Articles - Bhramachari Bagotham
Name: Admin

Published Date: 06-04-2016


బ్రహ్మచారి బాగోతం

మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ గా బిరుదు పొందిన శోభనరావుకు ముప్పై ఏళ్ళు దాటినా పెళ్ళి అవలేదు. అందుకు కారణం పెళ్ళంటూ చేసుకుంటే కోకిల స్వరం వుండి లతా మంగేష్కర్, సుశీల, జానకి ల వలే శ్రావ్యం గా పాటలు పాడగల అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని పంతం పట్టాడు. బి.కాం చదివి ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ గా ఇరవై అయిదేళ్ళకే ఉద్యోగం సంపాదించుకున్న శోభనరావుది ఒక మోస్తరు అందం. చామన చాయ, అయిదడుగులు మించని ఎత్తు, పీల కంఠ స్వరం, ఎకర్సైజులు ఎరుగని కారణం గా పొడుచుకు వచ్చిన బొజ్జ , ఎత్తయిన క్రాఫ్ తో ఎనభై దశకం లో యావత్ ఆంధ్ర మహిళామణులను ఉర్రూతలూగించిన శోభన్ బాబు లా వుంటానని భ్రమపడే శోభనరావుకు తాను కామెడీ ఆర్టిస్టు పెర్సనాలిటీ తో వుంటానన్న సంగతి తెలియకపోవడం వలన నిత్యం ఊహల ప్రపంచం లో విహరించేవాడు. శ్రీదేవి, జయప్రద, సౌందర్య లాంటి పెర్సనాలిటీ వున్న అమ్మాయికి అద్భుతం గా పాడగల కెపాసిటీ ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కావాలని భీష్మించుకు కూర్చున్నాడు. చూడడానికి జోకర్ లా వున్నా, చేస్తున్న ఉద్యోగం, వెనుక వున్న ఆస్తి పాస్థులను చూసి చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు పిల్లనిస్తామని ముందుకు వచ్చారు . టుబి వెరీ ఫ్రాంక్ వారిలో కొన్ని మంచి సంబంధాలు కూడా వచ్చాయి గాని పాడగల అడిషనల్ క్వాలిఫికేషను లేకపోవడం వలన అన్నింటినీ తిరగగొట్టేసాడు మన శోభనరావు. వచ్చిన ప్రతీ సంబంధాన్ని ఆ సాకుతో తిరగగొట్టేస్తుండడంతో శోభనరావు తల్లిదండ్రులు కూడా విసిగిపోయారు. రాన్రాను మంచి సంబంధాలు కూడా రావడం తగ్గిపోయాయి. పెళ్ళిళ్ల పేరయ్యలందరూ ఆ ఇంటి చాయలవైపు రావడం మానేసారు. కొడుకు పెళ్ళిచేసుకొని ఏడాది తిరగక ముందే తమ ఒళ్ళో మనవడిని పెడితే ఎత్తుకుంటూ ఆనందిద్దామన్న శోభనరావు తల్లిదండ్రుల ఆశలు అడియాసలే అయ్యాయి. =బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదా! శోభనరావు చూస్తుండగానే ముప్పై అయిదు ఏళ్లు దాటేసాడు. ముఖం లో ఇంతకు ముందు వున్న కళ కుడా తగ్గిపోయింది. మధ్యలో జుత్తు వూడిపోయి, వున్న కాస్త జుత్తు పండిపోయి, బొజ్జ బాగా పెద్దదైపోయి జోకర్ లా తయారయ్యాడు. ఆఫీసులో అందరూ అతనిని పెళ్ళి కాని ప్రసాద్ అని ముద్దుగా పిలవడం