Articles - Gaju Penkulu




Name: Admin

Published Date: 06-04-2016


గాజు పెంకులు

'అబ్బా... నొప్పి... వద్దు... డాక్టర్... వద్దు! అబ్బా... నొప్పి!' అంటూ బాధగా గిలగిల్లాడుతోంది. చాలా సుకుమారంగా ఉంది. పాపం! అరచేతిలో ఇన్ని గాజుపెంకులెలా గుచ్చుకున్నాయో? పెద్దవీ చిన్నవీ బోలెడు. ఒకటొకటి తీస్తుంటే బాధగా మెలికలు తిరిగిపోతోంది. కన్నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. ఎందుకో తనకి బాధగా అనిపిస్తోంది. కానీ మరెలా? వీలైనంత నెమ్మదిగా జాగ్రత్తగా అన్నీ తీసి చికిత్స చేసి బ్యాండేజ్ కట్టాడు. 'హమ్మయ్య' అంది. కొంత బాధ తగ్గడంతో. మరొక చేత్తో రుమాలుతో ముఖం తుడుచుకుంటూ. 'అసలన్ని గాజు పెంకులెలా గుచ్చుకున్నాయి? ఏదైనా పగిలిన సీసా మీద పడ్డారా?' అడిగాడు డాక్టర్ రవీంద్ర. ఊహించినట్లుగా ఒకసారి అతని ముఖంలోకి సూటిగా చూసి బరువుగా రెప్పలు వాల్చుకుంది. బాగా నీరసంగా ఉన్నట్లు కనిపించింది. పైగా బ్లెడ్ కూడా చాలా పోయింది. అక్కడే తనకి అన్నీ అందిస్తున్న ఆయాని పిలిచాడు. 'ఇదిగో! ఆయా ..' హార్లిక్స్ కలిపి రెండు గ్లాసుల్లో తెచ్చిపెట్టు' అని పురమాయించాడు. 'సరే బాబు!' అంటూ సత్తెమ్మ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. 'మీరు చాల నీరసంగా ఉన్నారు! ఫర్వాలేదు అలా బెడ్ మీద కాస్సేపు విశ్రాంతి తీసుకోండి' అన్నాడు. ఆమెనుద్దేశించి. 'థాంక్స్ వద్దు లెండి' అంది అతని మంచితనాన్ని అంచనా వేసుకుంటూ. 'తీసుకోండి!' అంటూ ఒక గ్లాసుని తన చేతిలో ఉంచుకుని మరో గ్లాసుని ఆమెకి అందించాడు. 'వద్దండీ' సిగ్గుపడుతూనే అందుకుంది. 'ఆమె వయస్సు పాతిక లోపె ఉండవచ్చు. సాదా చీరలో సౌందర్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మెడలో సన్నని గొలుసు, చెవులకి రింగులు, ట్యూబ్ లైట్ కాంతి పడి అద్దాల్లా మెరుస్తున్న నున్నని చెక్కిళ్ళు. వాటి పైన ఇంకా తడి ఆరని కన్నీళ్ళు. చెమ్మగిలిన కాటుక కళ్ళు. దుఃఖాన్ని దిగమింగటానికి బిగపట్టిన లేత గులాబి పెదవులు అందంగా, తెల్లగా, నాజూగ్గా. సామాన్యంగా ఒయినము ఒందనము ఉట్టిపడుతూ అతి సామాన్యంగా ఉంది. బాగా చదువుకున్న దానిలా ఉంది' మనసులోనే వర్ణించుకున్నాడు డాక్టర్ రవీంద్ర. ఆ సమయంలో 'పేషెంట్లెవరూ లేకపోవడంతో ఆమెని పరిశీలించే తీరిక చిక్కింది. లేకపోతే అసలు ఊపిరి సలపదు' అనుకుని మరోసారి ఆమె వైపు చూశాడు. తన వైపే చూస్తూ ఉండటం వల్ల ఆమె కొంచెం ఇబ్బందిగా కదిలింది. ఇద్దరి మధ్య ఎంతో.... నిశ్శబ్దం. 