Articles - Naamakaranam




Name: Admin

Published Date: 05-04-2016


నామకరణం

(రసరాజు) వనమాలి బస్సు దిగాడు. ఎదురుగా తాతయ్య... వేయికళ్లతో తనరాక కోసమే నిరీక్షిస్తూ కనిపించాడు. తాతయ్య సూట్ కేసు కోసం చేయి చాచాడు. వనమాలి ఒప్పుకోలేదు ఇద్దరూ టాపులేని రిక్షా ఎక్కారు 'బాగున్నారా తాతయ్యా... నానమ్మెలా ఉంది...' వనమాలి యోగక్షేమాలడిగాడు. 'బాగానే వున్నాం బాబూ..' అంటూ తాతయ్య ఏవో కబుర్లలోకి దింపబోయాడు. 'తాతయ్యా... కాసేపు ఏమీ మాట్లాడించకు... చెట్టూ చేమా చూసుకొంటూ మౌనంగా పోదాం... సాయంత్రం నీ దగ్గరే కూర్చుంటాగా... అప్పుడన్నీ చెపుదువుగాని?...' 'ఇంకా చెట్టూ చేమా ఎక్కడివిరా.. పన్నెండేళ్ల క్రితం పల్లెటూరు అనుకొంటున్నావా... ఆపల్లెతల్లి ఎప్పుడో...' అంటూ తాతయ్య ఏదో చెప్పబోయాడు. వనమాలి కాసేపు ఆగు తాతయ్యా అంటూ గడ్డం పట్టుకొన్నాడు. కొంతదూరం సాగేసరికి వనమాలికి అన్నీ అనుభవంలోకి రాసాగాయి. అసలు - ఆ వాతావరణమే మారిపోయింది. సహనంతో రాళ్లదెబ్బలు తింటూ మధురంగా నవ్వే ఆ మామిడి చెట్టు కోసం అటూ ఇటూ చూశాడు. అది హుష్ కాకి అయిపోయింది... పండిన వరిచేల మధ్య ఎర్రటి తామరపూలతో కనిపించే ముత్తయిదువలాంటి ఆ చెరువు కూడా అదృశ్యమైపోయింది. రోడ్డుకి అటూ ఇటూ చూశాడు... పక్షులు కొరికి పడేసిన బాదంకాయలు కనిపించడం లేదు.. కోతి కొమ్మచ్చిలాడటానికి వంపు తిరిగిన అలనాటి చెట్టు కొమ్మలు సైతం చూపులకు అందటం లేదు. వర్షం వస్తే తలదాచుకోటానికి ఉన్న ఆ పాడుపడ్డ సత్రం కూడా కనుమరుగైపోయింది. చీదరించుకొనే మట్టిరోడ్డు స్థానంలో సిమెంట్ రోడ్డు కొత్త రూపం దాల్చి బద్ధకంగా ఒళ్లు విరుచుకొంటోంది... వనమాలి ఆవేదన చెందాడు. గతకాలం దృశ్యాలపై ఒక ఇనుప తెర పడిపోయింది. ఆ అనుభవాల్ని తలచుకొంటూ నిట్టారూచ్చాడు. 'కాలం నాణెం లాంటిది.. దానికి రెండు పార్శ్వాలు...' ఎప్పుడో తను రాసిన కథలోని ఒక వాక్యం గుర్తుకొచ్చింది. 'ఊళ్ళోకి వచ్చేశాం...' తాతయ్య మనవడి భుజంపై చేయి వేస్తూ అన్నాడు. అప్పుడు గాని వనమాలి వర్తమానంలోకి రాలేదు. 'ఏ బాబూ... రాఘవయ్యగారి విగ్రహం వద్ద ఒక్క నిముషం రిక్షా ఆపు' అన్నాడు వనమాలి. రిక్షా అక్కడ ఆగిది. తాతయ్యకు ఇదేమీ అర్థం కాలేదు. తాతయ్యా.. ఒక్క నిమిషం.. అంటూ బేగ్ లోంచి ఓ దండ తీశాడు. ఎందుకురా తాతయ్య అసహనంతో మూలిగాడు తాతయ్య చూస్తుండగానే వనమాలి ఆ విగ్రాహనికి దండ వేసి వచ్చి రిక్షాలో కూర్చున్నాడు. తాతయ్య వనమాలి చేసిన పనిని సమర్థించలేకపోయాడు. మనవడికేసి అదోలా చూసి