Articles - Dishti




Name: Admin

Published Date: 06-04-2016


దిష్టి

విమలమ్మ గారికి వయస్సుపై బడింది. కళ్లు పత్తిగింజల్లా తయారయ్యాయి. వాటిలో కాటరాక్టు ముదిరి కళ్లు అస్సలు కనిపించట ల్లేదు. అందుకోసం ఆమె కళ్లు చించుకుని చూస్తుంది ఏ కొద్దిగానైనా కనిపించక పోతుందా అని. ఏదో లీలగా మనుష్యుల ఆకారాలూ చిన్ని వెలుతురూ కనిపించినట్టే అనిపిస్తుంది. ఆ కళ్లుకు ఎదుట ఏదో వస్తువుందని ఊహించుకుని పక్కకు తప్పుకునేందుకు పని చేస్తున్నాయి. కూతురు శారద తన కూతురు భవానీకి గదిలో అన్నం పెడుతున్నట్టుంది. భవానీ అంటే తనకీ ఇష్టమే! ఎంతైనా మనుమరాలు కదా? అయితే ఆ గదిలోకి విమలమ్మ అడుగు పెట్టిందో లేదో శారద గట్టిగా అరిచింది- `వెధవ కళ్లంటూ వెధవ కళ్లు. ఎప్పుడూ తిండి తినని ముఖంలా ఒకటే ఆకలి కళ్లు. దిష్టి కళ్లంటూ దిష్టి కళ్లు! థేబిరించుకుని ఎలా చూస్తోందో? నరుల కంటికి నల్ల రాయి బద్దలౌతుందే భవానీ! ఉండమ్మా నీకు దిష్టి తీసేస్తాను. కాటికి కాళ్లు చాపుకున్నా ఇంకా కూటి మీద ధ్యాసా రంధీ ఈ ముసిల్దానికి పోలేదు. ఎవరినీ ఎదురుకుండా కూచుని అన్నం తిననివ్వదు', అంటూ పెడుతున్న అన్నం కాస్తా దిష్టి తీసేసి బయట పారేసింది శారద. విమలమ్మ గారి మనసు చివుక్కు మంది. కళ్లంటే కనిపించవు కానీ వెధవ మనస్సనేదొకటుండి చచ్చింది కదా! కూతురన్న మాట ఆ మనసుని ముల్లులా పొడిచింది. కనిపించని కళ్లైనా నీటి చలమలై వర్షిస్తాయి. విమలమ్మ గారి కళ్లు జల జల కన్నీళ్లు కార్చాయి. 'ఎందుకే నోరు పారేసుకుంటావు? నా కళ్లు కనిపించి చావవే! ఇక అవేమి నీ కూతురు తిండిని దిష్టి పెట్ట గలవు?' అని వల వలా ఏడ్చింది విమలమ్మ!