మొదలెట్టారు. పదహారు, పద్ధెనిమిదేళ్ళ ఆడపిల్లలు మన హీరోని అంకుల్ అని సంబోధిస్తే, స్నేహితులు యవ్వనాన్ని వృధా చేసుకున్న వేస్ట్ ఫెలో అని, చుట్టరికాలలో ఏదో లోపం వుండడం వలన అది డాక్టర్ సమరం వంటి ఉద్దండ పండితుల వలన కూడా నయం కాని కారణం గా పెళ్ళికి పనికి రాక, ఇలా పాటలు పాడే అమ్మాయి కావాలన్న సాకుతో సంబంధాలను తిరగొట్టేస్తున్నాడన్న సంశయం తో చెవులు కొరుక్కోవడమే కాక, పెళ్ళిళ్ళు, పేరంటాలకు శోభనరావు గానీ వారి తల్లిదండ్రుల గానీ వచ్చినప్పుడు ఎక్కడ తమ అమ్మాయిలను చూస్తారోనని దాచెయ్యడం వంటివి బహిరంగం గా చేయసాగారు. జరుగుతున్న తంతుకు శోభనరావు తల్లిదండ్రులకు ఎవ్వరికీ ముఖం చూపించలేని పరిస్థితి రాగా మన శోభనరావు మాత్రం ఏనాటికైనా పాటలు బాగా పాడగల అమ్మాయే తనకు భార్యగా వస్తుందని, వెన్నెల రాత్రులలో డాబాపై మంచం మీద భార్య ఒడిలో పడుకొని ఆమె చల్లని రేయి గురించి పాటలు పాడుతుండగా ఆనందిస్తూ నిద్రలోకి జారుకోవాలని కలలు కంటూనే వున్నాడు. ఆ రోజు ఎంతో శుభదినం. మన శోభనరావుకు వందవ పెళ్ళిచూపులు. టి వి లో మన క్రికెటర్లు సెంచురీ చేస్తే ఎంతో ఆనందించే శోభనరావు తల్లిదండ్రులకు మాత్రం తమ సుపుత్రుడు పెళ్ళిచూపులలో సెంచురీ చేయడం ఏ మాత్రం రుచించ లేదు. కానీ ఏం చేస్తారు? ఆత్మ హత్య చేసుకుంటామని బెదిరించినా ఏ మాత్రం చలించని మొండి ఘటం తమ సుపుత్రుడు. ఎనభై ఏళ్ళకైనా పాటలు పాడే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన మగ ధీరుడు. ఈ సంబంధం కోసం పెళ్ళిళ్ళ పేరయ్య బ్రహ్మానందాన్ని ఎంత బతిమిలాడారో వాళ్ళకే ఎరుక. చివరకు కాళ్ళు పట్టుకొని సంభావన భారీగా ఇస్తామని కమిట్ అయితేనే ఈ పెళ్ళిచూపులను ఏర్పాటు చేసాడు పేరయ్య బ్రహ్మానందం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ఈ అమ్మాయికి కూడా పాటలు పాడడం రాదు. కానీ ఒక మోస్తరు అందంగా వున్నా మంచి కళ గా వున్న ముఖం. మంచి సుగుణాలు వున్నాయి , చక్కని ఫామిలీ బాక్ గ్రౌండ్ వుంది. అల్లు రామలింగయ్య పెర్సనాలిటీ లో కొచ్చి ఇప్పటి వరకూ ఒక్క శోభనానికైనా నోచుకోని మన శోభనరావుకు ఇంతకంటే మంచి సంబంధం ఇక ఈ జన్మలో రాదు. అందుకే ఈ సంబంధం ఎలాగైనా ఒకే చెయ్యాలన్న కృత నిశ్చయం తో వున్నారు వారు. బ్రహ్మానందం తమ్ముడైన ఐరెన్ లెగ్ శాస్త్రి శోభనరావు కధ అంతా విని ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఇక ఈ ఐడియా మన శోభనరావు జీవితాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం.