వాడికి దండేవిట్రా... మన ప్రత్యర్థి... అంటూ మండిపడ్డాడు. వనమాలి ఏమీ మాట్లాడలేదు. ఆ ఊరు గురించి, ప్రజల గురించీ విన్నాడు. తాత, తండ్రీ కలిసి రాఘవయ్యగారి మంచి పనులకు ఎలా అడ్డు పుల్లలు వేసిందీ - అన్నీ మిత్రుడు సంపత్ ద్వారా ఎప్పుడో తెలుసుకున్నాడు వనమాలి. రిక్షా వెళ్లి ఒక ఇంటి ముందాగింది. అదే తాతయ్య ఇల్లు. ఆ సాయంకాలం... తాతయ్య తోడులేకుండానే వనమాలి ఊళ్ళోకి బయలుదేరాడు. దారిలో గుర్తుపట్టిన పెద్దవారినందరినీ వనమాలి చేతులు జోడిస్తూ పలుకరించాడు. 'గంజాయి వనంలో తులసిమొక్క' వనమాలి తీరుతెన్నుల్ని గమనించిన వాళ్ళు అనుకున్నారు. ఎంతగా మారిపోయింది ఊరు. అడగడుగునా వనమాలికి ఆశ్చర్యమే ఎదురయింది. ఊళ్ళో మచ్చుకైనా ఎక్కడా పూరిగుడిసె కనిపించడం లేదు. డాబాలూ, భవనాలు కొలువుతీరి 'కో' అని పిలుస్తున్నాయి. పన్నెండేళ్లలో ఇంత మార్పు రావడం వనమాలి నమ్మలేకున్నాడు. అక్కడక్కడా షాపులు, పద్ధతిగా రూపొందించిన రోడ్లు, మంచినీటి కుళాయిలు, డ్రయినేజ్ సౌకర్యం ఒకటేమిటి ఇలా ప్రతిదీ వనమాలికి వింతగానే తోచింది. పుట్టి పెరిగిన వూళ్ళో ఇంత అభివృద్ది కనిపించేసరికి వనమాలి ఎంతో సంతోషపడ్డాడు. కొంతదూరం వెళ్ళాక వనమాలి ఓ గుడి ముందాగాడు. గ్రామీణుల సహకారంతో ఆ గుడిని ఎలా తీర్చిదిద్దారో అక్కడున్న ఒక యువకుడు వివరిస్తుంటే వనమాలి విస్తుపోయాడు. ఒకప్పుడు తనకు బాగా తెలిసిన దేవాలయమే అది. అయితే ఆ గుడి స్వరూపమే మారిపోవడంతో గుర్తుపట్టలేకపోయాడు వనమాలి. వేణుగోపాల స్వామి గుడిలో అర్చన చేయించి నాలుగు అడుగులు ముందుకేశాడు. మునసబు గారింటి ముందు వెలసిన కళ్యాణ మంటపం వనమాలిని బాగా ఆకర్షించింది. వివాహాలు మొదలుకొని విద్వత్సభల వరకూ అదే వేదిక కావడం వనమాలిని అమితంగా ఆకట్టుకొంది. మరికంత దూరం సాగాడు. గ్రంధాలయం పలుకరించింది. లోపలికెళ్ళి చదువరుల జాబితాలో సగర్వంగా తెలుగులో సంతకం చేసి అక్కడున్న పుస్తకాల్ని చూసి బయటకొచ్చాడు. దానికి పదిగాజాల దూరంలో పాలకేంద్రం కనిపించింది. అది దాటి మలుపు తిరిగితే - పశుగణాభివృద్ధి నిలయం... వెనుక వీధిలో హైస్కూల్... ఆపక్కనే కో-ఆపరేటివ్ సొసైటీ... పురాణం పంతులుగారి రావిచెట్టుదాడి కొంచెం ముందుకు నడిస్తే హాస్పటల్... ఎదురుగా పోస్టాఫీస్... అక్కడే బ్యాంక్... ఊరికి మధ్యలో బస్టాఫ్... ఊళ్ళోకి బైపాస్ సర్వీసులు మాత్రమే రావు. అందుకే తాతయ్యకు ముందుగానే కబురుపెట్టి ఊరవతల రోడ్డు మీద బైపాస్ ఎక్స్ ప్రెస్ లో దిగాడు వనమాలి. ఒక్కొక్కటీ పరిశీలిస్తూ పార్కులోకి