మన పని మామూలు అనుకుంటూ ఉస్సురని నిట్టూర్చి ట్రాలీ బాగులు ఈడ్చుకుంటూ పీర్ అంతా నడిచి నీరసంగా కార్లో కూల బడ్డాము. అంత వరకు పొందిన సుందర స్వప్నం కరిగి ఒక మధుర స్మృతి గా మిగిలిపోయింది.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.