Articles - Nadamanthrapu Siri
Name: Admin

Published Date: 16-11-2015


నడమంత్రపు సిరి

అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి వుండేవాడు. ప్రతిరోజూ ఊరిబయట వున్న చెరువుకు వెళ్ళి, చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతడి జీవనభృతి. ఒక రోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలలో బరువైనదేదో చిక్కుకున్నట్టు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. అది జాలరిని ఉద్దేశించి,”ఓ జాలరీ! నేను ఈ చెరువుకు రాణీ చేపను. నీ చేపల వేటవలన ఈ చెరువులోని చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది. అందువల్ల నేటినుండీ నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానెయ్యాలి. అయితే నీ నోటిదగ్గర కూటిని తీసేసే ఉద్దేశ్యం నాకు లేదు. చేపలవేట ఆపినందుకు ప్రతిగా నీకేంకావాలో కోరుకో ఇస్తాను.” అని పలికింది.


అమాయకుడైన వెంకన్నకు ఏంకోరుకోవాలో అర్దంకాక,”నేను రేపు వచ్చి అడుగుతాను” అని చెప్పి, రాణి చేపను వల నుండీ విడిచిపెట్టి ఇంటి దారిపట్టడు. ఇంటికి చేరగానే భార్యకు జరిగినదంతా చెప్పాడు. అంతావిని ఆమె “ఏడ్చినట్టేఉంది మీ తెలివి. పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం కావాలని అడగక, సలహాకోసం ఇంటికోస్తారా? ఆ రాణిచేప కాస్తా రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్పమిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. త్వరగా వెళ్ళి అడగండి” అని తొందర పెట్టింది. వెంకన్న భార్య కోరికమేరకు పెద్దబంగళా, బోలెడంత ఐశ్వర్యం ఇమ్మని అడిగాడు. చేప “సరే ఇంటికి వెళ్ళు అన్నీ వస్తాయి” అని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది.


వెంకన్న ఇల్లు చేరేసరికి తనగుడిసె స్థానంలో పెద్దబంగళా, ఇల్లంతా ఖరీదైన సామన్లతో కళకళలాడుతూ కనిపించింది. అతడి భార్య వంటినిండా నగలు దిగేసుకుని ఎదురొచ్చింది. “అన్నీ బాగానే ఉన్నయిగానీ, నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా వుంది. కనుక తక్షణమే మళ్ళీ వెళ్ళి నన్ను రాణిని చేయమని చేపను అడుగు” అని వెంకన్నను చెరువుకు, తరిమింది. భార్యమాట కాదన లేక మళ్ళీ చెరువుకు వెళ్ళాడు వెంకన్న. రాణిచేప బైటకు వచ్చి,”ఇచ్చినవి చాలలేదా? ఇంకేం కావాలి? ” అని అడిగింది. “నా భార్యను మహారాణిని చెయ్యి” అని కోరుకున్నాడు వెంకన్న. రాణీ చేప నవ్వి “రాణి యోగం ముళ్ళకిరీటం వంటిది. భరించడంకష్టం. బాగా ఆలోచించుకునే అడుగుతున్నారా? ” అని ప్రశ్నించింది ” అదంతా నాకు తెలియదు. మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు” అని పట్టుబట్టాడు. “సరే నీఇష్టం. అభీష్టసిద్దిరస్తు . కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువుకు రావద్దు” అని వెళ్ళిపోయింది.


వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు. గత బంగళా స్థానంలో ఇప్పుడొక పెద్ద రాజమహలు వెలసింది. ఇంటినిండా నౌకర్లు, పరిచారికలతో రాణీవాసం మెరిసిపోతుంది. ఇంటి ముందు ప్రధానద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నరు. లోపలకు వెళ్ళబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా “నన్నెందుకు ఆపుతున్నారు? నేనీ ఇంటికి యజమానిని. లోపల ఉన్నమహారాణి నా భార్య” అని చెప్పాడు. మట్టికొట్టుకుపోయినదుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు. “చేపలు పట్టేవాడిలా ఉన్నావు. నువ్వు రాణి గారి భర్తవేంటి? పోపో” అని కసిరి పారేశారు. వెంకన్న లబలబలాడాడు “కావాలంటే ఒక సారి వెళ్ళి రాణిగారిని కనుక్కుని రండి” అని బ్రతిమిలాడాడు. వెంకన్న ను వదిలించుకునే దారిలేక, వారిలో ఒకరు రాజమహలు పైఅంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పడు. “ఎవరో అడుక్కునేవాడిలా ఉన్నాడు మహారాణి. మీ భర్తనని బుకాయిస్తున్నడు. పొమ్మంటే పోవడంలేదు” అని విన్నవించాడు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పై అంతస్తునుండీ ప్రధానద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడమంత్రపు సిరివలన ధనమదంతో కళ్ళుకు పొరలుకమ్మినట్లు భర్తను పోల్చలేక. “ఛీఛీ! వీడెవడో అడుక్కునేవాడే. తన్ని తరిమేయండి.” అని ఆజ్ఞాపించి లోపలకు వెళ్ళిపోయింది. ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేసారు.


అవమానంతో దు:ఖం కమ్ముకోగా కాళ్ళీడ్చుకుంటూ తిరిగి చెరువుదగ్గరకు చేరాడు. రాణీచేపను పిలిచాడు. చేప బైటకు వచ్చి “మళ్ళీ వచ్చి ఇంకేమి అడగవద్దని చెప్పానుగా ? ఎందుకొచ్చావ్?” అంది కోపంగా. “నేనిప్పుడు అడగడానికి రాలేదు. ఇచ్చినవి వద్దని చెప్పడానికి వచ్చాను. నువ్విప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న మొగుడ్ని గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకంలేదు. చేపలు పట్టటం నీకు అభ్యంతరమైతే, కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాము. అదీ కుదరకపోతే కలోగంజో తాగి బ్రతుకుతాము. అంతేగానీ ఈ నడమంత్రపు సిరి మాకొద్దు” అని వేడుకున్నాడు. రాణీ చేపనవ్వి “సరే నీకు శుభం కలుగుతుంది వెళ్ళు” అని మాయమైంది.

వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిశలో అతడి భార్య కట్టెల పొయ్యిమీద వంట చేయ్యడానికి అవస్తపడుతూ కనిపించింది. భర్తను చూస్తూనే ఆప్యాయంగా, “ఇంతాలశ్యమైందేం? త్వరగా కాళ్ళు చేతులూ కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను” అంది. వెంకన్న ఊపిరిపీల్చుకొని మనసులోనే రాణీచేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.