'ఇక నేను వెడతానండి. చాల థాంక్స్! రేపు కూడా రావాలంటారా?' నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ లేచి నిలబడింది. 'భలే వారే! ఈ ఒక్కరోజు కట్టూ సరిపోతుందనుకున్నారా? కనీసం పది రోజులైన పడుతుంది. సెప్టిక్ అయితే చాలా ప్రమాదం. రోజు విడిచి రోజు ఇంజక్షనివ్వాలి. కట్టు మార్చాలి. తక్కువ గుచ్చుకున్నాయా?' అన్నాడు చనువుగా. 'మరి.... మీ... ఫీజు...?' నసిగింది. 'ముందు మీకు బాగా తగ్గనీయండి. అప్పుడు... ఫీజు... సంగతి'. మరొకసారి ఆమె చేతిని సవరిస్తూ అన్నాడు. ఆ స్పర్శకి తమలో సంచలనం కలిగినట్లు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు అప్రయత్నంగానే చూసుకుని పట్టుబడిపోయారు. 'ఆ... ఇంతకీ... మీ... పేరు...?' అడిగాడు అటు తిరిగి పెన్ అందుకుంటూ. 'బాంధవి' 'బాగుంది' పైకే అనేశాడు. 'ఏమిటి? నా పేరా? ఈ కట్టా?' చమత్క రించింది. 'కట్టు... కాదు. మీ... పేరు...+.. మీరు కూడాను'. అతని చొరవకి ఆనందం, ఆశ్చర్యం కూడా కలిగాయి. నీరసంగా నవ్వింది. అయితే రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తే మీరుంటారు కదా? అంటూ వెనుదిరిగింది. ఓ... తప్పకుండా! [మీ కోసమే ఎదురు చూస్తూ] మనసులోనే అనుకున్నాడు... వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ. ఎందరో పేషెంట్లు వచ్చి వెడుతూ ఉంటారు. ఒకోసారి చాలా విసుగ్గా ఉంటుంది. కోరి కోరి డాక్టరునయ్యానేమిటా అని? పైగా తనెంతో మంది సీతాకోకచిలకల మధ్య తిరిగి చదివాడు. కానీ ఇదేమిటీరోజు? అసలెవరీమె? ఆ ముగ్ధత్వం అలాంటి ఆకర్షణ తనకెవ్వరిలోనూ ఇంతవరకూ కనుపించలేదు. తనలో ఎందుకింత సంచలనం? చిత్రంగా ఉంది. ఇంతకీ పెళ్ళైందో లేదో? ఈ రోజుల్లో గుర్తించటం కొంచెం కష్టమే. అంతా నాగరికత కదా? అనుకుంటూ వచ్చిన పేషెంట్ల వైపు తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. 'ఎంత మంచివాడు? ఈ దెబ్బలన్నీ తనకే తగిలినట్టుగా బాధపడ్డాడు. అతను మందు వేసి కట్టు కడుతుంటే ఏదో తెలియని ఆత్మీయత.... ఎంతో దగ్గర అనుబంధం కలిగాయి. చూడబోతే ఇప్పుడిప్పుడే విద్యార్ధి దశ నుంచి ఇందులో అడుగిడిన కుర్రవాడిలా ఉన్నాడు. ఇది అతని స్వభావమా? లేక డాక్టరు కావడం వల్ల వృత్తి ధర్మమా? అనుకుంది. అటువంటి ప్రేమానురాగాలను మర్చిపోయిన బాంధవి. ఇంటికెళ్ళాలంటే భయం. అంత పెద్ద ఇంట్లో తాను ఒంటరిది. ఒక యంత్రం. తల్లిదండ్రులకి ఒక్క పిల్లగా ఇద్దరన్నయ్యల మధ్య ఎంతో గారంగా పెరిగిందే కానీ పెళ్ళైన ఈ ఏడాది నుంచి అందర్నీ మర్చిపోయి ఒక యంత్రంలా జీవచ్ఛవంలా తయారైంది. తన చదువు, అందం, డబ్బు అన్నీ వ్యర్ధం. అనుక్షణం