వందో పెళ్ళి చూపులకు ఎంతో ట్రిం గా తయారయ్యి శోభనరావు నా హృదయం లో నిదురించే చెలీ అంటూ ఆరాధన సినిమా లోని పాటను హం చేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. వంట్లో బాగోలేదని అతని తల్లిదండ్రులు కావాలనే రావడం మానేసారు. కాఫీ, టిఫెన్లు పూర్తయ్యాక పిల్లను తీసుకురండి అని హుకుం జారీ చేసాడు. మన వాడిలో వెరైటీ ఏమిటంటే మొదటి పెళ్ళి చూపులో ఎంత హుషారుగా వున్నాడో, వందో పెళ్ళి చూపులో కూడా అదే హుషారు. డిప్రెషెన్ లోకి ఎలా వెళ్ళకూడదో మన శోభనరావును చూసే తెలుసుకోవాలి. అమ్మాయిని ఒక పాట పాడమనండి అని పాత డైలాగే రిపీట్ చేసాడు శోభనరావు. `అబ్బాయిగారూ. మా అమ్మాయికి పాటలు పాడడం చాలా బాగా వచ్చు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం భాషలే కాక హిందీ, పంజాబీ, భోజ్ పురి, అరబ్బీ , పార్శీ లలో కూడా అద్భుతం గా పాడుతుంది. అయితే శాస్త్రీయ కుటుంబం లో పెరిగింది కావున ఎక్కడా స్టేజి ఎక్కి పాడలేదు. పైగా మా అమ్మాయికి సిగ్గు పాళ్ళు బాగా ఎక్కువ. కనుక మీరేమీ అనుకోనంటే కర్టెన్ వెనక్కి వెళ్ళి పాడుతుంది' అని అభ్యర్ధించాడు పెళ్ళికూతురు తండ్రి ఎ వి ఎస్. 'దానికే భాగ్యం, అమ్మాయి సుశీలలా పాడాలి గాని తెర వెనుక పాడితే ప్రాబ్లం ఏమిటి. ఒక మంచి ఓల్డ్ మెలోడీ అందుకోమనండి' అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు శోభనరావు. పెళ్ళికూతురు కర్టెన్ వెనుకకి వెళ్ళిపోయింది. కొద్ది సెకన్లలోనే రాధకు నీవేరా ప్రాణం అంటూ పాట మొదలయ్యింది. కంఠం సింప్లీ సూపెర్బ్. శృతి తప్పడం లేదు. ఇళయరాజా మార్కు కంపోజింగ్ లా అనిపించింది. కళ్ళు మూసుకొని పాటని ఆస్వాదించసాగాడు శోభనరావు. కలలో సీను ఊటీకి షిఫ్ట్ అయ్యింది. కృష్ణుడిగా తాను వేణువు వాయిస్తుంటే రాధలా ఆ అమ్మాయి తనపై పువ్వుల జల్లు కురిపిస్తూ డాన్స్ చేస్తోంది. వెనుక ఒక ఇరవై మంది డాన్సర్లు లయ బద్ధం గా డాన్స్ చేస్తున్నారు. మధ్య మధ్యలో యాపిల్, బొత్తాయి వంటి పళ్ళు వచ్చి ఆమె నాభి ప్రదేశాన్ని తాకుతున్నాయి. చుట్టూ వున్న స్టీలు బిందెలను హీరోయిన్ సుతి మెత్తగా తంతోంది. రాఘవేంద్ర రావు మార్కు సీను మెదులుతుండగా పాట పూర్తయ్యింది. `వారెవ్వా!, సూపర్బ్, ఎక్స్ లెంట్, బఢియా, షుకూర్, క్యా గానా హై' అంటూ పెద్దగా చప్పట్లు కొట్టి తన అభినందనలు తెలియజేసాడు శోభనరావు. ఆ మరుక్షణమే `ఇంటికి వెళ్ళాక మా నిర్ణయాన్ని తెలియజేస్తాం' అన్న రొటీన్ డైలాగులు చెప్పకుండా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సమ్మతి కూడా ఇచ్చేసాడు. అందరి హృదయాలూ ఆనందంతో పొంగిపోయాయి. ఆ అమ్మాయి సిగ్గుతో తుర్రున లోపలికి పారిపోయింది. బ్రహ్మానందం తనకొచ్చే సంభావనను ఎలా ఖర్చు పెట్టాలో అప్పటికప్పుడే ఆలోచించేసుకున్నాడు. శోభనరావైతే నేల మీద నిలబడడం మానేసాడు.