Articles - Asalu Thandri




Name: Admin

Published Date: 05-04-2016


అసలు తండ్రి

         మన్మధరావు, ప్రియంవద తమ పదవ పెళ్ళిరోజు వేడుకలను హోటల్ డాల్ఫిన్ లో అట్టహాసంగా జరుపుకుంటున్నారు. బంధు మిత్రులు అందరూ కలిసి ఓ వందమంది దాకా వచ్చి ఫ్రీగా వచ్చిన మందు, విందులను భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో సక్సెస్ ఫుల్ గా పది సంవత్సరాలు కలిసి జీవించగలిగినందుకు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ వారి విజయ రహస్యం అడిగి తెలుసుకుంటున్నారు. నాల్గవ రౌండు డ్రింక్స్ తాగడం పూర్తయ్యాక మత్తు నెమ్మదిగా తలకు ఎక్కుతుండగా మన్మధరావు భార్యను పక్కకు పిలిచి ఆమె నాజూకైన చేతులను మెత్తగా నిమురుతూ మంద్ర స్వరంతో 'గత ఆరు నెలలుగా నిన్నొక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. కాని ధైర్యం చాలక, నువ్వు ఎక్కడ ఫీలవుతావో అన్న అనుమానంతో ఊరుకున్నాను. ఇప్పుడు అడుగుదామనుకుంటున్నాను. అడగనా? ఏమనుకోవుగా?' అన్నాడు. ఎన్నడూ లేనిది తన మన్మధం ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడేమిట్రా అని మనసులో అనుకుంటూ లేని, రాని నవ్వును హి హి హి అని కట్టుడు పళ్ళపైకి తెచ్చిపెట్టుకొని 'ఏం పర్లేదు డియర్... అడుగు' అంతే మత్తుగా అంది ప్రియంవద. అప్పటికింకా జిన్ రెండో రౌండ్ లో మాత్రమే ఆమె ఉంది. సాధారణంగా అయిదు రౌండ్లు పూర్తయితే గాని ఆమెకు మత్తెక్కదు మరి! 'మన చిన్నోడు మిగతా ఇద్దరి కంటే ప్రవర్తనలోనూ, పోలికలలోనూ భిన్నంగా ఉండడం గమనించాను. వాడు నన్ను ఒక తండ్రిలా చూడడు. నా దగ్గరకు రాడు. ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు. మన ఫ్యామిలీ ఫొటోలో వాడు చాలా డిఫరెంటుగా కనిపిస్తున్నాడు. మనకు పెళ్ళై పదేళ్ళు పూర్తయింది. ఇక మన మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. అందుకని ఈ విషయంలో నిజం చెప్పు'. ఊపిరి తీసుకోవడానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగాడు మన్మధరావు. 'వీడికి తండ్రి వేరు కదూ?' అని అడిగాడు మన్మధరావు. భర్త మాటలకు ఆమె మైండులో వెయ్యి జిలిటెన్ స్టిక్స్ ల విస్ఫోటనం జరిగినట్లు ఫీలైంది. తాను ఎంతో గుట్టుగా జరిపిన తెరచాటు భాగోతం గురించి భర్తకు పూర్తిగా తెలిసిపోయి ఉండవచ్చునుకుంది. కాని చాకచక్యంతో పరిస్థితిని ఎదుర్కోవాలనుకొన్న ప్రియంవద కొంచెం సేపు కావాలనే ఏమీ మాట్లాడలేదు. 'ఈ పదేళ్ళ మన సహచర్యంలో మనిద్దరి మధ్య బంధం చాలా బలపడింది. మనిద్దరం ఒకరిని విడువకుండా మరొకరం బ్రతికాం. నువ్వేం చెప్పినా నేను తట్టుకోగలను. పైగా నా మనసులో ఏమీ పెట్టుకోను. మన వైవాహిక జీవితం ఇంతకు ముందులానే మూడు డిన్నర్లు, ఆరు సినిమాల్లాగా సాఫీగా, అద్భుతంగా నడుస్తుంది. కనుక నిజం చెప్పు... ప్లీజ్' బ్రతిమిలాడుతున్నట్లు అడిగాడు మన్మధరావు. గత రెండేళ్ళుగా అతని మనసులో గూడుకట్టుకున్న సంశయాన్ని ఈ పూట ఎట్లాగైనా నివృత్తి చేసుకోవాలన్న పట్టుదల అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది.  పది నిమిషాలైనా ఆమె నోరు విప్పకపోయేసరికి మన్మధరావులో అసహనం కట్టలు తెంచుకోసాగింది. ఇక లాభం లేదన్నట్లు ఆమె చేతులను తన తలపై వేసుకొని పాత సినిమాలో గుమ్మడిలా దీనంగా ఫోజు పెట్టి 'నిజం చెప్పకపోతే నామీదొట్టే' అన్నాడు. ఇక ఓవర్ యాక్టింగ్ చేస్తే మంచిది కాదని, మొదటికే మోసం రావచ్చునని అర్ధం చేసుకొని ప్రియంవద నోరు విప్పింది. నేల చూపులు చూస్తూ 'మీరన్నది నిజమే. మొదటి ఇద్దరికీ, వాడికీ తండ్రులు వేర్వేరు. అందుకే వారి ప్రవర్తనలలో తేడా ఉంది' అని నెమ్మదిగా ఒక్కొక్క పదం వత్తి పలుకుతూ చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ఆశించిన విధంగానే ఉండడంతో మన్మధరావు పెద్దగా షాక్ కు గురవలేదు. బహుశా మరొకరైతే తెలుగు సినిమాలలో చూపించినట్లు ఎంత ద్రోహం చేశావు ప్రియంవదా... నేను నీకు ఏమి అన్యాయం చేశానని నాకు ఈ పరీక్ష అంటూ ఆవేశంగా పెద్ద పెద్ద డైలాగులు పలకడం, ఆమె చెంపను చెళ్ళుమనిపించడం చెయ్యలేదు. స్వతహాగా నెమ్మదస్తుడైన మన్మధరావు ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి' థ్యాంక్స్ ప్రియా... ఈ పూట నా మాట మన్నించి నిజం చెప్పినందుకు నీకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను. సరే! అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. నారు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా పంట చేతికి వచ్చాక ఏడిస్తే ఏం లాభం? గతంగత: అనుకుంటూ యధావిధిగా మన జీవితం కంటిన్యూ చేద్దాం. కానీ ఒక చిన్న రిక్వెస్టు. చంటాడికి తండ్రి ఎవరో కాస్త చెప్పు' అన్నాడు. ఆ మాటలకు మళ్ళీ ప్రియంవద పోయి నేలచూపులు చూడసాగింది. భర్తకు ఈ విషయం చెప్పాలా వద్దా అని మధన పడసాగింది. మన్మధరావు ఆమెను వదిలిపెట్టలేదు. మళ్ళీ మళ్ళీ అడగడమే కాకుండా చెప్పకపోతే ఒట్టు అంటూ మళ్ళీ చేతులు తలపై పెట్టుకున్నాడు. ప్రియంవద ఇక ఊరుకోలేక 'మన చంటాడికి తండ్రి మీరే' అని గబ గబ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మొదట ఆమె మాటలు మన మన్మధరావుకు అర్థం కాలేదు. పది నిమిషాల తరువాత అతని బుర్రలో లైటు వెలిగి అసలు విషయం అర్ధం అయ్యేసరికి బుర్రలో పెద్ద విస్ఫోటనం జరిగి కళ్ళు తిరిగి కింద ఢామ్మని పడిపోయాడు - చంటాడికి మాత్రమే తండ్రి అయిన మన్మధరావు.



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.