Articles - Pushpaka Vimanamu
Name: Admin

Published Date: 06-04-2016


పుష్పక విమానము

'పుష్పక విమానం ఎలా ఉంటుంది?' అని ఎవరైన అడిగితే అది ఎవరూ చూడక పోయినా అందులోని వింతలు తెలియక పోయినా 'అందులో ఎంతమంది కూర్చున్నా ఇంకా ఒకరికి చోటు ఉంటుంది' అనే మాట బహుళ ప్రచారం లోకి వచ్చిందట. నిజానికి ఇది బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో 'పుష్పకం' అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. ఐతే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహముతో కానుకగా పొందాడట. పిమ్మట రావణుడు, తన సోదరుడైన కుబేరుని జయించి ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడట. ఇంతకీ ఆవిమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేసించి నప్పుడు, రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. ఇక ఆ పుష్పకము యజమాని మనసు ననుసరించి మనో వేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదుట. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్ట మైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖములుగల వారు, మహా కాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రములు గల వారు, అతి వేగముగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించ బడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత పంక్తులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహములు పుష్పాలు వాటి కేసరములు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉన్నాయట. మరికొన్ని చోట్ల అందమైన కొలనులు, పక్షులు సర్పాలు, వంటి వెన్నో వివిధ రకముల మణి మాణిక్యాలతో రూపు దిద్దుకొని ఉన్నాయి. జీవకళ ఉట్టి పడుతున్న కొన్ని బొమ్మల్లొ మేలు జాతి గుఱ్రాలు మంచి రెక్కలుగల పక్షులు, వాటి రెక్కలు ముఖాలు, ఎంతో విలాస వంతమైన భంగిమలో మలచటమె గాక వాటి రెక్కల మీద పగడాల పువ్వులు, బంగారు పువ్వులు పొదగబడి ఉన్నాయి. అంతే గాకుండా లక్ష్మీ దేవి తన మనోహర మైన హస్తాలలో పద్మాలను ధరించి పద్మ సరస్సులో విరాజిల్లు తున్నట్టు, ఆమె కిరువైపులా రెండు ఐరావతములు తమ తొండములతో పద్మాలను అభిషేకిస్తున్నట్టు మనోహరముగా చిత్రీకరించ బడి ఉంది. ఆ ఏనుగుల శరీరాలపై పద్మ కేసరాలు పడి ఉన్నట్లు, స్పష్టం గా కనబడుతున్న ఆ చిత్రాలను చూసి హనుమకు ఎంతో ఆశ్చర్యము ఆనందము కలిగాయట. హంసలు, తుమ్మెదలు, నిద్రించుట చేత నిశ్శబ్ధము గా నున్న సరోవరము వలె నిద్రించు స్త్రీలతో ఆ శాల నిశ్శబ్ధముగా నున్నది. ఆ స్త్రీల ముఖములు సూర్యోదయముతో వికసించి, రాత్రి కాగానే ముకుళించిన పద్మమువలె నుండెను. కొంత పుణ్యము మిగిలియుండుట చేత ఆకాశమునుండి రాలిన తారలే ఈ రూపమున ఈ భవనమందు, స్త్రీలుగా ఉన్నారేమొ అన్న భ్రాంతి కలుగు చుండెను. కేవలం ఆసనములే గాక సాక్షాత్తు స్వర్గములో ఉన్నట్టు, విశాలమైన వేదికలు, భవనములు, కొలనులు ఉద్యాన వనములు, వాటితో పాటు శ్రేష్ట తమములైన శంఖు, ఆయుధ, ధనుశ్శాలలు, మనోహరమైన విశాల మైన చంద్ర శాలలు, ఆపుష్పకములో ఇమిడి ఉన్నాయి. అంటే ఈ వర్ణనలను బట్టి చూస్తే దాని దివ్యత్వముతో పాటు ఆ నాటి శిల్ప చిత్రకళా విశిష్టతను తెలియ జెపుతున్నాయి. మరి నేటి విమానాలు వాటికి సాటి రాగలవా? ? ?Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.