శ్రావణ మాసం లో శోభనరావు, శ్రీదేవిల కళ్యాణం అంగ రంగ వైభవం గా జరిగిపోయింది. ఆ రోజే మొదటి రాత్రి. శోభనరావు జీవితం లో ఒక పదేళ్ళు ఆలస్యం గా వచ్చింది. రెండు రోజుల నుండి మొదటి రాత్రి నాడు తన భార్య చేత పాడించాల్సిన పాటలను ఒక లిస్టు గా రాసుకున్నాడు. మొత్తం ముప్పై పాటలు వచ్చాయి. గదిలోనికి వెళ్ళిన వెంటనే మొదలెడితే పొద్దున అయిదు గంటల కల్లా పూర్తి అవవచ్చునని ప్లాన్ చేసుకున్నాడు. గదిలోనికి లీటరు పాల సీసాతో అడుగు పెట్టిన శ్రీదేవిని మంచం పై పక్కన కూర్చోబెట్టుకొని పాటల లిస్టు అందించి ఇక మొదలెట్టు అని ఆశగా అన్నాడు. పది నిమిషాలైనా పాట మొదలు పెట్టలేదు శ్రీదేవి. మొదట్లో సిగ్గుగా వుందేమోనని కాస్త మంచి మాటలు చెప్పాడు. అరగంటైనా శ్రీదేవి నోరు మెదపకపోయేసరికి విసుగొచ్చి `త్వరగా పాటలు పాడు, టైమ్ వేస్టవుతోంది' అని అన్నాడు. `గీత ఈ రోజు ఈ గదిలోనికి రాకూడదుటండీ' అని నెమ్మదిగా అంది శ్రీదేవి. `గీత ఎవరు?' ఆశ్చర్యం గా అడిగాడు శోభనరావు. `గీత నా ఫ్రెండు. నాకు పాటలు నేర్పిస్తోంది' `నీకు పాటలు నేర్పించడమా! అంటే' ఏమీ అర్ధం కాక మధ్యలోనే ఆగిపోయాడు శోభనరావు.అప్పుడు అసలు సంగతి చెప్పింది శ్రీదేవి. ఈ సంబంధం వచ్చినప్పుడు శోభనరావుకు వున్న వెర్రి గురించి ఎవిఎస్ తో వివరంగా చెప్పాడు బ్రహ్మానందం. అందరూ కలిసి ఐరెన్ లెగ్ శాస్త్రిని సంప్రదించి ఒక ప్లాను వేసారు. పెళ్ళి చూపుల రోజున సిగ్గు మిషతో కెర్టెన్ వెనక్కి పంపించి శ్రీదేవి ఫ్రెండు, పాటలను బాగా పాడగల గీత తో ఆ పాట పాడించారు. ఆ రోజు నుండే గీత దగ్గర పాటలను నేర్చుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది శ్రీదేవి. ఒక మూడు నాలుగు సంవత్సరాలలో పాటలను నేర్చుకొని శోభనరావు కోరికను తీర్చగలనని ధృఢం గా చెప్పింది. `జరిగిన విషయాన్ని విన్న శోభనరావుకు తల గిర్రున తిరిగి మైండు బ్లాకయినట్లనిపించింది. పదిహేనేళ్ళుగా కట్టుకున్న ఆశలసౌధం ఒక్కసారిగా కూలిపోయినట్లనిపించింది. అచేతనుడై శిలలా వుండిపోగా, బంగారం లాంటి తొలిరేయిని హాయిగా ఆస్వాదించక ఆ దిక్కుమాలిన పాటల గురించి ఆలోచన ఎందుకండి' అంటూ అతనిని అల్లుకుపోయింది శ్రీదేవి. మరునిమిషం లోనే స్త్రీ స్పర్శ తగలగానే ఫాం లోకి వచ్చేసాడు శోభనరావు. జరిగే తంతుని చూడలేక చంద్రుడు సిగ్గుతో కళ్ళు మూసుకున్నాడు.Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.