గుప్పెట్లో ప్రాణాలుంచుకుని బ్రతకటం నేర్చుకుంది. ఏదో ఒకనాడు ఇంతకన్నా బలమైన దెబ్బలు తగిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తనకు అందరూ ఉండీ... చేతకాని వారిలా తన ఖర్మానికి తనని ఇలా వదిలేశారు. ఇంకా ఏవో సాంప్రదాయాలంటూ పతివ్రతల కథలే చెబుతున్నారు. ఎన్ని మార్పులు వచ్చినా పెద్దల మనసులు మారటం కష్టం. కొందరు తమ మూఢత్వాన్ని వీడరు... అనుకుంటూ దారి పొడవునా ఆలోచిస్తూనే ఉంది బాంధవి... మర్నాడు ఆమె రాక కోసం తనకి తెలియకుండానే ఎదురుచూడటం మొదలుపెట్టాడు డాక్టర్ రవీంద్ర. ఎవరొచ్చినా ఆమె అనుకుని ఉలిక్కి పడుతున్నాడు. వచ్చిన వాళ్ళందర్నీ తొందరగా పంపేస్తున్నాడు నిన్నటిలా ఆమె ఉన్న కాసేపు ఎవరూ రాకుండా ఉంటే బాగుండునని. అతని మనసు గ్రహించిందా! అన్నట్టు ఆమె రానే వచ్చింది. అతను ఒంటరిగానే ఉన్నాడు. గుండెల నిండా సంతోషం. 'ఎలా ఉందీ రోజు?' పలకరింపుగా అడిగాడు. 'ఫర్వాలేదు' అంటూ కుర్చీ జరుపుకుంది. కట్టు విప్పి నిన్నటిలాగే చికిత్స చేసి మళ్ళీ కట్టుకట్టాడు. ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. చిత్రాతిచిత్రమైన స్పందన. మళ్ళీ హార్లిక్స్ తెప్పించాడు. 'రోజూ ఎందుకండీ?' సిగ్గు పడింది. 'ఫర్వాలేదు... ఇది కూడా మందేలెండి' జోక్ చేశాడు. మౌనంగా ఊరుకుంది. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. మాటలు కరువు. ఆమె కళ్ళలో ఎంతో ఆరాధన... ఎన్నో భావాలు. మరేదో దైన్యం. అతను గుర్తించాడు. అతనొక మంచి యువకుడిగా, డాక్టరుగా ఆమె మనసులో నిలిచాడు. ఆమె ఒయినము ఒందనము ముగ్ధ మనోహరత్వం ఆకట్టుకునే సహజసిద్ధమైన అందం అతనికి నచ్చాయి. ఎవరి ఆలోచనలు వారివి. భయంకరమైన నిశ్శబ్దం. అంతే ఎవరైనా వచ్చేవరకూ మౌనంగా కూర్చుని తర్వాత వెళ్ళిపోతుంది. ఇలా ఆమె వరుసగా వారం రోజులు వచ్చింది. ఆ రోజు ఆమె అడిగింది. 'ఎనిమిది రోజులైంది కదా ఇక చాలా అని'. ఒకవేళ అతడు చాలు అంటే ఏదో బాధ. 'భలే వారే! మరో ఎనిమిది రోజులైనా ఈ గాయాలు తగ్గవ్. అశ్రద్ధ చేయకుండా రావాలి. సెప్టిక్ అయితే చాలా ప్రమాదం' అన్నాడు. ఆమె రాదనుకుంటే గుండె లోతుల్లో ఏదో బాధ. రోజూ చూడటం వల్ల మరింత పెరిగిన మమత. 'అదేమిటి? పది రోజులు చాలన్నారుగా?' 'అవును... అది అప్పటి మాట... చూడండీ ఇంకా ఎంత పచ్చిగా ఉందో మీ అరచేయి?' అంటూ సున్నితంగా చేయి తడిమి చూపించాడు. అతను అలా నెమ్మదిగా చేయి రాస్తుంటే ఎంతో హాయి... మరేదో అనుబంధం. నరనరాల్లోనూ ప్రవహించినట్లైంది. అతను డబ్బు కోసమే అలా అన్నట్టుగా అనిపించలేదు... సరే అయితే... అనగలిగింది. మర్నాడు కాదుకదా... మరో... వారం... పది... పదిహేను...