Articles - Donga Avaru




Name: Admin

Published Date: 17-11-2015


దొంగ ఎవరు?

అక్బర్ బాద్ షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి, నగలు, రొక్కం తీసుకుని పారిపోయాడు.

 

కొన్ని రోజులయ్యాక, ఒక సారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. యెక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి, వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు.

 

“దుర్మార్గుడా! దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? నా నగలు, రొక్కం తిరిగి ఇవ్వు!” అని అరవడం మొదలుపెట్టాడు.

 

ధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “నేను దొంగతనం చేయడం యేమిటి, వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజ భటులకు పట్టిస్తాను!” అని గొడవపడ సాగాడు.

 

బజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకు వెళ్ళారు.

 

బీర్బల్ యెదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.

 

బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి, “ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను” అన్నాడు.

 

ఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక, బీర్బల్, “ఇప్పుడు పనివాడి తల నరికేయి!” అని ఆదేశించాడు.

 

ఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగారుగా తన తల లోపలకు లాగేసాడు. ఇలా బయటపడిపోయాడు.

 

ఇలా బీర్బల్ మళ్ళీ అతని చాకుచక్యం ప్రదర్శించుకున్నాడు.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.