`ఏమో నాకేం తెలుసు దిష్టి అనేది ఉందో లేదో నీకే తెలియాలి' అంటూ తన పిల్లని తీసుకుని మరో గదిలోకి వెళ్లింది శారద. విమలమ్మ గార్కి తన గతం గుర్తొచ్చింది. అప్పుడు తను మంచి వయస్సులో ఉంది. ఎవరికీ పిల్లలు పుట్టనట్టు తనకే పిల్లలు పుట్టినట్టు ఎంతో అపురూపంగా శారదను పెంచింది. నిముష నిముషానికీ తన కూతురికి దిగదుడుపులు తీసేది. ప్రతి అమావాస్యకీ గుమ్మడి కాయా, రోజు విడిచి రోజు నిమ్మ కాయా దిగదుడుపు తీసేది. ఆ రోజుల్లో కూతురు శారద తన చక్రాల్లాటి కళ్లు తెరిచి ఇదంతా ఆశ్చర్యంగా చూసేది. ఇక శారదకు అన్నం పెట్టేటప్పుడు గదిలోకి పొరబాటున అత్తగారు వచ్చిందంటే ఆవిడ పని అయిపోయేదే! కుక్క మీదా పిల్లి మీదా పెట్టి ఎక్కడ లేని తిట్లూ అత్తని తిట్టేది. పాపం అప్పుడు విమలమ్మ అత్త గారి కళ్లు ఉత్త గాజు గోళాలే! ఆ గోళాల్లోకి వెలుతురు ప్రసరించేది కాదు. ఆవిడకు రక్త పోటు ఎక్కువై, ఆప్టిక్ నెర్వ్ దెబ్బ తిని చూపు పోయింది. అయినా ఆవిడ అందరికీ మిడిగుడ్లేసుకు చూస్తున్నట్టే కనిపించేది. అందువల్ల ఆ రోజుల్లో విమలమ్మ తన కూతురు శారదకు తిండి పెట్టేటప్పుడు పొరబాటున ఎవరైనా చూశారంటే దిష్టి తీసి ఆ కంచంలోనిదంతా కుక్కకో పిల్లికో పారేసేది. ఎదురుగా ఎవరైనా ముష్టి వాళ్లొస్తే వాళ్లు తెగ బాధ పడే వారు. `అదేంటమ్మా అల్లా కూడుని దిష్టి తీసి కుక్కలకో-పిల్లికో పారబోస్తారు. ఆ కబళ మేదో మా బొచ్చెలో పారేసినా మేము ఒక పూట ఆ తిండి తిని బతకమా' అనే వాళ్లు. విమలమ్మ వాళ్ల మీద కూడా విరుచుకు పడేది. `దరిద్ర గొట్టు కళ్లు. ఎప్పుడూ మీకు ఆకలే! ఎంత తిన్నా మీ ఆకలి చావదు. అందుకే మా పిల్ల అన్నం తింటూ వుంటే మీరు యావగా చూస్తారు. ఇంకా అన్నం తింటే నా పిల్లకి అరుగుతుందా పాడా? మీ కళ్లు పడ్డ ఆ అన్నం మీరు తిన్నా మీకూ చేటే! అందుకే జంతువులకి పడేస్తాను' అనేది. గతమంతా తలుచుకుని విమలమ్మ గారు `తనకీ శాస్తి జరగ వలసిందే! ఎవరు చేసుకున్న పాపం వారిని వెంటాడుతుంది. అతి ప్రేమ ఈ నా కూతురు శారద మీద చూపి ఇప్పుడు కాటికి కాళ్లు జాపుకున్న ఈ వయసులో ఇలాటి మాటలు పడుతున్నాను', అంటూ బిగ్గరగా ఏడ్వ సాగింది. అప్పుడు శారద వచ్చి తన అమ్మ విమలమ్మను ఓదార్చింది- `అమ్మా! నిజానికి ఏ కళ్లూ దిష్టి కళ్లు కావు. చూపులతో ఎవరూ దిష్టి కొట్టి తినే తిండిని పాడు చేయ లేరు. ఈ విషయం నీ కెన్నో సార్లు చెప్పి చూసి విసిగి పోయాను. ఇప్పటికైనా అలా మనం మాటాడితే ఎదట వారి మనసు ఎంత నొచ్చుకుంటుందో తెలిపేటందుకే అలా మాటాడాను. నాకు తెలుసమ్మా నీ కళ్లు కనిపించవనీ అందులో పువ్వులేశాయనీ. ఇలా ... నాకూతురు ముందు దిగదుడుపులు నూనె గరిటెలతోనూ వాటితోనూ పెడుతుంటే రేపు ఇదే ఛాదస్తం దాన్ని వెంటాడి మరో విమలమ్మలా తయారౌతుంది. అందుకే నీకు కనువిప్పు కోసం అలా అన్నానమ్మా! ఏమనుకోకు',అని సముదాయించింది. విమలమ్మ మనస్సు తాను చేసిన తప్పు తన కూతురు శారద చెయ్యబోవటం లేదని తెలిసి ఆనందించింది!



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.