నిరక్షర కుక్షి
అనగనగా ఒక జమీందారు పొరుగూరిలో వున్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి, నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు.
దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి, ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు.
ఘుమ ఘుమలాడి పోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క యెండా, మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమ ఘుమలూ. సేవకుడు ఉండ పట్ట లేక పోయాడు.
జమీందారు పళ్ళతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పళ్ళు తినేసాడు. హాయిగా ఒక చిన్న కునుకు తీసాడు.
యేమి ఎరగనట్టు గొయ్యిలోంచి లేఖని తవ్వి తీసుకుని, బుట్టనెత్తుకుని బయలుదేరాడు.
జమీందారు కూతురు బుట్టనీ, లేఖనీ తీసుకుంది. తండ్రి పంపించిన లేఖ చదివింది. పళ్ళు లెక్ఖబెట్టించింది.
“నాలుగు పళ్ళు తక్కువున్నాయేమిటి?” అని నిలదీసింది. “నువ్వేమైన తిన్నావ?”
“అయ్యో! అయ్యో! ఇదెక్కడ విడ్ఢూరం తల్లీ! నేలలో పాతిపెట్టాను కదా, ఈ లేఖ ఎలా చూసింది?” అని లబో దిబో మని తల కొట్టుకున్నాడు.
జమీందారు కూతురికి నవ్వొచ్చేసింది. సేవకుడిని క్షమించేసింది.
కాని, చూసారా పిల్లలు, మూర్ఖుడైన ఆ నౌకర్కి చదువు కూడా రాకపోతే ఎంత అనర్ఘమో?