నెల.. రోజులైన ఆమె రాలేదు. అతనిలో ఆత్రం ఎక్కువైంది. ఏమైంది? ఎందుకు రాలేదు? బహుశా తగ్గిపోయిందేమొ! మరి బిల్లు కోసమైనా రావాలి కదా? ఒకవేళ ఇచ్చే స్థితిలో లేదేమొ? తల్లిదండ్రులు కోప్పడ్డారేమొ? ఒకవేళ పెళ్ళై ఉంటే భర్త వద్దన్నాడేమొ? ఎన్నో ఆలోచనలు. మనసు నిండా వ్యధ. గుండెలు పిండే బాధ. కనీసం అడ్రసైనా అడగనందుకు తనని తానే తిట్టుకున్నాడు. ప్రతిరోజూ ఆమె కోసం ఎదురు చూడటం నిరాశ పడటం అతనికి దినచర్యగా మారిపోయింది. కనీసం బయట షాపుల్లో మరెక్కడైనా కనబడుతుందేమో అన్న ఆశతో అతని కళ్ళు అంతటా అణువణువూ వెతుకుతూనే ఉన్నాయి. అసలామె ఎవరని? తనకెందుకింత బాధ? ఆఫ్ట్రాల్ ఒక పేషెంటు... అని సమర్ధించుకున్నాడు. అలా కొన్నాళ్ళకి మర్చిపోయేవాడేమో. కానీ ఒక రోజు ఉన్నట్టుండి మామూలు టైము కంటే ముందుగా తన గేటు ముందు ఆటో ఆగింది. అందులోంచి ఇద్దరు యువతులు ఆమెని ఎడా పెడా పట్టుకుని తీసుకొచ్చారు. ఈ హటాత్సంఘటనకి విస్తుపోయాడు. మానుతుందనుకున్న గాయం మళ్ళీ రేగింది. ఒక్క క్షణం బిత్తర పోయాడు. 'ఏమైంది? ఒంటి నిండా ఇన్ని దెబ్బలు? ఒళ్ళంతా రక్తం? ఆమె దాదాపు స్పృహ కోల్పోయినట్టే ఉంది. కంగారుగా సమీపించాడు. ఏమైంది బాంధవీ ఏమైంది? ఎందుకిలా అయిపోయావ్? ఈ దెబ్బలేమిటి? లోలోన దాగి ఉన్న భావన పొంగి ఆత్రంగా ఆమెని సమీపించి వారి సాయంతో బెడ్ మీదకి చేర్చాడు. 'డాక్టర్... మీరు... మీరెంత... మంచి... వారు..? నీరసంగా అస్పష్టంగా గొణిగింది- బెడ్ మీద వాలుతున్న బాంధవి. 'ఇన్ని... ఇన్ని... దెబ్బలెలా... తగిలాయి?' అంతర్గతంగా ఉన్న అభిమానాన్ని దాచుకోలేకపోతున్నాడు. హు... విరక్తిగా నవ్వి... అతని చేతిని మృదువుగా నొక్కింది. జాకెట్లో దాచి ఉంచిన మాంగల్యాన్ని తీసి నిర్లక్ష్యంగా చూసిందతని కళ్ళల్లోకి. ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి రవీంద్రకి. 'మై... గాడ్...' అతగాడి గుండెల్లో ఎన్నో గాజుపెంకులు కసుక్కున గుచ్చుకున్నాయి. ఆ మూగ కళ్ళల్లోంచి అంతా అర్థమైపోయింది. భరించలేకపోయాడు. బాంధవీ! అంటూ ఆవేశంగా ఆమె నుదుటి మీద అప్రయత్నంగా చుంబించాడు. ఆమె కళ్ళల్లో కోటి దివ్వెల కాంతి. 'ప్చ్! ఏమిటో పది రోజులకోమాటు వస్తాడు. ఉన్న ఆ ఒక్క రోజు తాగి తందనాలాడి చావగొట్టి పోతాడు. అలాంటి మొగుడితో ఉండటం కంటే హాయిగా విడిపోవడం మంచిది. చదువుకుని కూడా ఎందుకొచ్చిన ఖర్మ?' బయటివారి మాటలు దూరంగా వినబడుతున్నాయి.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.