అడుగు పెట్టాడు వనమాలి. అదొక నందనవనంలా అగుపించింది. చాలాసేపు అక్కడు గడిపి ఇంటి ముఖం పట్టాడు వనమాలి. ఆ ఊరి ప్రగతి గురించి, రాఘవయ్యగారు పడ్డ శ్రమ గురించీ వాళ్ళూ, వీళ్ళూ చెపుతూంటే వనమాలి అక్షరం పొల్లుపోకుండా ఆసక్తిగా ఆ విషయాలన్నింటినీ ఆలకించాడు. ఆ ఊళ్ళో మూడు వందల ఇళ్లున్నాయి. జనాభా రెండు వేలు... అందులో సగానికి వనమాలి కుటుంబం లాగ అధిక సంపన్నులే. వాళ్ళందరూ కలిసి ఎవరి పరిధిలో వారు కొంత సొమ్ము పెట్టుబడి పెట్టి కొన్ని వాణిజ్య కేంద్రాలు నెలకొల్పడంతో ఆ వూరి కథే మారిపోయింది. ఆ ఊళ్ళో ప్రజలందరూ ఆ షాపులోనే కొనాలన్నది ఆ గ్రామ శాసనం. నాణ్యత, ధరల విషయంలో సమానంగా ప్రతి కొత్త ఉత్పత్తినీ ఆ షాపులు దిగుమతి చేసుకొంటున్నాయి. దొరకని వస్తువంటూ లేదు. లాభాల్ని పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకొంటూ - అందులో కొంత శాతాన్ని గ్రామాభివృద్ధినిధిగా కూడబెడుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూచడానికి ఊరిమధ్యలో ఒక కార్యాలయం ఉంది. పెట్టుబడి పెట్టే తాహతు లేని అట్టుడుగు వర్గంలో కొంతమందికి ఆ షాపుల్లో పనికల్పించబడింది. స్త్రీలు కుట్టుపని, లేసు అల్లటం మొదలగు పనులలో తర్ఫీదు పొందారు. అయితే ఇంతటి అభ్యుదయ చరిత్ర వెనుక రాఘవయ్య అనే ఒక మహనీయుడు దాగి ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకున్న వనమాలి ఆయనకు అంజలి ఘటించకుండా ఉండలేకపోయాడు. తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని గ్రామాభివృద్ధి కోసం ఉదారంగా దారపోసిన త్యాగశీలి ఆయన. ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రణాళికా రనచలోనూ ఆయనదే శ్రీకారం. ప్రభుత్వం నుంచి మేచింగ్ గ్రాంట్స్ సంపాదించడంలో ఆయన అడుగడుగునా కృతకృత్యులయ్యారు. తన ప్రయాణ మార్గంలో కొన్ని అడ్డుపుల్లలు వెక్కిరించినా ఆయన నవ్వుకొంటూనే ముందుకు సాగిపోయారు. తన తాతగారూ, తండ్రీ ఒక వర్గాన్ని కూడకట్టుకొని తిరుగుబాటు ఎగరేసినా ఆ నీడలోంచే ఆయన పురోగమించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రామ చైతన్యానికి ఊపిరిపోసింది రాఘవయ్యగారే! అడుగులో అడుగు వేసుకొంటూ ఆ గ్రామ చరిత్రనంతటినీ ఆనోటా ఈనోటా విన్న వనమాలికి కాళోజీ రాసిన మినీ కవిత గుర్తుకొచ్చింది. 'పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది...' జయప్రకాష్ నారాయణ్ పరమపదించినప్పుడు కాళోజీ చెప్పిన మినీకవిత ఇది. రెండు చేతులూ జోడించి మనసులోనే ఆ మహావ్యక్తికి నమస్కరించాడు వనమాలి. ఉప్పొంగిన ఆనందంతో క్షణకాలం ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గ్రామ వైభవం తిలకించి ఇంటిలో అడుగుపెట్టేసరికి రాత్రి ఏడుగంటలయింది. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ నుంచి వనమాలి తల్లితండ్రులూ, భార్య, మూణ్ణెళ్ల కొడుకూ వచ్చారు. ఆ రాత్రి వనమాలికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదు. ఉదయమే లేవాలి. అమెరికా నుంచి పది రోజుల క్రితమే వనమాలి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో తల్లీతండ్రీ ఉంటున్నారు. నిన్న ఉదయం హనుమకొండ వెళ్ళి అక్కడనుంచి నేరుగా ఈవూరొచ్చాడు. తాతయ్య కోరిక మేరకు తన కొడుక్కి నామకరణ మహోత్సవం రేపిక్కడ జరపాలి. నిద్రపట్టక వనమాలి ప్రక్కనే ఉన్న మేగజైన్ తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. ఒంటిగంట దాటిపోయింది. అయినా నిద్రపట్టడం లేదు. అతని ఆలోచనంతా తాను పుట్టి పెరిగిన ఈ ఊరి గురించే. ఇంతగా అభివృద్ధి సాదించడం వెనుక రాఘవయ్యగారి కృషి తనను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ పక్కనే తండ్రి, తాత కలిసి స్వార్థంతో ఆయనపై తిరగబడ్డ చరిత్ర మనసులో మెదిలింది. అమెరికాలోఉన్నప్పుడు ఈ ఊరు అభివృద్ది గురించి స్నేహితుల ద్వారా విన్నాడు కాని, ఇంత వైభవం ఉంటుందనుకోలేదు. అమెరికా వెళ్లాక 'మా పల్లె బంగారం' అంటూ ఎలుగెత్తి చాటాలనిపించింది. ఆ నిమిషంలో రాఘవయ్యగారు నవభారత గ్రామ నిర్మాతగా కనిపించారు. ఆ మరుసటి రోజు సాయంత్రం గుడి బయట 'నామకరణం' పై చర్చ మొదలయింది. అక్కడిద్దరు కూర్చున్నారు. 'పిల్లాడికి తాతగారి పేరు పెడతాడేమో వనమాలి'.... 'తండ్రి పేరు వదిలేశా...' అంటూ గుసగుసలు మొదలైనాయి. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. చర్చ ఏమిటో అతనికి అప్పటికే అర్థమయింది. 'మీరనుకొన్నట్లు ఆ పేర్లేమీ పెట్టలేదు. ఆఖరికి మనం కూడా తలకాయలు వంచుకునేలా కొడుక్కి పేరు పెట్టాడా....' అన్నాడు ఆ వ్యక్తి. 'అవును మరి... అమెరికాలో ఉంటున్నాడు కదా... ఏ క్లింటన్ పేరో, బుష్ పేరో తగిలించి వుంటాడు.... ఆ వుప్పు తిన్నాడుగా మరి..' అన్నారు. అదిగో అక్కడే పప్పులో కాలేశారు... మన పిల్లలెవ్వరికీ మనం కృతజ్ఞతగా పెట్టని పేరు ఆ అమెరికా కుర్రాడు పెట్టాడోయ్... దానికే సిగ్గుపడాలి మనమంతా... అన్నాడు. ఇంతకీ ఏమిటా పేరు అన్నారు... 'రాఘవ్...'



Share by Email



Comments


Your comments
Can't read the txt? click here to refresh.